ఘానా: బడి పిల్లల కష్టాలు చూడలేక నీటిపై నడిచే సైకిల్ కనిపెట్టిన యువకుడు!
మీరెప్పుడైనా నీటిపై సైకిల్ తొక్కారా? అది అసాధ్యమని అనుకుంటున్నారా? ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఘానాకు చెందిన ఓ యువకుడు.
అతని పేరు ఫ్రాంక్ డార్కో. దాదాపు ఆరు నెలలు శ్రమించి నీటిపై తొక్కగలిగే సైకిల్‌ను రూపొందించారు. ఇదేదో సరదా కోసం చేసిన ప్రయత్నం కాదు. నదులు, చెరువులు ఈదకుంటూ బడికి పోతున్న పేద పిల్లల కోసం దీన్ని తయారు చేశానని ఫ్రాంకో చెబుతున్నారు.
"నా పేరు ఫ్రాంక్ డార్కో. నేను టాక్‌రాడీలో నివసిస్తున్నాను. మా దేశంలో అనేక మంది పేద పిల్లలకు బడికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. పాఠశాలకు వెళ్లే దారిలో నదులు, చెరువులు ఈదుకుంటూ దాటాల్సి వస్తోంది.
"పిల్లలు ఈదుకుంటూ బడికి వెళ్లే ఒక డాక్యుమెంటరీని చూశాను. ఆ పిల్లల కష్టాలు నాకెంతో బాధను కలిగించాయి. వారి కోసం ఏదైనా చేయాలనే తపన నాలో మొదలైంది. చివరకు నీటిపై తొక్కగలిగే సైకిల్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది" అని ఫ్రాంక్ అన్నారు.
ఈ సైకిల్‌ను బెండు, అల్యూమినియంతో పాటు కొంత కలపను ఉపయోగించి తయారు చేశారు. నీటి మీద తేలాడేందుకు బెండు చెక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి.
సైకిల్ తొక్కుతున్నప్పుడు.. రిమ్‌కు ఉండే తెడ్డులాంటి ప్రొపెల్లర్లు నీటిని వెనక్కి నెడుతుంటాయి. అప్పుడు సైకిల్ ముందుకు వెళ్తుంది.
"చుట్టుపక్కల ఉన్నపేద గ్రామాల్లోని విద్యార్థుల సమస్యకు పరిష్కారం చూపాలన్నదే నా కోరిక" అని ఫ్రాంక్ అన్నారు.
ఈ సైకిల్‌ను తయారు చేయడానికి దాదాపు రూ. 6,500 ఖర్చయ్యాయి. దీన్ని ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. ఇందుకు చాలా డబ్బు అవసరమవుతుంది.
"ఆఫ్రికాలో చాలా మందికి సాంకేతిక పరిజ్ఞానంపై అంతగా పట్టులేదు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే దానిని ఎంతో గర్వంగా భావిస్తాను" అని ఫ్రాంక్ అంటారు.
"భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే మరిన్ని సైకిళ్లు తయారు చేస్తాను. మరింత మందికి ఉపాధి కల్పిస్తాను."
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)