You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: చిత్తూరు అడవిలో కరెంటు తీగల ఉచ్చులో చిక్కుకుని ఏనుగు మృతి
- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో కరెంటు ఉచ్చులో చిక్కుకుని ఓ ఏనుగు చనిపోయింది.
చిత్తూరు జిల్లా వి.కోట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం నాడు జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
అడవి పందుల కోసం విద్యుత్ వైర్లతో వేసిన ఉచ్చులో పడి ఏనుగు చనిపోయిందని చిత్తూరు వెస్ట్ డీఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఈ నెల రెండవ తేదీ 4 గంటల సమయంలో కరెంటు వైర్లకు తగులుకుని ఏనుగు చనిపోయిందని దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చైతన్య కుమార్ రెడ్డి చెప్పారు.
''సమాచారం తెలుసుకున్న వెంటనే స్పాట్‌కి వచ్చాం. మా సిబ్బందిని, పోలీసులను, రెవెన్యూ, విద్యుత్ సిబ్బందిని అలర్ట్ చేశాం. ఏ విధంగా జరిగిందన్నది ఎంక్వైరీ చేశాం. ప్రాథమిక విచారణలో, అడవి జంతువుల వేట కోసం సురేష్ అనే వ్యక్తి విద్యుత్ వైర్లతో ఉచ్చు వేయడంతో ఏనుగు చనిపోయినట్లు తెలిసింది'' అని ఆయన తెలిపారు.
సురేష్ మీద కేసు నమోదు చేశామని, నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.
''అడవి జంతువుల మాంస విక్రయం జరుగుతుందని స్థానిక మీడియా ప్రతినిధులు చెప్పారు. నా ఫోన్ నెంబరు 9440810113 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. స్థానికంగా మా సిబ్బంది అందరూ అందుబాటులో ఉంటారు. వైల్డ్ లైఫ్ క్రైమ్ గురించి ప్రజలు కూడా చొరవ తీసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడైనా జరిగినట్టు మా దృష్టికి తీసుకురండి. కచ్చితంగా వారి పైన యాక్షన్ తీసుకుంటాం'' అని చైతన్యకుమార్ రెడ్డి చెప్పారు.
''ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మా సిబ్బంది చర్యలు తీసుకోకపోతే నేను వారి పైన చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి వస్తే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను'' అని ఆయన పేర్కొన్నారు.
చనిపోయిన ఏనుగుకు స్థానికులు పూజలు నిర్వహించారు. దానికి పోస్టుమార్టం నిర్వహించి ఫారెస్ట్ అధికారులు ఖననం చేశారు.
ఇవి కూడా చదవండి:
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
- ‘జూ’లో మనుషులను ఉంచి ప్రదర్శించేవారు.. ఐరోపా దేశాల ‘అమానుషం’
- కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలు
- గ్రహణం సమయంలో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు? నమ్మకాలేంటి, వాటి శాస్త్రీయత ఎంత?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)