యుక్రెయిన్‌ యుద్ధం, సముద్రంలో షిప్ హైజాకింగ్ నుంచి తప్పించుకుని బయటపడ్డ భారతీయ జంట

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

భారతదేశంలోని కేరళకు చెందిన ఈ దంపతులు రెండు అంతర్జాతీయ వివాదాల్లో చిక్కుకున్నారు. ఎట్టకేలకు, ఎలాగోలా వాటి నుంచి బయటపడి ఇంటికి చేరుకున్నారు.

ఈ ఏడాది జనవరిలో ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు ఒక పౌర కార్గో నౌకను హైజాక్ చేశారు. దానిలో ఏడుగురు భారతీయ సైనికులు చిక్కుకున్నారు. వారిలో అఖిల్ రఘు (26) ఒకరు.

ఆయన భార్య జితినా జయకుమార్ (23) యుక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్నారు. అఖిల్‌ హైజాక్ అయిన వార్త విని ఆందోళనపడ్డారు. ఆయన సురక్షితంగా ఇంటికి వచ్చేలా చూడమని ప్రభుత్వ అధికారులకు ఫోన్లు, ఈ-మెయిల్స్ ప్రారంభించారు.

ఇంతలో, ఫిబ్రవరి చివర్లో రష్యా యుక్రెయిన్‌పై దాడి ప్రారంభించింది. దాంతో, జితినా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.

ఆమెకు ఇప్పుడు రెండు సమస్యలు.. తాను సురక్షితంగా భారత్ చేసుకోవాలి. తన భర్త క్షేమంగా తిరిగి వచ్చే ప్రయత్నాలు కొనసాగించాలి.

రఘు, ఆయన సహోద్యోగులు గత వారం విడుదలయ్యారు. వారంతా యెమెన్‌లో 112 రోజులు నిర్బంధంలో ఉన్నారు.

జితినా కూడా క్షేమంగా భారతదేశం చేరుకున్నారు. ప్రస్తుత్రం ఈ జంట కేరళలోని కొచ్చిలో తమ ఇంట్లో ఉన్నారు.

"ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఈ నాలుగు నెలలు బతుక్కు, చావుకు మధ్య నడిచింది" అని జితినా బీబీసీతో చెప్పారు.

ఓడ హైజాకింగ్

రఘు, జితినాలకు గత ఆగస్టులో వివాహం జరిగింది. ఒక నెల తరువాత రఘు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-ఫ్లాగ్డ్ కార్గో షిప్ 'ర్వాబీ'లో డెక్ క్యాడెట్‌గా చేరారు.

జితినా యుక్రెయిన్‌లో కీయెవ్ మెడికల్ యూనివర్సిటీలో ఆరవ సంవత్సరం మెడిసిన్ చదువుతున్నారు. పెళ్లయిన తరువాత ఆమె చదువు కొనసాగించేదుకు కీయెవ్ వెళ్లారు.

2022 జనవరి 2న ఉదయం, ర్వాబీ సిబ్బందికి ఓడ వెనుక నుంచి కాల్పులు వినిపించాయి.

"సుమారు 40 మంది చిన్న చిన్న పడవల్లో వచ్చి మా ఓడను చుట్టుముట్టారు. అందరూ ఓడలోకి ప్రవేశించారు. మా ఓడ హైజాక్ అయిందని మాకు అర్థమైంది" అని శ్రీజిత్ సజీవన్ చెప్పారు. శ్రీజిత్ ర్వాబీలో ఆయిలర్‌గా పనిచేసేవారు. రఘుతో పాటు ఆయన కూడా తిరుగుబాటుదారుల చేతిలో చిక్కుకున్నారు.

ఈ ఘటనతో అఖిల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీని గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేరు.

ర్వాబీ ఓడ సౌదీ అరేబియాకు సైనిక సామాగ్రిని తీసుకువెళుతోందని భావించి హౌతీ తిరుగుబాటుదారులు దానిపై దాడి చేశారు. యెమెన్‌లో ఏడేళ్లకు పైగా ప్రభుత్వానికి, తిరుగుబాటుదారులకు మధ్య కార్చిచ్చు రగులుతూనే ఉంది. అక్కడి ప్రభుత్వానికి సౌదీ మద్దతు ఉంది.

ఓడలోని 11 మంది సిబ్బందిని 15 రోజులకొకసారి యెమెన్ రాజధాని సనాలో ఓ హోటల్‌కు, ఓడకు మధ్య తిప్పుతూనే ఉన్నారని శ్రీజిత్ చెప్పుకొచ్చారు.

"మమ్మల్ని ఓ హోటల్ గదిలో బంధించి ఉంచ్చారు. బయటకు అడుగుపెట్టనివ్వలేదు. అయితే, మాకేం కావాలో అది ఆర్డరు చేసుకుని తినవచ్చని చెప్పారు."

నిర్బంధంలో ఉన్నంత కాలం వాళ్లు ఆ గదిలోనే ఉన్నారు. ఓడ పైకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే వెలుగు చూసేవారు.

హౌతీల నియంత్రణలో ఉన్న సనా నగరంలో బాంబు దాడి జరిగిందని విని, బందీలుగా ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు.

"మా హోటల్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలపై బాంబు దాడి జరిగిందన్న వార్తను టీవీలో చూశాం" అని శ్రీజిత్ చెప్పారు.

మొదటి రెండు నెలలూ, ప్రతి 25 రోజులకొకసారి బందీలకు కుటుంబాలతో ఫోన్‌లో మాట్లాడడానికి అనుమతి ఇచ్చేవారు. తరువాత, ప్రతి 15 రోజులకొకసారి ఫోన్లు చేయనిచ్చేవారు.

