You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Income Tax: ఆదాయ పన్నును మ్యాగ్జిమం తగ్గించుకోవడం ఎలా?
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
ఆధునిక అమెరికా వ్వవస్థాపకులలో ఒకరైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఓ సందర్భంలో, "ఈ ప్రపంచంలో చావు, పన్ను నుంచి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు."
దాదాపు అన్ని దేశాలలోనూ నిర్దేశిత పరిమితికి మించి ఆదాయం కలిగిన వారంతా ప్రభుత్వానికి తప్పకుండా ఆదాయపు పన్ను చెల్లిస్తుంటారు.
గతంలో కొన్ని అరబ్ దేశాలలో ఆదాయపు పన్ను ఉండేది కాదు. ప్రస్తుతం ఆ దేశాలలోనూ ఈ పన్నును అమలులోకి తీసుకొచ్చారు.
ఈ పరిస్థితుల్లో ఆదాయపు పన్ను నిబంధనల గురించి, ఆ నిబంధనలకు లోబడి ఎలా మదుపు చేయాలి? అనే అవగాహన చాలా ముఖ్యం.
ఏటా జనవరి రెండో వారానికి అటూఇటుగా చాలా కంపెనీలలో మదుపు చేసిన మొత్తానికి సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది.
చాలామంది ఆ సమయానికి దగ్గర్లో హడావిడిగా ఏదైనా మదుపు చేసి, ఆ డాక్యుమెంట్లు దాఖలు చేస్తుంటారు.
అయితే, ఇది సరైన పద్ధతి కాదు. వీలైనంత త్వరగా మదుపు చేయడం మొదలు పెట్టాలి. ఈ ఏడాది ఆ గడువుకు మూడు నెలల సమయం ఉంది. ఈ మూడు నెలల సమయాన్ని ఉపయోగించుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని ఎలా గరిష్ఠంగా లాభం పొందాలో చూద్దాం.
కొత్త పన్ను స్లాబ్ X పాత పన్ను స్లాబ్
ప్రస్తుతం మన దేశంలో రెండు రకాల ఆదాయపు పన్ను రేట్లు అమలులో ఉన్నాయి. గత రెండు, మూడు సంవత్సరాలుగా అమలులోకి వచ్చిన కొత్త టాక్స్ నిబంధనల వల్ల కొందరు ఉద్యోగులకు లాభం చేకూరే అవకాశం ఉంది.
మదుపు మార్గాల మీద మినహాయింపు ఇవ్వని ఆ పద్ధతిని ఎంచుకున్న వారు ఎలాంటి మదుపు చేయాలని ఇప్పుడు అలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏడాది మధ్యలో కొత్త ఆదాయపు పన్ను రేట్ల నుండీ పాత రేట్లకు మారే వెసులుబాటు లేదు.
అసలు ఈ కొత్త పన్ను స్లాబులో ఉండటం ఉపయోగమా? లేక పాత స్లాబులోనే కొనసాగాడమే ఎక్కువ లాభదాయకమా? అనే ప్రశ్నకు సమాధానంగా అన్ని ప్రముఖ ఫైనాన్స్ సైట్లలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
స్థూలంగా చెప్పాలంటే కొత్త పన్ను రేట్ల వల్ల వచ్చే పన్ను కట్టాల్సిన ఆదాయానికి, పాత పద్ధతిలో పన్ను కట్టాల్సిన ఆదాయానికి మధ్య తేడా రూ.75,000 కంటే తక్కువ ఉంటే కొత్త పద్ధతికి వెళ్లడం మేలు.
ఈ తేడా ఎందుకంటే పాత పద్ధతిలో రూ.25,000 దాకా ఆరోగ్య బీమా చెల్లించి ఆ మొత్తం పన్ను కట్టాల్సిన ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చు.
ఆరోగ్య బీమా మన ఆర్థిక భద్రతకు ఎంతో కీలకం కాబట్టి అది కచ్చితంగా చేయాల్సిన ఖర్చు. ఆ వచ్చే పన్ను మినహాయింపు ఎంతో కొంత మన భారాన్ని తగ్గిస్తుంది.
అలాగే నేషనల్ సేవింగ్ స్కీమ్ (NPS) ద్వారా గరిష్టంగా రూ.50,000 దాకా మినహాయింపు పొందవచ్చు.
ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన NPS కూడా ఒక ముఖ్యమైన మదుపు మార్గం. ఈ రకంగా చూస్తే NPS ద్వారా వచ్చే పన్ను మినహాయింపు పొందటం ఉద్యోగులకు లాభదాయకం.
సెక్షన్ 80సీ, 80డీద్వారా వచ్చే పన్ను మినహాయింపు
ఆదాయపు పన్ను గురించిన అన్ని చర్చలలో సెక్షన్ 80 ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది.
భారత ప్రభుత్వం 1961లో తెచ్చిన ఆదాయపు పన్ను చట్టంలో మొత్తం 292 సెక్షన్లు ఉన్నాయి. దీనిలో సెక్షన్ 80లో ఆదాయపు పన్ను నుంచి ఎలాంటి ఖర్చులకు మినహయింపు ఇవ్వాలి అనే వివరాలు ఉన్నాయి.
ప్రస్తుతం సెక్షన్ 80 ద్వారా దక్కే పన్ను మినహాయింపులు చాలా కీలకమైనవి. దీని ద్వారా రూ.లక్షన్నర దాకా పన్ను కట్టాల్సిన ఆదాయం నుంచీ మినహాయింపు పొందవచ్చు.
