You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘బాంబ్ తుపాను’తో అమెరికా ఈశాన్య ప్రాంతంలో స్థంభించిన జనజీవనం
అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో 'బాంబ్ తుపాను' కారణంగా 17 మంది మృతి చెందారు. గురువారం ఒక్కరోజే సుమారు 4 వేల విమానాలు రద్దయ్యాయి. ఈశాన్య అమెరికా, తూర్పు కెనడాలోని సముద్ర తీర ప్రాంతాలపై దట్టంగా మంచు అలుముకుంది.
'బాంబ్ తుపాను'తో బోస్టన్‌లో సుమారు 45 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. ఈ తుపాను వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది.
గంటలకు 95 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు అమెరికా ఈశాన్య తూర్పు తీరంపై విరుచుకుపడే అవకాశం ఉంది.
శుక్ర, శనివారాల్లో అమెరికాలోని పలు ప్రాంతాల్లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఐస్ బర్గ్‌ల మీద నిలబడవద్దని, అవి కొట్టుకుపోయే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
సుమారు 6 కోట్ల మంది అమెరికన్లపై తుపాను ప్రభావం చూపుతోంది.
తుపాను ప్రభావం వల్ల రైల్వే ఆపరేటర్ 'ఆంట్రాక్' రైళ్ల సర్వీసులను తగ్గించింది. కొన్ని ప్రాంతాలలో బస్సు సర్వీసులను కూడా రద్దు చేశారు.
వాతావరణంలోని మార్పుల ప్రభావంతో అమెరికాలోని దక్షిణ ప్రాంతాలలో కూడా మంచు కురుస్తోంది. లాంగ్ ఐలెండ్ ఎక్స్‌ప్రెస్ వేపై వాహనాలు బారులుగా నిలిచిపోయాయి.
తుపాను కారణంగా మొత్తం 17 మంది మరణించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ తెలిపింది.
టెక్సాస్‌లో ముగ్గురు వ్యక్తులు చలి తీవ్రత కారణంగా మరణించారు.
ఉత్తర కరోలినాలోని మూర్ కౌంటీలో ఓ ట్రక్ తిరగబడ్డంతో ఇద్దరు మరణించారు.
మాసాచూసెట్స్‌లోని కేప్ కాడ్ బే తీరంలో మంచును తట్టుకోలేక థ్రెషర్ షార్కులు మృతి చెంది తీరానికి కొట్టుకువచ్చాయి.
న్యూయార్క్ నగరం, ఫిలడెల్ఫియా, బోస్టన్ , మేరీల్యాండ్, వర్జీనియాలలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
బాంబ్ తుపాను అంటే ఏమిటి
'బాంబ్ తుపాను' లేదా 'వాతావరణ బాంబు' అంటే పేలుడు స్వభావం కలిగిన తుపాను. 24 గంటల వ్యవధిలో అల్పపీడనం 24 మిల్లీబార్స్ మేర పడిపోతే దాని ఫలితంగా ప్రచండమైన వేగంతో గాలులు వీస్తాయి.
ఈ గాలులకు చెట్లను కూల్చివేసే శక్తి ఉంటుంది. భవనాలు దెబ్బ తినే అవకాశం ఉంది.
అట్లాంటిక్ సముద్రంపై ఏర్పడిన ఈ తుపాను కారణంగా బలమైన గాలులు, విపరీతమైన మంచు కురుస్తోంది. ఇది వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది.
న్యూయార్క్‌కు ఉత్తరాన ఉన్న ప్రాంతాలపై ఈ తుపాను ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)