రాయల్ సొసైటీ పబ్లిషింగ్ ఫొటో కాంపిటీషన్‌లో అవార్డు పొందిన ఫొటోలు

అంటార్కిటికాలోని మంచు ఫలకాలను విమానం నుంచి ఫొటో తీసినప్పుడు చక్కెర స్పటికాలుగా కనువిందు చేశాయి.

ఈ ఏటా 'రాయల్ సొసైటీ పబ్లిషింగ్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌'లో ఇదే ఉత్తమ ఫొటోగా నిలిచింది.

ఈ సైన్స్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌కు మొత్తంగా 1,100 ఫొటోలు అవార్డు కోసం పోటీ పడ్డాయి.

ఎర్త్ సైన్స్, బిహేవియర్, మైక్రో ఇమేజింగ్, ఖగోళ, జీవావరణ, పర్యావరణ శాస్త్ర విభాగాల్లో ఉత్తమ ఫొటోలకు అవార్డులు ప్రకటించారు.

వీటిని చూస్తే మంచు స్ఫటికాలుగా కనిపిస్తున్నాయి కదూ.. పీటర్ కన్వే తీసిన ఈ ఛాయాచిత్రం ఉత్తమ ఫొటోగా అవార్డు పొందింది. అలాగే, ఎర్త్ సైన్స్ కేటగిరిలో కూడా దీనికి అవార్డు వచ్చింది. 1995లో దక్షిణ అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని మంచు ఫలకాలను విమానంలోంచి క్లిక్ మనిపిస్తే అది ఇలా అద్భుతంగా కనిపించింది.

సబ్ అంటార్కిటిక్ మేరియన్ ద్వీప తీరంలో తిమింగలాలు తీరం వైపు దూసుకొస్తున్న వేళ పెంగ్విన్లను ఫొటో తీసిన నికో డి బ్రుయిన్‌కు పర్యావరణ, జీవావరణ శాస్త్ర విభాగంలో అవార్డు లభించింది.

దక్షిణార్థగోళంలోని అంటార్కిటికాలో వెన్నెల కాంతితో మెరుస్తున్న మంచు స్ఫటికాలను 'క్లిక్'మనిపించిన డేనియల్ మిచలిక్‌కు ఖగోళ శాస్త్ర విభాగంలో అవార్డు దక్కింది.

తూర్పు గ్రీన్‌లాండ్‌ తీరంలో నీటిలోకి చూస్తున్న ధ్రువ ఎలుగుబంటి ఫొటో తీసిన ఆంటోనియా డోన్సిలాకు బిహేవియర్ కేటగిరిలో అవార్డు వచ్చింది.

వేలాడుతున్న ఆలివ్ నూనె చుక్కలను తీసిన ఈ చిత్రానికిగాను హర్వీ ఎలెట్ట్రోకు మైక్రో ఇమాజింగ్ కేటగిరిలో అవార్డు వచ్చింది.

చనిపోయిన తేలును పైకి ఎగరేస్తున్న పాలపిట్టను అత్యంత చాకచక్యంగా తన కెమెరాలో బంధించిన సుస్మిత దత్తాకు బిహేవియర్ కేటగిరిలో అవార్డు దక్కింది.

పర్నాల్ అబ్జర్వేటరీ నుంచి ఆకాశాన్ని క్లిక్ మనిపించిన పెట్ర్ హొరేలేక్‌కు ఖగోళ శాస్త్ర విభాగంలో బహుమతి దక్కింది.

హవాయిలోని కిలోయవ అగ్నిపర్వతం నుంచి పెల్లుబికిన లావాను ఫొటో తీసిన సబ్రిన కోహ్లేర్‌కు ఎర్త్ సైన్స్ విభాగంలో అవార్డు వచ్చింది.

అమెరికాలో సంభవించిన సూర్య గ్రహణాన్ని అందంగా తీసిన వెయి ఫెంగ్ షే‌కు ఖగోళ శాస్త్ర విభాగంలో ద్వితీయ బహుమతి వచ్చింది.

హప్సిబియస్ డిజార్డిని అనే ఈ ప్రాణి పిండ దశలో ఉన్నప్పుడు వ్లాదిమిర్ గ్రాస్ తన కెమెరాలో బంధించారు. దీనికిగాను ఆయనకు మైక్రో ఇమాజింగ్ కేటగిరిలో ద్వితీయ బహుమతి వచ్చింది.

స్వాల్‌బార్డ్ (నార్వేలోని ద్వీప సముదాయం)లో కనిపించిన ఆర్కిటిక్ టెర్న్ అనే చిన్న పక్షి ఫొటో తీసినందుకు డేవిడ్ కోస్తాంటినీకి బిహేవియర్ కేటగిరిలో ద్వితీయ బహుమతి వచ్చింది.

ఈ ఫొటో తీసినందుకు జీవావరణ, పర్యావరణ శాస్త్ర విభాగం కింద కార్లోస్ జార్డ్ ను సత్కరించారు. వర్షాకాలంలో గ్రీన్ త్రీ జాతి కప్పలు సంతానోత్పత్తికి సిద్ధమవుతున్న దృశ్యాన్ని కార్లోస్ తన కెమెరాలో బంధించారు.

సాలెగూడులో చిక్కుకున్న పురుగును తన కెమెరాతో బంధించిన బెర్నార్డో సెగురాకు మైక్రో ఇమాజింగ్ విభాగంలో అవార్డు వచ్చింది.

ఈ ఫొటో తీసిన థామస్ ఎండ్లీన్‌కు జీవావరణ, పర్యావరణ శాస్త్ర విభాగంలో రెండో బహుమతి వచ్చింది. 'పిట్చర్' అనే ఈ మొక్క తేనేలాంటి ద్రవాన్ని స్రవిస్తూ క్రిములను తనవైపు ఆకర్షిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన చీమలు తప్ప మిగిలిన క్రిములన్నీ ఈ ద్రవాలకు పట్టుకోల్పోయి జారిపోతాయి. చీమలు మాత్రం మొక్కలోని తెగుళ్లను ఆధారంగా చేసుకొని పైకెక్కుతాయి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)