గుత్తికోయలు ఎవరు, వారిని ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి ఎందుకు తరిమేస్తున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

"ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల నుంచి తరిమేస్తున్నారు, అన్నీ వదులుకుని వచ్చాం. ఇక్కడ ఉండొద్దంటే, ఎక్కడికి పోవాలి?"

దాదాపు రెండు దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన వేల మంది గిరిజనులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ప్రత్యేకంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో వేల మంది వలసదారులతో వందల గ్రామాలు ఏర్పడ్డాయి.

కొండ ప్రాంతాల్లో పొలాలు సిద్ధం చేసుకున్నారు. పిల్లల్ని కూడా ఇక్కడే చదివిస్తున్నారు. ఎస్టీ సర్టిఫికెట్లు గానీ, భూమిపై హక్కులు గానీ లేకపోయినా ఆధార్, రేషన్ కార్డులతో సరిపెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.

2005 నుంచి కొన్నేళ్ల పాటు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, సల్వాజుడుం దళాల మధ్య జరిగిన పోరులో సర్వం వదులుకుని ప్రాణాలు అరచేత పట్టుకొని దూర ప్రాంతాలకు పోయిన వేల కుటుంబాల్లో అత్యధికులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్నారు.

ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు కూడా చాలా మంది ప్రాణభయంతో తరలిపోయారు. అలాంటి వారికి ఇప్పుడు మరోసారి వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. తమ చేతుల నుంచి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటూ తమకు ఆధారం లేకుండా చేస్తున్నారని వారు వాపోతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ వలస జీవుల స్థితిగతులపై బీబీసీ క్షేత్రస్థాయిలో పర్యటించి అందిస్తున్న కథనం ఇది.

ఎవరు వీళ్లంతా? ఇక్కడెందుకు ఉంటున్నారు?

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో మురియా తెగ ప్రజలు అత్యధికంగా ఉంటారు. గోండు జాతికి చెందిన ఈ గిరిజనులు సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు, సల్వాజుడుం దళాల మధ్య నలిగిపోయారు. ప్రభుత్వ అండదండలున్న సల్వాజుడుం బలగాల మాట వింటే మావోయిస్టులతో ముప్పు, మావోయిస్టులకు అండగా ఉంటే సల్వాజుడుంతో చిక్కు అన్నట్టుగా వారి పరిస్థితి ఉండేది. ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారిన తమ దుస్థితితో చాలామంది తల దాచుకునేందుకు దూర ప్రాంతాలకు వలసపోయారు. ఇలా నిరాశ్రయులైన వారి మొత్తం సంఖ్య 55 వేలుగా ఉంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా అలా వలస వచ్చిన వారి సంఖ్య 30 వేలకు పైబడి ఉంటుందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని 642 గ్రామాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఈ వలసలు జరిగినట్టు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

వీళ్లేం చేస్తుంటారు?

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్ ప్రాంతాల నుంచి నుంచి వలస వచ్చిన వారందరినీ గుత్తికోయలుగా పిలుస్తారు. కానీ అధికారికంగా గుత్త కోయ అంటూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ కోయ జాతి గిరిజనులు ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే వందల గ్రామాలు నిర్మించుకున్నారు. సొంతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ ఉన్న కొండల్లో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

కొన్ని గ్రామాల్లో భూమి చదును చేసుకుని వివిధ పంటలు పండిస్తున్నారు. వరి, రాగి, జొన్నలు, కందులు వంటివి ఎక్కువగా పండిస్తూ పొట్టపోసుకుంటున్నారు. మేకలు, పశు పోషణ కూడా చేస్తుంటారు. వేసవిలో చింతపండు, కుంకుళ్లు వంటి అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని సంతల్లో అమ్ముకుంటూ గడుపుతున్నారు.

