You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వేలాది ప్రాణాలు తీస్తున్న పిడుగులు, భద్రంగా ఉండేదెలా
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
దిల్లీలోని గుర్గావ్‌లో ఓ కాలనీలో పని చేస్తున్న నలుగురు తోటమాలిలు భారీ వర్షం కురుస్తున్న వేళ ఓ చెట్టు కింద తలదాచుకున్నారు.
అంతలోనే భయంకరమైన శబ్దంతో ఓ మెరుపు మెరిసింది. అగ్నిజ్వాలలా ఓ పిడుగు భీకర శబ్దంతో ఆ చెట్టును ఢీకొంది. సాధారణంగా పిడుగుపాటు ఒక క్షణకాలమే ఉంటుంది. 30 కోట్ల వోట్ల శక్తితో విరుచుకుపడే పిడుగు అదే క్షణంలో ప్రాణాలు తీసేస్తుంది.
ఆ సమయంలో చుట్టూ ఉన్న గాలి ఉష్ణోగ్రత సూర్యుడి ఉపరితలానికి అయిదు రెట్లకు పెరుగుతుంది. ఆ నలుగురూ ఒక్కసారిగా కుప్పకూలారు. వారిలో ఒకరు చనిపోయారు. మిగతా ముగ్గురు తీవ్రమైన కాలిన గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
"ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాకేం గుర్తులేదు. క్షణాల్లో అంతా ధ్వంసమైపోయింది" అని వారిలో ఒకరు అన్నారు.
వారి సహచరుడిలాగే భారతదేశంలో ఏటా 2,500 మంది పిడుగుపాటుకు గురై చనిపోతున్నారు. 1967-2019 మధ్య కాలంలో దేశంలో 1,00,000 పైగా మంది పిడుగుపాటు వల్ల చనిపోయారని అధికారిక లెక్కలు సూచిస్తున్నాయి.
మొత్తం ప్రకృతి విలయాలతో చనిపోతున్న వారిలో మూడోవంతు కన్నా ఎక్కువ మంది పిడుగుపాటు వల్లే చనిపోతున్నారు. పిడుగుపాటుకు గురై ప్రాణాలతో బయటపడిన వారు కూడా నీరసం, మగత, జ్ఞాపకశక్తి లోపం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు.
ఈ మెరుపుదాడుల గురించి ముందస్తుగా హెచ్చరించే వ్యవస్థను భారత వాతావరణ శాఖ మూడేళ్ల కిందట ప్రారంభించింది. మొబైల్ యాప్స్ ఇప్పుడు పిడుగుపాట్లను ముందుగానే చెప్పగలుగుతున్నాయి. రేడియో, టీవీ వంటి మాధ్యమాల ద్వారా కూడా ఏయే ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందో చెబుతున్నారు.
లైట్నింగ్ ఇండియా రిసైలియెంట్ క్యాంపెయిన్ పేరుతో మూడేళ్ల కిందట మొదలైన కార్యక్రమం కింద పిడుగుపాటుకు ప్రభావితమయ్యే గ్రామాల్లోని ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తున్నారు. తద్వారా ఈ తరహా మరణాల సంఖ్య తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
అయితే, ఇటీవలి కాలంలో పిడుగుపాట్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. భారతదేశంలో 2020 ఏప్రిల్ - 2021 మార్చి మధ్య కాలంలో 1.80 కోట్ల పిడుగుపాట్లు సంభవించాయని క్లైమేట్ రిసైలియెంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రొమోషన్ కౌన్సిల్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించిది.
అదే కాలంలో గత ఏడాది సంభవించిన పిడుగుపాట్లతో పోల్చితే ఇది 34 శాతం ఎక్కువ. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ సేకరించిన ఉపగ్రహ సమాచారం కూడా 1995-2014 మధ్య కాలంలో "పిడుగుపాట్లు గణనీయంగా పెరిగాయి" అని సూచిస్తోంది.
దేశంలోని అరడజన్ రాష్ట్రాలలో పిడుగుపాట్లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించినప్పటికీ, 70 శాతం మరణాలు మాత్రం ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో సంభవించాయని నివేదికల స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా, పంట పొలాల్లో పని చేసే వారు ఈ ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారు.
"మా ప్రాంతంలో పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. తుపానులో బర్రెను తోలుకుని రావడానికి వెళ్లిన ఓ ఏడేళ్ల పిల్లాడు పిడుగుపాటుకు చనిపోవడం నాకింకా గుర్తుంది" అని పశ్చిమబెంగాల్‌లోని సంధ్యారాణి గిరి చెప్పారు.
బంగాళాఖాతం తీరంలోని ఫ్రేసర్‌గంజ్ అనే గ్రామంలో ఆమె నివసిస్తున్నారు. జాలర్ల జనాభా అధికంగా ఉన్న ఆ గ్రామం కోల్‌కతాకు దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణాన ఉన్న 24-పరగణాల జిల్లా పరిధిలోకే ఆ గ్రామం వస్తుంది. ఈ జిల్లాలో ప్రతి ఏటా దాదాపు 60 మంది పిడుగుపాటుతో మరణిస్తున్నారు. ఇది పిడుగుపాటు ప్రమాద కేంద్రంగా మారిందన్నా ఆశ్చర్యం లేదు.
