అమెరికాలో జాతి వివక్షపై ఆటగాళ్ల నిరసన, ఉపాధ్యక్షుడు వాకౌట్

ఆదివారం నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ మ్యాచ్ సందర్భంగా కొందరు క్రీడాకారులు నిరసన వ్యక్తపరిచిన తీరు చర్చనీయాంశమైంది.

అమెరికా జాతీయ గీతం ఆలపించేటప్పుడు లేచి నిలబడేందుకు కొందరు ఆటగాళ్లు నిరాకరించి మోకాళ్లపై నిలబడ్డారు. దాంతో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్టేడియం నుంచి వాకౌట్ చేశారు. పెన్స్ సొంత రాష్ట్రం ఇండియానాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

‘‘మా సైనికులను, జాతీయ పతాకాన్ని అగౌరవపరుస్తున్న’’ ఆ కార్యక్రమంలో నేను ఉండలేనని పెన్స్ అన్నారు.

గత కొన్నాళ్లుగా అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో ఆటగాళ్లు మోకాళ్లపై నిలబడి తరచూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ‘‘మన దేశాన్ని అగౌరవపరిచే విధంగా ఎవరైనా ఆటగాళ్లు మోకాళ్లపై నిలబడితే స్టేడియం నుంచి వెంటనే బయటకు వచ్చేయమని పెన్స్‌కు నేనే చెప్పాను. ఆయన్ను చూసి గర్వపడుతున్నా.’’ అని ట్వీట్ చేశారు.

అలా నిరసనలు తెలిపే క్రీడాకారులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ చర్యలకు పాల్పడిన వారిపై నిషేధం విధించాలని నిర్వాహకులకు సూచించారు.

తాజాగా నిరసన తెలిపింది శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 49ఇయర్స్ టీం సభ్యులు అని తెలిసింది.

మా వెబ్‌సైట్‌పై మరి కొన్ని తాజా కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)