"అప్పట్లో ఎటు వెళ్లాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. కొండలు దాటుకుంటూ వచ్చాం. అది ఏ రాష్ట్రమో కూడా తెలియదు. అంతా అడవుల మధ్యలో ఇక్కడ బాగుందని తలదాచుకున్నాం. గూడు కట్టుకున్నాం. మా ఊరికి రోడ్డు లేకపోయినా ప్రాణాలు నిలిస్తే చాలని అనుకున్నాం. ఒకరి తర్వాత ఒకరిగా వచ్చి ఊరుగా మారాము. మొదట్లో భాష తెలియక కష్టపడ్డాం. ఇప్పుడు చాలామందికి తెలుగు వచ్చు. కోయ భాష మాట్లాడుతాం, తెలుగు కూడా అర్థం చేసుకుంటాం. ఇక్కడి వాళ్లతో కలిసిపోయాం" అంటూ తెలంగాణ పరిధిలో ఉన్న క్రాంతినగర్ గ్రామ వాసి పొడియం లింగయ్య బీబీసీతో అన్నారు.

లింగయ్యతో పాటు సుమారు 23 కుటుంబాలు ఇప్పుడు ఆ గ్రామంలో నివసిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో ఇలాంటి గ్రామాలు 12 వరకూ ఉన్నాయి. ఆ జిల్లాతోపాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి లాంటి జిల్లాల్లో కూడా అత్యధికంగా ఈ గుత్తికోయలు నివసిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురం జిల్లాల్లో పెద్ద సంఖ్యలో వీరు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.

ఇప్పుడు సమస్య ఏమిటి?

పెద్ద సంఖ్యలో ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన ఈ నిరాశ్రయులకు, స్థానికులకు మధ్య గతంలో సమస్యలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత క్రమంగా అవి తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో ప్రభుత్వాలు మాత్రం వారిని తిరిగి సొంత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు చేశాయి. కానీ అత్యధికులు తిరిగి ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లేందుకు నిరాకరించడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

గుత్తికోయలుగా పిలుస్తున్న వారి పిల్లలు ఏపీ, తెలంగాణా పరిధిలో ఉన్న గిరిజన పాఠశాలల్లో చదువుతున్నారు. తెలుగు మీడియంలోనే చదువులు కొనసాగిస్తున్నారు. వారికి ఎస్టీ సర్టిఫికెట్లు మంజూరు కావడం లేదు. రేషన్ కార్డులు , ఆధార్ కార్డులు మాత్రం మంజూరు చేశారు. వాటితో జీసీసీ ద్వారా రేషన్ సరకులు అందుకుంటున్నారు. కోయదొర గిరిజన తెగకు చెందిన వారి మాదిరిగానే పొడియం, ముడియం, చోడి సహా వివిధ ఇంటిపేర్లు వీరికి ఉంటాయి. ఎస్టీ సర్టిఫికెట్ మంజూరు కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గతంలో తమను ఎస్టీలుగా గుర్తించినట్టు ఆధారాలు చూపించాలని అడుగుతున్నారని చోడి జోగయ్య బీబీసీకి తెలిపారు.

"ఒక్కరూ హైస్కూల్ దాటినవారు లేరు"

"మా పిల్లల చదువులు అంతంతమాత్రమే. హైస్కూల్ దాటిన వారు ఒక్కరూ మా గ్రామాల్లో లేరు. కాబట్టి సర్టిఫికెట్లు అవసరం రాలేదు. కానీ మేము చదును చేసుకుని, పంటలు పండించుకున్న భూములు లాగేసుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని మొక్కలు నాటేస్తున్నారు. దాంతో మాకు పండించుకోవడానికి ఆధారం లేకుండా పోయింది. ఆ భూమి ఉంటే వర్షాధారంగా వరి కూడా పండించేవాళ్లం. ఇప్పుడు మా భూముల నుంచి మమ్మల్ని పొమ్మంటే ఎక్కడికి పోవాలో తెలియడం లేదు" అంటూ ఆయన వాపోయారు.

