You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నిర్మాణ పనుల కోసం తవ్వితే 500 కిలోల బాంబు బయటపడింది
జర్మనీ రాజధాని బెర్లిన్‌లో నిర్మాణ పనులు చేస్తుండగా రెండో ప్రపంచ యుద్ధం(1939-45) నాటి 500 కేజీల బాంబు ఒకటి బయటపడింది. హీడెస్ట్రాస్సే ప్రాంతంలో బుధవారం బయటపడిన ఈ భారీ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు.
బాంబు కనిపించిన ప్రదేశానికి 800 మీటర్ల పరిధిలోని భవంతుల నుంచి సుమారు 10 వేల మంది ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో నివాస గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పురావస్తు ప్రదర్శనశాలలు, బెర్లిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉన్నాయి. బాంబును నిర్వీర్యం చేశాక రైల్వే స్టేషన్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో చేపట్టిన ముందస్తు చర్యల వల్ల రైలు, బస్సు రవాణా సేవలకు తీవ్ర ఆటంకం కలిగింది.
బెర్లిన్‌లోని టీగల్ విమానాశ్రయంలో దిగాల్సిన విమానాలు ఈ బాంబు కనిపించిన ప్రదేశం మీదుగా వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
బెర్లిన్‌లోని ప్రముఖ వైద్యశాల చారిటీ విశ్వవిద్యాలయం ఆస్పత్రి, సైనిక ఆస్పత్రిలను పాక్షికంగా మూసివేశారు.
ఈ బాంబు బ్రిటన్‌లో తయారైనట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా ఉండిపోయిన బాంబులు జర్మనీలో తరచూ కనిపిస్తుంటాయి. ఇలా బయటపడ్డ బాంబులు వేల సంఖ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువగా నిర్మాణ రంగంలోనివారికి, రైతులకు కనిపిస్తుంటాయి. వీటిని నిర్వీర్యం చేసేందుకు జర్మనీలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక బృందాలు ఉన్నాయి.
ఇలాంటి ఒక బాంబు కనిపించడంతో నిరుడు సెప్టెంబరులో ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో సుమారు 65 వేల మందిని ఖాళీ చేయించారు. తర్వాత బాంబును నిర్వీర్యం చేశారు.
జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు బయటపడిన కొన్ని ఘటనలు:
2017 మే: హనోవర్‌లో మూడు బ్రిటన్ బాంబులు కనిపించడంతో 50 వేల మందిని ఖాళీ చేయించారు.
2016 డిసెంబరు: ఆగ్స్‌బర్గ్‌లో 1.8 టన్నుల బరువైన బ్రిటన్ పేలుడ పదార్థం బయటపడటంతో 50 వేల మందికి పైగా ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు.
2012 జనవరి: యూస్కిర్‌చెన్‌లో తవ్వే సాధనం ఒకటి బాంబుకు తగలడంతో పేలుడు సంభవించింది. నిర్మాణ కార్మకుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
2011 డిసెంబరు: కూబ్లెంజ్‌లో రైన్ నది గర్భంలో రెండు బాంబులు కనిపించడంతో దాదాపు 45 వేల మందిని (నగర జనాభాలో సగం మందిని) ఖాళీ చేయించారు.
2010 జూన్: గోటిజెన్‌లో నిర్మాణ పనులు జరుగుతున్న చోట బయటపడ్డ బాంబును నిర్వీర్యం చేసే ప్రయత్నంలో బాంబు నిర్వీర్యక సిబ్బంది ముగ్గురు చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)