తిరుగుబాటుదారులు మొదట్లో కఠినంగా వ్యవహరించినా, రాను రాను మెత్తబడ్డారని, తమ చేతిలో బందీలుగా ఉన్నవారు అమాయకులని గ్రహించిన తరువాత, వాళ్లు మరిన్ని సడలింపులు ఇచ్చారని శ్రీజిత్ చెప్పారు.

తిరుగుబాటుదారులలో ఒకరికి ఇంగ్లిష్ వచ్చు. ఆయనే వాళ్లకు, వీళ్లకు మధ్య సంధానకర్తగా వ్యవహరించేవారు.

"మమ్మల్ని ఎప్పుడు విడిచిపెడతారని అడిగేవాళ్లం. సమాధానంగా ఇన్షా అల్లాహ్ అని మాత్రమే చెప్పేవారు" అని శ్రీజిత్ అన్నారు.

బంకర్‌లో తలదాచుకుంటూ..

ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కీయెవ్‌లో ఉన్న జితినాకు అనుమానమొచ్చింది.

జితినా అన్నయ్య గతంలో అదే షిప్పింగ్ కంపెనీలో పనిచేశారు. అఖిల్ రఘు ఉన్న ఓడను హైజాక్ చేశారని ఆయన తన చెల్లెలికి చెప్పారు.

వెంటనే, జితినా భారతదేశంలోని ప్రభుత్వ అధికారులను సంప్రదించి సహాయం అర్థించారు. స్నేహితులు ఆమెకు బాసటగా నిలిచారు.

యుక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభం కాగానే, జితినా, ఆమె స్నేహితులు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న ఒక బంకర్‌లో తలదాచుకున్నారు. ప్రారంభంలో, కీయెవ్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించడం కష్టమైంది. దాంతో, జితినా ఆశలు సన్నగిల్లుతూ వచ్చాయి.

"మమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరూ తప్పించలేరు అనిపించింది" అని జితినా చెప్పారు.

యెమెన్‌లో, ఆమె భర్త అఖిల్ టీవీలో యుక్రెయిన్ యుద్ధ వార్తలు చూసి తీవ్రంగా ఆందోళన చెందారు.

"మా కుటుంబాలకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, యుక్రెయిన్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని అర్థమైంది. అక్కడ ఏం జరుగుతోందో మాకు తెలియలేదు" అని శ్రీజిత్ చెప్పారు.

ఎట్టకేలకు, మార్చి రెండవ వారంలో జితినా యుక్రెయిన్ నుంచి బయటపడగలిగారు. ముందు ట్రైన్‌లో హంగేరీ వెళ్లి, అక్కడి నుంచి విమానంలో భారతదేశం వచ్చారు.

కేరళ చేరిన తరువాత, తన భర్త విడుదల కోసం అధికారులను సంప్రదిస్తూ, ప్రయత్నాలు కొనసాగించారు.

జిబౌటీలోని భారత రాయబారి రామచంద్రన్ చంద్రమౌళి చాలా సహాయపడ్డారని జితినా చెప్పారు. ఇప్పుడు సనాలోని భారత రాయబార కార్యాలయం తాత్కాలికంగా జిబౌటీ నుంచి పనిచేస్తోంది.

"ఆయన బందీలందరి కుటుంబాలతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏ సమయంలోనైనా మేం ఆయనను కాంటాక్ట్ చేయవచ్చు. హైజాకర్ల చేతిలో బందీలుగా ఉన్నవారు తప్పకుండా విడుదల అవుతారుగానీ కాస్త సమయం పడుతుందని ఆయన మాకు చెప్పారు" అని జితినా వివరించారు.

చివరికి ఇంటికి చేరుకున్నారు...

ఏప్రిల్‌లో, ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైనప్పుడు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం ప్రభుత్వం, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య రెండు నెలల సంధికి అంగీకారం కుదిరింది.

అదే సమయంలో భారత ప్రభుత్వం, ఒమన్‌తో పాటు మరికొన్ని దేశాల సహాయం తీసుకుని బందీలను విడిపించింది.

అఖిల్ స్వయంగా ఫోన్ చేసి మాట్లడేవరకు ఆయన విడుదలైన విషయాన్ని నమ్మలేకపోయానని జితినా చెప్పారు.

గతవారం అఖిల్ కేరళ చేరుకున్నారు. జితినాకు బహుమతిగా ఒక హారం, జాంబియా (యెమెనీ సంప్రదాయ చురకత్తి) తీసుకొచ్చారు. ఆ జాంబియాను హైజాకర్లు అఖిల్‌కు ఇచ్చారు.

విడుదల అయి, స్వదేశానికి చేరుకోవడం "పునర్జన్మలా" అనిపించిందని శ్రీజిత్ అన్నారు.

అయితే, ఈ మొత్తం వ్యవహారం అఖిల్‌ను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, ఆయన బాగా దిగిలుపడిపోయారని జితినా చెప్పారు.

"చాలా బరువు తగ్గిపోయారు. కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కూడా వచ్చేశాయి" అని ఆమె అన్నారు.

మరి, జితినా ఈ పరీక్షను ఎలా దాటారు?

"నాకు బాధ కలిగినప్పుడల్లా, దేవుడిని ప్రార్థించాను. నేను ఏడిస్తే, మా అమ్మ, నాన్న మరింత బెంబేలెత్తిపోతారు. అందుకే, వాళ్ల ముందు ఏడవకుండా నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నించాను. కానీ, బాత్రూంలోకెళ్లి రహస్యంగా ఏడ్చేదాన్ని. నేనెలా నిలబడ్డానో నాకే తెలీదు. ఆయన ఎలాగైనా తిరిగి వస్తారని మనసులో గట్టిగా అనిపించేది" అని జితినా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)