జోగయ్య నివసిస్తున్న లక్ష్మీదేవిపల్లి మండలంలోని క్రాంతినగర్ గ్రామానికి సమీపంలో రెండు, మూడేళ్ల క్రితం అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలు ఉన్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణలో అటవీ మొక్కల పెంపకం చేపట్టినట్టు బోర్డులు కూడా ఉన్నాయి.

జోక్యం చేసుకున్న హైకోర్టు

తెలంగాణ పరిధిలోని గ్రామాల్లో నిరాశ్రయులైన గుత్తికోయల నుంచి భూములను అటవీ అధికారులు బలవంతంగా తీసేసుకుంటున్నారని గతంలో ఉమ్మడి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిధిలో కొన్ని గ్రామాలను ఖాళీ చేయించేందుకు ఇళ్లను కూడా కూల్చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వారంతా తిరిగి వెళ్లిపోవాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారనే అభియోగాలు నమోదయ్యాయి.

సుమారుగా 500 మంది నిరాశ్రయులు ఈ ఏడాది ఫిబ్రవరిలో నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణకు లేఖ రాశారు.

2018లో అప్పటి ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు ఇస్తూ స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన వారి చేతుల్లో ఉన్న భూములను తిరిగి తీసుకోవడం గానీ, వారి ఇళ్లను ధ్వంసం చేయడానికి గానీ పూనుకోవద్దంటూ ఉత్తర్వులు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని కొన్ని సంస్థలు ఆరోపిస్తున్నాయి. కోర్టు ఆదేశాలను అమలుచేయాలని గుత్తికోయల సమస్యలపై పనిచేస్తున్న ఎన్జీవోకి చెందిన శుభ్రాంశు చౌదరి బీబీసీతో అన్నారు.

"అంతర్రాష్ట్ర నిరాశ్రయుల సంఖ్య మీద స్పష్టత లేదు. ఇటీవల కొంత ప్రయత్నం చేసి వివరాలు సేకరించారు. కానీ న్యాయస్థానం ఆదేశాలు అమలు చేయడంలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక్కడి నుంచి తరలివెళ్లాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. కానీ మావోయిస్టులు మాత్రం వారిని అంగీకరించడం లేదు. దాంతో వారికి తగిన విధానం అవసరం. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. సంబంధిత అన్ని రాష్ట్రాలను సంప్రదించాలి. ఈ రెండేళ్లలో చాలా భూములు తీసేసుకున్నారు. దాంతో కూలీలుగా మారిపోయారు. వారిని ఆదుకోవాలి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం వారిని వెనక్కి రావాలని చెబుతోంది. కానీ మావోయిస్టులతో వారికి సమస్య ఉంది. కాబట్టి దీనికి ఓ శాశ్వత పరిష్కారం అవసరం" అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.

ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవతో అమలుచేసిన పునరావాస ప్రణాళికతో అక్కడి స్థానికులకు ఉపశమనం దక్కిందని, దానినే ఛత్తీస్‌గఢ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సి వచ్చిన వారికి కూడా అమలుచేయాలని సూచించారు.

"మమ్మల్ని ఎక్కడా ఉండనివ్వడం లేదు"

"ఛత్తీస్‌గఢ్‌లో మా ప్రాణాలకే దిక్కులేదని కొంపా, గోడు వదులుకుని వచ్చేశాం. మా పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, అడవి కొట్టుకుని భూమి సాగు చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉండొద్దంటే మేం ఎక్కడికి పోవాలి. అడవి వదిలేసి రోడ్డు వైపు రావాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అక్కడికి వస్తే మాకు తిండి ఎలా.. మా గొడ్లు, మేకలు, పందులు ఏమి కావాలి. మా జీవితాలకు అప్పుడూ, ఇప్పుడూ ధీమా లేదు. ఎక్కడా మమ్మల్ని ఉండనివ్వడం లేదు" అంటూ పొడియం ఆదెమ్మ ఆందోళన వ్యక్తం చేశారు.

