You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జస్టిస్ ఎన్.వి. రమణ: 'పాలన చట్టబద్ధంగా సాగితే, పోలీసులు పారదర్శకంగా ఉంటే ప్రజలు కోర్టులకు రావాల్సిన అవసరమే ఉండదు'
కోర్టులు వెలువరించిన నిర్ణయాలను చాలాసార్లు ప్రభుత్వాలు ఏళ్ల తరబడి అమలు చేయడం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం దేశానికి మంచిది కాదని చెప్పారు. చాలాసార్లు న్యాయవిభాగం చేసే సూచనలను, అభిప్రాయాలను పట్టించుకోకుండా కార్యనిర్వాహక విభాగం నిర్ణయాలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.
దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 11వ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ట్రిబ్యూనళ్ల అధిపతులు, న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సదస్సులో ప్రసంగిస్తూ జస్టిస్ రమణ... ''శాసనసభ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల బాధ్యతలను రాజ్యాంగంలో వివరంగా విభజించారు. కాబట్టి ఆయా వ్యవస్థలు తమ లక్ష్మణ రేఖ పట్ల అప్రమత్తంగా ఉండాలి. చట్టపరంగా పాలన సాగుతుంటే, అందులో న్యాయశాఖ ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోదు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటే, కేసుల దర్యాప్తులో పోలీసులు పారదర్శకంగా ఉంటే, పోలీస్‌స్టేషన్లలో ఎలాంటి అక్రమాలు, మరణాలు సంభవించకుండా ఉంటే ప్రజలు కోర్టుల గడప తొక్కాల్సిన అవసరమే ఉండదు'' అని అన్నారు.
'కోర్టు తీర్పుల అమలులో ఏళ్ల తరబడి జాప్యం'
ప్రభుత్వాల నిర్లక్ష్యవైఖరిని జస్టిస్ రమణ ప్రశ్నించారు. ''ప్రభుత్వాలు, ఏళ్ల పాటు కోర్టు నిర్ణయాలను అమలు చేయడం లేదు. కోర్టులు తీర్పులు వెలువరించినప్పటికీ ప్రభుత్వాలు సోమరితనంగా వ్యవహరిస్తున్నాయి. దేశానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదు. విధానాలు రూపొందించడం మా పని కాదు. కానీ, ఎవరైనా పౌరుడు దీనికి సంబంధించిన ఫిర్యాదుతో మా వద్దకు వస్తే, న్యాయవ్యవస్థ వెనకడుగు వేయదు'' అని ఆయన వివరించారు.
న్యాయవ్యవస్థపై పడే భారాన్ని ఒక పెద్ద సమస్యగా ఆయన అభివర్ణించారు. చట్టాలు రూపొందించేటప్పుడు, వాటి బారిన పడేవారిని దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.
''తీవ్రమైన చర్చలు, వాదనలు జరిగిన తర్వాతే చట్టాన్ని చేయాలి. సంబంధిత వ్యక్తుల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. నిజానికి కార్యనిర్వాహకశాఖ నిర్లక్ష్యపనితీరు, శాసన వ్యవస్థల నిష్క్రియాపరత్వం కారణంగా చాలా కేసులు కోర్టుల వరకు వస్తాయి. వీటి కారణంగా న్యాయవ్యవస్థపై భారం పెరుగుతుంది'' అని వివరించారు.
'కేంద్రం రద్దు చేసినా, రాష్ట్రాలు చేయట్లేదు'
జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడిన తర్వాత ఇదే వేదికపై ప్రధాని మోదీ ప్రసంగించారు. 2015లో కేంద్రం... ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా లేని 1800 చట్టాలను గుర్తించిందని మోదీ చెప్పారు. ఇందులో నుంచి 1450 చట్టాలను కేంద్రం రద్దు చేసిందని, అయితే రాష్ట్రాలు మాత్రం వీటిలో నుంచి కేవలం 75 చట్టాలనే రద్దు చేశాయని ఆయన తెలిపారు.
''న్యాయ వ్యవస్థను మెరుగుపరచడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. న్యాయ వ్యవస్థ సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, మెరుగుపరచడానికి పనిచేస్తున్నాం'' అని అన్నారు.
''న్యాయ వ్యవస్థలో సాంకేతికత వినియోగాన్ని డిజిటల్ ఇండియా మిషన్‌లో ఒక కీలక భాగంగా భారత ప్రభుత్వం పరిగణిస్తుంది. ఈ మిషన్‌లో భాగంగానే నేడు ఈ-కోర్టు ప్రాజెక్టు అమలు అవుతోంది'' అని చెప్పారు.
కోర్టుల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలని మోదీ అన్నారు. దీనివల్ల న్యాయ వ్యవస్థపై సామాన్య వ్యక్తులకు నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏమన్నారు...
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచేందుకు కృషి చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు, కేంద్ర న్యాయశాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.
రాష్ట్ర హైకోర్టులో గతంలో 12 మంది న్యాయమూర్తులు ఉండగా కొత్తగా 17 మందిని నియమించారు. ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారంటే జస్టిస్ రమణ ప్రత్యేక కృషి ఫలితమేనని చెప్పారు.
కోర్టుల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్న మౌలిక వసతులు, ఖాళీ పోస్టుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిదని, మౌలికవసతుల కల్పన, ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యమిస్తూ.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కూడా ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- ప్రశాంత్ కిశోర్: 'కొత్త పార్టీ గురించి రెండు మూడు రోజుల్లో చెబుతా' - బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ
- పోర్న్ వీడియోలను పొరపాటున ఓపెన్ చేశానన్న బ్రిటన్ ఎంపీ నీల్ పరీశ్
- వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై ఎవరు దాడి చేశారు? ఏలూరులో ఈ హత్యా రాజకీయాలు ఎందుకు
- ఆర్కిటిక్ ప్రాంతంపై హక్కులెవరికి ఉన్నాయి? అక్కడ ఆయిల్, గ్యాస్ ఎవరైనా తవ్వుకోవచ్చా
- ‘మా నాన్న కనీసం ఆసుపత్రిలో చనిపోయారు, వేలాది మంది రోడ్ల మీదే ప్రాణాలొదిలారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)