కశ్మీర్ లోయలో హిందువులను ఎందుకు చంపేస్తున్నారు, 1980 నాటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయా?

    • రచయిత, యోగితా లిమాయే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ ఆధీనంలోకి కశ్మీర్‌లోని గోపాల్ పుర గ్రామంలో పాఠశాలకు వెళ్లే దారి అంతా ఓ టీచర్‌కు నివాళులు అర్పిస్తూ విద్యార్ధులు ఏర్పాటు చేసిన ప్రకటనల బోర్డులు కనిపిస్తున్నాయి.

41 సంవత్సరాల రజ్నీ బాలా అనే టీచర్‌ను హత్య చేసిన ప్రాంతంలో ఆరు రాళ్లతో సర్కిల్ చేసి ఉంచారు.

ఉదయం పూట స్కూలు ప్రార్ధనలకు విద్యార్ధులంతా గుమిగూడిన సమయంలో ఒక్కసారిగా టపాకాయలు కాల్చిన శబ్ధం వినిపించింది.

నిత్యం హింసకు నిలయమైన ఆ ప్రాంతంలో ఇలాంటి శబ్ధాలు మామూలే, కానీ అక్కడేదో జరగరానిది జరిగినట్లు కాసేపటికే విద్యార్ధులకు అర్ధమైంది.

మిలిటెంట్లు ఆ స్కూల్‌లో పని చేస్తున్న టీచర్ రజ్నీ బాలాను తలమీద కాల్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ముస్లిం కమ్యూనిటీ మెజారిటీగా ఉన్న ఆ ప్రాంతంలో, ఒక హిందువు అయిన ఆమెను మిలిటెంట్లు టార్గెట్ చేశారని ఆ ప్రాంతంలో చాలామంది బలంగా నమ్ముతున్నారు.

గత ఏడాది కాలంగా అనేకమంది హిందువులు ఇలా కాల్పులకు బలయ్యారు. గత వారం జరిగిన ఈ ఘటన ఇలాంటి వాటిల్లో తాజా పరిణామం.

షోపియాన్ లోని ఓ యాపిల్ తోటలో ఇటీవల సునీల్ కుమార్ భట్‌ను కొందరు కాల్చి చంపారు.

ఈ దాడి జరగడానికి ముందు నుంచే తాము కశ్మీర్ లోయ నుంచి విడిచి వెళ్లిపోవాలని భావించినట్లు రజ్నీ బాలా కుటుంబ సభ్యులు తెలిపారు.

''నెలన్నర కిందటే ఈ స్కూలుకు కిలోమీటరున్నర దూరంలో ఒక హిందూ డ్రైవర్ ను చంపారు. గత కొద్దికాలంగా హిందువులపై దాడులు పెరుగుతున్నాయి. కశ్మీర్‌లోని చాలా ప్రాంతాలలో హిందువులుపై దాడులు జరుగుతున్నాయి. ఈ భయంతోనే రజ్నీ ట్రాన్స్‌ఫర్‌ కోసం అప్లై చేశాం'' అని రజనీ భర్త రాజ్ కుమార్ అత్రి వెల్లడించారు.

చరిత్ర పాఠాలు చెప్పే రజ్నీ, ఈ స్కూల్లో ఐదు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ స్కూలు తనకెంతో నచ్చిందని, ప్రాణభయం లేకపోతే తాను ట్రాన్స్‌ఫర్ కు అప్లై చేసి ఉండేదాన్ని కాదని ఆమె తరచూ తన సహోద్యోగులకు చెప్పేవారు.

''ఆమె చాలా హుందాగల మనిషి. మంచి తెలివితేటలున్నాయి. అందరితో కలిసి పోతుంది. ఆమెకు ఈ స్కూలు పిల్లలే కాదు, ఊరంతా అభిమానులే. ఈ ఘటన తర్వాత అంతా హతాశులయ్యాం'' అని రజనీ సహోద్యోగిని సైమా అఖ్తర్ అన్నారు. ఆమె ఆ స్కూల్లో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్నారు.

