రోహిత్ శర్మ భారత టెస్ట్ క్రికెట్ కొత్త కెప్టెన్‌... శ్రీలంక సిరీస్‌కు జట్టును ప్రకటించిన సెలెక్షన్ కమిటీ

భారత క్రికెట్ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ అధికారికంగా నియమితులయ్యారు. రాబోయే శ్రీలంక సిరీస్‌లో రోహిత్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

ఫామ్ లేమి కారణంగా అగ్ర క్రికెటర్లు చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలను ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు.

భారత్ వేదికగా జరగనున్న శ్రీలంక సిరీస్ కోసం ఆలిండియా సెలక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది.

శ్రీలంక సిరీస్ మొత్తానికి కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ దూరమైనట్లు సెలక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ చెప్పారు. శార్దూల్ ఠాకూర్‌కు కూడా విశ్రాంతినిచ్చారు. జట్టులోకి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు... మ్యాచ్ సమయానికి పూర్తిగా ఫిట్‌గా ఉంటేనే జట్టులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. పునరావాసంలో ఉన్న అక్షర్ పటేల్, రెండో టెస్టు మ్యాచ్ సమయానికి కోలుకుంటారని చేతన్ శర్మ వెల్లడించారు.

శ్రీలంకతో సిరీస్‌కు జట్టు ప్రకటన సందర్భంగా మాట్లాడిన చేతన్ శర్మ... కేవలం లంక సిరీస్‌కు మాత్రమే పుజారా, రహానే దూరంగా ఉంటారని అన్నారు. వారిద్దరూ రంజీ ట్రోఫీలో ఆడుతున్నారని చెప్పారు. ఇద్దరు పెద్ద ప్లేయర్లు రంజీ ట్రోఫీలో ఆడటం చాలా మంచి పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.

రోహిత్ శర్మ పర్యవేక్షణలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రాలను భవిష్యత్ కెప్టెన్లుగా తీర్చిదిద్దుతామని చేతన్ శర్మ అన్నారు.

స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌లో శ్రీలంకతో భారత్ మూడు టి20లు, 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 24న తొలి టి20 మ్యాచ్ లక్నోలో జరుగుతుంది. మిగతా రెండు మ్యాచ్‌లను ఫిబ్రవరి 26, 27 తేదీల్లో ధర్మశాలలో నిర్వహిస్తారు.

టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది.

మొహాలీలో మార్చి 4 నుంచి 8 వరకు తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇది కోహ్లి 100వ టెస్ట్ మ్యాచ్. రెండో టెస్ట్ బెంగళూరులో మార్చి 12 నుంచి 16 వరకు జరుగుతుంది. దీన్ని డేనైట్ మ్యాచ్‌గా నిర్వహించనున్నారు.

భారత టెస్ట్ జట్టు వివరాలు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్ (పూర్తి ఫిట్‌గా ఉంటేనే), రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, సౌరభ్ కుమార్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)