You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గుజరాత్: బ్రిడ్జి నదిలో కూలిన ఘటనలో 141 మంది మృతి-ప్రకటించిన అధికారులు
గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో మచ్చు నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం కూలిపోయింది. ఈ ఘటనలో 141 మంది మరణించారు. 177 మందిని ఇప్పటి వరకు రక్షించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 132 మంది మరణించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సాంఘవి వెల్లడించగా, తాజాగ 141 మంది మృతి చెందినట్లు ఐజీ అశోక్ యాదవ్ వెల్లడించారు.
ఇప్పటి వరకు 177 మందిని రక్షించినట్లు కూడా ఏఎన్ఐ పేర్కొంది.
ఈ ప్రమాదంలో గల్లంతైన వారి సమాచారాన్ని తెలుసుకోవడానికి 02822 243300 హెల్ప్ లైన్ నంబరులో సంప్రదించాలని జిల్లా విపత్తు నియంత్రణ సంస్థ అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి సాంఘవి వెల్లడించారు.
ఈ ప్రమాదం జరిగినప్పుడు బ్రిడ్జిపై ఉన్నవారిలో చాలామంది నదిలో పడిపోయారు.
చాలా మందికి గాయాలు కాగా, పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించారు.
నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి 100 ఏళ్లకు పైగా పురాతనమైనది. ఇది చాలా కాలంగా మూసివేసి ఉంది. ఇటీవలే మరమ్మతులు చేసి మళ్లీ తెరిచారు.
దీపావళి తర్వాత గుజరాతీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వంతెనను పున: ప్రారంభించారు. ఈ వంతెన 1.25 మీటర్ల వెడల్సు, 233 మీటర్ల పొడవు ఉంటుంది.
దీపావళి సెలవులు, ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు బ్రిడ్జిపైకి వచ్చారు.
బ్రిడ్జి కూలడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
బ్రిడ్జి కూలిపోయే సమయంలో దానిపై సుమారు 400 మంది ఉన్నారని నివేదికలు తెలుపుతున్నాయి.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు, గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు.
తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని ఆదేశించారు.
ప్రమాద ఘటన గురించి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో పాటు ఇతర అధికారులతో ఆయన మాట్లాడారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కావాల్సిన సహకారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు.
గాయపడినవారికి వెంటనే సరైన వైద్య సహాయం అందించాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదేశించారు.
ఈ విషాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 అందజేస్తామని భూపేంద్ర పటేల్ ప్రకటించారు.
మోర్బీ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన గురించి గుజరాత్ హోం మంత్రి హర్ష్ సాంఘవితో పాటు ఇతర అధికారులతో మాట్లాడినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
స్థానిక యంత్రాంగం సహాయ చర్యలు చేపడుతోందని, త్వరలోనే ఘటనా స్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకుంటాయని ఆయన చెప్పారు.
సహాయక చర్యల్లో పాల్గొనడానికి గాంధీనగర్ నుంచి రెండు, బరోడా నుంచి ఒక ఎన్డీఆర్‌ఎఫ్ బృందం ఇప్పటికే బయల్దేరిందని ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ అతుల్ కర్వాల్ చెప్పారు.
(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)
ఇవి కూడా చదవండి:
- డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?
- పవన్ కల్యాణ్ జనసేన దారేది?
- మోదీ ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగానే అనుకుంటోందా?
- మునుగోడు ఉపఎన్నిక : ‘ఇక్కడ ఓటుకు ఎంఆర్పీ రేటును ఎలా నిర్ణయిస్తున్నారంటే...’’
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)