ఈ మినహాయింపు నుంచీ గరిష్ఠంగా లబ్ధి పొందటానికి వివిధ మదుపు మార్గాలను ఎలా వినియోగించుకోవాలో చూద్దాం.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్
ఉద్యోగుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన ఈపీఎఫ్ ద్వారా ప్రతి ఉద్యోగి బేసిక్ జీతంలో 10% మదుపు చేస్తారు. మరో వైపు కంపెనీలు కూడా ఉద్యోగుల బేసిక్ జీతంలో 12% ప్రావిడెంట్ ఫండ్ ద్వారా జత చేస్తారు.
కానీ కంపెనీలు జత చేసిన మొత్తానికి ఎలాంటి పన్ను వర్తించదు. ఉద్యోగి జమ చేసిన వార్షిక మొత్తం రూ.2.5 లక్షలు మించితే ఆ మొత్తానికి ఆదాయపు పన్ను కట్టాలి.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమంటే.. ఉద్యోగి ద్వారా జమ అయ్యే మొత్తం రూ.2.5లక్షలు దాటాలంటే ఉద్యోగి వార్షిక వేతనం రూ.50లక్షలకు పైగా ఉండాలి.
మన ఆర్థిక లక్ష్యాలలో ఎంతో కీలకమైన ఉద్యోగ విరమణ కోసం చేసే మదుపులో ఈపీఎఫ్ మొదటి స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ మార్గం ద్వారా బేసిక్ జీతంలో 10%-12% కంటే ఎంతో కొంత అధికంగా మదుపు చేయాలి.
ఉదాహరణకు ఒక వ్యక్తి చేతికి వచ్చే జీతం నెలకు రూ.75,000 అనుకుంటే, అందులో రూ.1000 EPF ద్వారా మళ్లించడం వల్ల దైనందిన జీవితంలో ఎలాంటి ఇబ్బంది రాదు. కానీ కొన్నేళ్ల తర్వాత ఇలా మళ్లించిన రూ.1000 ఆ వ్యక్తి భవిష్య నిధికి ఎంతగానో తోడ్పడుతుంది.
ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత ఈపీఎఫ్ ద్వారా జమ అయ్యే వడ్డీ ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది అని గుర్తించాలి.
ఉదాహరణకు ఒక వ్యక్తి 2022లో పదవీ వీరమణ చేసినా కూడా వివిధ కారణాల వల్ల 2025 దాకా ప్రావిడెంట్ ఫండ్ డబ్బు తీసుకోలేదు. ఈ మూడేళ్ల కాలంలో జమ అయిన వడ్డీ ఆదాయపు పరిధిలోకి వస్తుంది. ఈ విషయంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి.
మ్యూచువల్ ఫండ్స్
ఈక్విటీ లింకెడ్ సేవింగ్ స్కీమ్ (ELSS) ద్వారా మదుపు చేసిన మొత్తానికి కూడా ఆదాయపు పన్ను నుంచీ మినహాయింపు పొందవచ్చు.
ఈ మొత్తాన్ని మూడేళ్ల దాకా వెనక్కు తీసుకోలేరు. ఈ నియమం ఉండటం కూడా మంచి విషయమే, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనే మదుపు మార్గం దీర్ఘకాలిక అవసరాలకు వాడే మార్గం.
ఈఎల్ఎస్ఎస్ ద్వారా వచ్చే ఆదాయానికి కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ వర్తిస్తుంది. దాదాపు అన్ని ఫండ్ సంస్థలు తమ ప్రధాన స్కీములలో ఈఎల్ఎస్ఎస్ అవకాశం కల్పిస్తున్నారు.
ఈఎల్ఎస్ఎస్ ద్వారా వచ్చే ఆదాయం మిగిలిన ఈక్విటీ ఫండ్స్ నుంచీ ఆదాయం కంటే కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. కానీ ఈఎల్ఎస్ఎస్ ద్వారా కలిగే పన్ను రాయితీ ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంది.
పన్ను రాయితీ పొందే అవకాశం లేకుంటే ఈఎల్ఎస్ఎస్ కాకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేయడం లాభదాయకం.
సుకన్య సమృద్ధి పథకం
2014 నుంచీ అమలులోకి వచ్చిన ఈ పథకం అమ్మాయిల భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మొదలు పెట్టారు.
మొదటి ఏడాది దీనిపై 9% వడ్డీ ఇచ్చారు. ఆ తర్వాత కొంత తగ్గినా నిలకడగా 7.5% కంటే ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు.
ఆదాయపు పన్ను మినహాయింపును పరిగణలోకి తీసుకుంటే అమ్మాయిల ఉన్నత విద్య లేక ఇతర భవిష్యత్ అవసరాలకు ఉపయోగకరమే.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
15 ఏళ్ల కాలపరిమితి గల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా చాలా ప్రాచుర్యం పొందిన మదుపు మార్గం. ప్రస్తుతం పీపీఎఫ్‌పై వడ్డీ 7.1%గా ఉంది.
ఫిక్సిడ్ డిపాజిట్
ఐదేళ్ల కంటే ఎక్కువ కాల పరిమితి కలిగిన ఫిక్సిడ్ డిపాజిట్ మొత్తం ద్వారా కూడా ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.
వడ్డీ రేట్లు వివిధ బ్యాంకులలో వేరువేరుగా ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర మదుపు మార్గాలతో పోల్చుకుంటే ఫిక్సిడ్ డిపాజిట్ అంత ఆకర్షణీయంగా కనిపించదు.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)