వరసగా జరుగుతున్న ఘటనలు 30 ఏళ్ల కిందట మిలిటెంట్లు సాగించిన నరమేధాన్ని తలపిస్తున్నాయి. అప్పట్లో వందలమంది హిందువులు హత్యకు గురికాగా, ప్రాణభయంతో స్థానిక హిందువులు చాలామంది ఇక్కడి నుంచి వలసపోయారు.

1980ల నుంచి ఈ ప్రాంతంలో సైనికుల ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. ఇక్కడ అశాంతిని సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని భారత్ ఆరోపిస్తూ వస్తోంది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ సంఘర్షణలో వేలమంది సైనికులు, మిలిటెంట్లు, సామాన్యపౌరులు మరణించారు.

2003 తర్వాత హిందువులపై దాడులు తగ్గుముఖంపట్టాయి. అయితే, 2010 నుంచి ఇక్కడి నుంచి వెళ్లిపోయిన కశ్మీరీ హిందువులను తిరిగి రప్పించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇళ్లు, ఇతర సౌకర్యాలను కల్పించారు.

గత కొన్ని దశాబ్దాలలో హిందువులను లక్ష్యంగా చేసుకున్న దాడులు ఏ స్థాయిలో జరిగాయన్నది అంచనా వేయాల్సి ఉందని ఈ ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా బీబీసీతో అన్నారు.

''ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరం. గత 10, 15 సంవత్సరాలుగా కేవలం హిందువుల మీదనే కాకుండా, స్థానికుల మీద దాడులు జరిగాయి. ఇటీవలి కాలంలో అవి తగ్గుముఖం పడుతున్నాయి. ఇంతకు ముందున్న దారుణ పరిస్థితులైతే ఇప్పుడు లేవు'' అని మనోజ్ సిన్హా అన్నారు.

కానీ, గత కొన్ని దశాబ్దాలుగా ప్రవాసంలో ఉండి తిరిగి వచ్చిన కశ్మీరీలు మాత్రం, ఇక్కడి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని, తాము తిరిగి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల ద్వారా దక్షిణ కశ్మీర్‌లోని ఒక పునరావాస కాలనీకి చేరుకున్న అనేక మంది కశ్మీరీ హిందువులు తమను తిరిగి తమ ఇళ్లకు పంపాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన దీక్షకు దిగారు.

"మేము తిరిగి వచ్చాం. కానీ, ఇక్కడి పరిస్థితులు ఏమీ మారలేదు. మేం మళ్లీ టార్గెట్ అవుతామని ఊహించలేదు. మాకు ప్రాణభయం ఉంది" అని సందీప్ రైనా అన్నారు. ఆయన పబ్లిక్ సర్వీసెస్‌లో ఇంజనీర్‌గా పని చేశారు.

"1990లలో మా కుటుంబం ఇక్కడి నుంచి పారిపోయినప్పుడు నాకు 10 ఏళ్లు. నా కొడుకు ఇప్పుడు అదే వయస్సులో ఉన్నాడు. మేము మళ్లీ వెళ్లిపోవాలనుకుంటున్నాము" అన్నారాయన.

"నా ప్రక్కన ఎవరైనా తమ జేబులోంచి చేతులు తీస్తే, నన్ను కాల్చడానికి తుపాకీ తీశారేమో అని నేను భయపడుతున్నాను. మేము మా పిల్లలను పాఠశాలకు పంపడం మానేశాం. మేం మా కాంపౌండ్ నుండి బయటకు వెళ్లడం కూడా కష్టమే" అని సంజయ్ కౌల్ అనే గవర్నమెంట్ టీచర్ అన్నారు.