తాము ఇక్కడికి వచ్చి ఎన్నేళ్లవుతుందో కూడా గుర్తు లేదని, ఇక్కడే జీవించేందుకు అనుమతించాలని ఆమె కోరుతున్నారు.

ఆదెమ్మ నివాసం ఉంటున్న ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంచినీటి బోరు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఒకటి రెండు సోలార్ దీపాలు కూడా పెట్టారు. అంతకుమించి ఆ గ్రామానికి రోడ్డు, మంచినీరు, విద్యుత్ వంటి సదుపాయాలు ఏమీ లేవు. అయినప్పటికీ అడవిని నమ్ముకున్న తమకు అన్యాయం చేయవద్దని ఆమె బీబీసీతో అన్నారు.

గుత్తికోయలు అటవీ ప్రాంతాల్లో కొనసాగితే మావోయిస్టులు వారిని ఆసరాగా చేసుకునే ప్రమాదం ఉందనే అనుమానాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికార యంత్రాంగంలో ఉన్నాయి. వారిని ఖాళీ చేయిస్తే మావోయిస్టులకు మార్గం లేకుండా చేసినట్టవుతుందని అధికారులు ఆలోచిస్తున్నారని, అందుకే బలవంతంగానైనా వారిని సొంత రాష్ట్రానికి తరలించే యత్నాలు సాగుతున్నాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. పేరు ప్రచురించేందుకు అంగీకరించని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఒకరు ఇదే అభిప్రాయాన్ని బీబీసీ వద్ద వెలిబుచ్చారు. అడవిని వదిలి రోడ్డు వెంబడి నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పడానికి కారణమదేనని ఆయన తెలిపారు.

సొంత రాష్ట్రంలో సర్వం కోల్పోయి, ఇప్పుడు నివసిస్తున్న రాష్ట్రాల్లో హక్కులు లేకుండా జీవిస్తున్న తమకు రక్షణ కల్పించాలని ఏప్రిల్ 6న దిల్లీలో ఈ నిరాశ్రయులు కొందరు ఆందోళన కూడా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

ఇటీవల ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా వీరి సమస్య మీద స్పందించింది. మావోయిస్టుల హింస కారణంగా నష్టపోయిన వారందరికీ పునరావాసం కల్పిస్తామని అక్కడి ముఖ్యమంత్రి భూపేశ్ బగేల్ ప్రకటించారు. వసతి, రేషన్ , విద్య, ఉపాధి వంటివి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

చట్టం ప్రకారమే వ్యవహరిస్తున్నాం: అధికారులు

గుత్తికోయల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ, తెలంగాణ అధికారులు చెబుతున్నారు.

నిరాశ్రయుల విషయంలో అధికారులు దౌర్జ్యన్యంగా వ్యవహరిస్తున్నారంటూ సాగుతున్న ప్రచారం వాస్తవం కాదని ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం అధికారులు ఒక ప్రకటనలో చెప్పారు.

గుత్తికోయల సమస్యపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులను బీబీసీ సంప్రదించింది. కానీ స్పందించేందుకు వారు నిరాకరించారు. నిబంధనలను అనుసరించి, చట్టం ప్రకారమే వ్యవహరిస్తున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు.

గుత్తికోయల విషయంలో హైకోర్టు ఆదేశాలు పాటిస్తున్నామని, ఎవరినీ బలవంతంగా తరలించే చర్యలకు పూనుకోవడం లేదని అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీశాఖ అధికారులు బీబీసీకి తెలిపారు.

ప్రభుత్వాల ప్రకటనలు, అధికారుల మాటలు ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ వలసజీవులు కనీస వసతులు కూడా లేకుండా, నిత్యం అనిశ్చితిలో, అభద్రతతో బతుకు వెళ్లదీస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)