#BBCArchive: కాల బిలాల నాయకుడు స్టీఫెన్ హాకింగ్ స్టీఫెన్ హాకింగ్ మొదటి బీబీసీ ఇంటర్వ్యూ
ఇటీవలే తుది శ్వాస విడిచిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ బీబీసీలో మొదటి సారిగా 1977లో రూపొందించిన "ద కీ టు యూనివర్స్: ది సెర్చ్ ఫర్ ద లాస్ ఆఫ్ క్రియేషన్" అనే డాక్యుమెంటరీలో కనిపించారు.
తనకున్న శారీరక సమస్యలు ఎలా ఉన్నా, ఆయన విద్యార్థులకు పాఠాలు చెబుతూ, పిల్లలతో పార్కులో ఆడుకుంటూ ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తారు. ఆయన జ్ఞాపకాల్ని స్మరించుకుంటూ.. బీబీసీ ఆర్కైవ్స్ నుంచి ప్రత్యేక కథనం.
కాల బిలాలకు సంబంధించిన పరిశోధన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ఇలాంటి యువతరం సిద్ధాంతకర్తల మస్తిష్కాలను పూర్తిగా ఆవహించింది.
ఆలోచనలు సరికొత్త తీరాలను ఛేదిస్తున్నాయి. కాలబిలం సిద్ధాంతాల విస్తృతి, అవగాహన పెరుగుతూ వచ్చింది. దానికి సిసలైన నాయకుడు స్టీఫెన్ హాకింగ్.
ఆయన తన సహ పరిశోధకుడు రోగర్ పెన్ రోజ్‌తో కలిసి పదేళ్ల కిందటే దీనికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను సిద్ధం చేశారు.
కాల బిలం తన కేంద్ర స్థానంలో మరొక అపరిమిత పదార్థాన్ని కలిగి ఉంటుందని వారు చెప్పారు.
నక్షత్రానికి చెందిన పదార్థమంతా రేఖా వలయంలా ధ్వంసమైనప్పుడు, ఒక ఏకత్వంలో ఉనికిలోని పదార్థాలను గురుత్వాకర్షణ నలిపేస్తుంది.
భౌతిక శాస్త్రంలోని ఆ పరిశోధన స్టీఫెన్ హాకింగ్ కృషిని చిరస్మరణీయం చేసింది.
విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి పదమూడేళ్ళుగా ఆయన నరాలు-కండరాల వ్యాధితో పోరాడుతున్నారు.
అన్ని తెలిసే జేన్ ఆయనను పెళ్ళి చేసుకున్నారు. ఆయన ఎక్కువ కాలం బతకరనే అనుకున్నారు. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు. పేర్లు.. లూసీ, రాబర్ట్.
హాకింగ్ ఆత్మన్యూనతకు ఎన్నడూ లోను కాలేదు. శారీరక సమస్య ఉంది కాబట్టి.. ఇక మానసిక సమస్యల జోలికి వెళ్లం కదా అనేవారాయన.
భూమ్యాకర్షణ శక్తి ఆయనను చక్రాల కుర్చీకి పరిమితం చేసి ఉండవచ్చు. కానీ, ఆయన మనసు కాల బిలాల మహా ఆకర్షణ శక్తి రహస్యాలను గుర్తించింది.

కాల బిలాలపై హాకింగ్స్ స్పందిస్తూ.. ‘‘బిగ్ బ్యాంగ్ థియరీ అన్నది కాల బిలాల విస్ఫోటనం లాంటిదే. అయితే, అది చాలా పెద్ద యెత్తున జరిగిన విస్ఫోటనం. కాల బిలం పదార్థాన్ని ఎలా సృష్టించిందన్నది తెలుసుకోగలిగితే, బిగ్ బ్యాంగ్ ఈ విశ్వంలోని పదార్థాన్ని ఎలా సృష్టించిందో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. బిగ్ బ్యాంగ్ ఏకత్వం అన్నది మనకు అందుబాటులో లేని విషయం. బిగ్ బ్యాంగ్‌కు అతీతంగా ఏం ఉంటుందని అడగడం వల్ల ఉపయోగం లేదు. అసలు ఈ విశ్వం అంతా ఎందుకు మనుగడ సాగిస్తోంది? నా కుమారుడు రాబర్ట్ ఎప్పుడూ ఇదేంటి, అదేంటి అని అడుగుతూ ఉంటాడు. ప్రతి పిల్లాడూ అలాగే అడుగుతాడు. అ స్వభావమే మనిషిని గుహలో బతికే దశ నుంచి ఇక్కడి దాకా తీసుకువచ్చింది. ఒక విధంగా చూస్తే, మనం ప్రకృతి దయ వల్ల బతుకుతున్న అతి బలహీనమైన ప్రాణులం. కానీ, మరో విధంగా చూస్తే, ఈ విశ్వ నిర్మాణ రహస్యాలను తెలుసుకున్న రోజు మనిషే ఈ సృష్టికి అధిపతి’’ అన్నారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)