కశ్మీరీ హిందువులను తిరిగి ఈ ప్రాంతంలో పునరావాసం కల్పించడం అనేది బీజేపీ ఎన్నికల వాగ్దానాలలో ఒకటి. కానీ, ఇక్కడి నుంచి వెళ్లిపోవద్దంటూ తమపై ఒత్తిడి వస్తోందని, అంటే ఇది ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోవడమేనని కొందరు కశ్మీరీ హిందువులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించలేదు.

ముస్లింలు మెజారిటీగా ఉన్న కశ్మీర్‌లోని మతపరమైన జనాభా సంఖ్యను మార్చడానికి బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులను, స్థానికేతరులను ఇక్కడికి రప్పిస్తోందని మిలిటెంట్ గ్రూపులు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తోంది.

2019లో కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసింది. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పాలనను ప్రవేశపెట్టింది. బయటి వ్యక్తులు ఇక్కడ భూములను కొనుగోలు చేయడానికి అనుమతించింది. ప్రస్తుతం కశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వం లేదు. పోలీసులు, బ్యూరోక్రసీలోని ఉన్నతాధికారులే పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

2109 నుంచి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో మళ్లీ అలజడి పెరిగింది.

తుర్క్‌వాంగమ్ గ్రామంలో, 20 ఏళ్ల షోయబ్ మహ్మద్ గనీ అనే ముస్లిం యువకుడిని మే 15న కొందరు దుండగులు కాల్చి చంపారు.

గనీ అతని కార్ల స్పేర్‌పార్ట్స్ షాప్ ముందు ఉండగా పారామిలిటరీ పోలీసులు వచ్చారని, చేతులు పైకెత్తాల్సిందిగా అడిగారని, అతను అలా చేయగానే గుండెల మీద కాల్చారని షోయబ్ కుటుంబ సభ్యులు చెప్పారు.

"షోయబ్ ఒక మామూలు పౌరుడు, విద్యార్థి, షాప్ నడుపుకుంటున్నాడు. వాడు చేసిన నేరం ఏంటి?" అని షోయబ్ తండ్రి గులాం మహమ్మద్ గనీ ప్రశ్నించారు.

"మాపై జరిగిన ఈ క్రూరత్వానికి మాకు న్యాయం జరగాలి. మా గుండెలో ఒక భాగాన్ని మా నుండి వేరు చేశారు" అని ఆయన అన్నారు.

అయితే, షోయబ్ ఎదురుకాల్పుల్లో మరణించాడని పోలీసులు, పారామిలటరీ దళాలు బీబీసీకి తెలిపాయి. కానీ, అక్కడ ఎలాంటి ఎదురు కాల్పులు జరగలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే తన కుమారుడికి ఎందుకిలా జరిగిందన్న నిజం బయటకు వస్తుందనే ఆశ తనకు లేదని షోయబ్ తండ్రి చెప్పారు.

''ఇక్కడ మన సొంత ప్రభుత్వం ఉంటే, కనీసం ఎవరినో ఒకరిని బాధ్యులను చేసేది. కానీ, మా మాట వినేవారు, మా తరఫున ప్రశ్నించేవారు ఎవరూ లేరు'' అని మహమ్మద్ గనీ అన్నారు.

ఇటీవలి నెలల్లో భద్రతా బలగాలు పౌరులను హతమార్చినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి కేసుల గురించి బీబీసీ అడిగిన ప్రశ్నలకు భారత ప్రభుత్వం స్పందించలేదు.

''హోంశాఖ నిర్ణయించిన ప్రకారం, సరైన సమయంలో ఇక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడుతుంది'' అంటూ ఎప్పుడో చెప్పకుండా ప్రభుత్వ ఏర్పాటు గురించి చెప్పారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.

"కశ్మీర్‌లో ఎవరూ సురక్షితంగా లేరు. మీరు ఇంటి నుండి బయలుదేరాక, సాయంత్రం తిరిగి వస్తారో లేదో మీకు తెలియదు" అన్నారు మహమ్మద్ గనీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)