తీర ప్రాంత గ్రామాల్లోని నివాసాలు చాలా వరకు పాకలు, రేకుల కప్పులున్న ఇళ్లుంటాయి. సముద్రం చెంతనే ఉండడం వారికి ప్రాణాంతకంగా మారుతోంది. ఈ ప్రాంతాల్లో వాయుగుండాలు చెలరేగడం, ఉప్పెనలు ముంచెత్తడం సర్వ సాధారణం. దాంతోపాటు పిడుగులు కూడా తీర ప్రదేశంలో ఎక్కువగా పడుతుంటాయి.
తుపాను సమయంలో మేఘాలు ఢీకొన్నప్పుడు ఉత్పన్నమయ్యే విద్యుత్ వల్ల పిడుగుపాట్లు సంభవిస్తుంటాయి. పిడుగుపాట్ల గురించి తెలుసుకుని, వాటి వల్ల ప్రమాదానికి గురికాకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. ఇంట్లోనే తక్కువ ఖర్చుతో తయారు చేసుకోగలిగే లైట్నింగ్ కండక్టర్లతో పిడుగుపాట్లను నేల మీదకు మళ్లించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.
గ్రామస్థులు ఈ కండక్టర్లను పాత సైకిల్ రిమ్స్, వెదురు కర్రలు, తీగలతో తయారు చేస్తున్నారు. వెదురు కర్ర మీద సైకిల్ రిమ్‌ను దాదాపు 30 అడుగుల ఎత్తున అమర్చుతారు. దీన్ని ఇళ్ల మీద, ముఖ్యంగా పాఠశాలలు, ప్రార్థనాలయాల మీద బిగిస్తారు. మేఘాల నుంచి ఉత్పన్నమయ్యే విద్యుత్తును ఎవరికీ ఎలాంటి హాని కలిగించకుండా నేలలోకి పంపించడానికి కండక్టర్లు ఉపయోగపడతాయి.
పిడుగుపాటుకు గురై మరణించేవారిలో అత్యధికులు గ్రామీణులే. వారిలో ఎక్కువ మంది వర్షం వస్తున్నప్పుడు చెట్టు నీడకు చేరుకుని చనిపోతున్నవారే. పిడుగుపాటుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్న లైట్నింగ్ రిసైలియెంట్ ఇండియా క్యాంపెయిన్ చేస్తున్న అధ్యయనాలు ఈ వాస్తవాలను వెల్లడిస్తున్నాయి.
ముఖ్యంగా వ్యవసాయం, చేపల వేట చేసుకునే వారు ఈ ప్రమాదాలకు చేరువగా ఉన్నారు. ఈ క్యాంపెయిన్ మూలంగా కొన్ని రాష్ట్రాలలో పిడుగుపాటు మృతుల సంఖ్య దాదాపు 60 శాతం తగ్గింది.
"అయితే, అడవులు, పొలాలు, చెరువులు, సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజల్లో పిడుగుపాటుపై అవగాహన కల్పించే పనులేవీ ప్రభుత్వం చేపట్టకపోవడం ఒక లోటు" అని క్యాంపెయిన్ కన్వీనర్ కల్నల్ సంజయ్ శ్రీవాస్తవ అన్నారు.
వాతావరణంలో వస్తున్న మార్పులు కూడా పిడుగుపాట్ల సంఖ్య పెరగడానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి, సముద్ర ఉపరితలాల ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతుండడం వల్ల గాలి వెచ్చబడుతోందని, అది పిడుగుపాట్లు పెరగడానికి మరింత శక్తిని ఇస్తోందని వారంటున్నారు.
సగటు ఉష్ణోగ్రతల్లో పెరిగే ప్రతి ఒక్క డిగ్రీకి అమెరికాలో పిడుగుపాట్లు 12 శాతం పెరుగుతున్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయన వెల్లడించింది. భారతదేశంలో పెరుగుతున్న నగరీకరణ, తరుగుతున్న వృక్ష సంపద వాతావరణంలో వేడి పెరిగేందుకు కారణమవుతున్నాయి.
"భూ, సముద్ర ఉపరితలాలు వేడెక్కడం, వాయు కాలుష్యం పెరగడం వంటివి పిడుగుపాట్లు పెరగడానికి కారణమవుతున్నాయి. భారతదేశంలో వాతావరణం వేడెక్కుతూ, కాలుష్యం పెరుగుతున్న కొద్దీ పిడుగుపాట్లు పెరుగుతూనే ఉంటాయి" అని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీలో థండర్ స్టార్మ్స్ విభాగం డైరెక్టర్ ఎస్.డి. పవార్ అన్నారు.
అంతేకాదు, పిడుగుపాట్ల తీవ్రత కూడా ఈ మార్పుల వల్ల పెరుగుతోందని ఆయన అన్నారు. ఇటీవల అమెరికాలో పడిన పిడుగు 500 మైళ్ల కన్నా పొడవైన జ్వాలగా భూమిని తాకిందని, ఆకాశంలో దాని వెలుగు మూడు రాష్ట్రాల్లో కనిపించిందని, అదే ఇప్పటివరకు అత్యంత పొడవైన పిడుగు జ్వాల అని ఆయన చెప్పారు.
భారతదేశం 2022 నాటికి పిడుగుపాటు మృతుల సంఖ్యను 1,200 కన్నా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారీ వర్షాలు, తుపానులు వచ్చినప్పుడు పశుపక్ష్యాదుల కోసం ఖాళీ ప్రదేశాల్లో పరుగులు తీయవద్దని, ముఖ్యంగా చెట్ల కింద గుమికూడవద్దని, లోహపు కంచెలు, విద్యుత స్తంభాలకు దూరంగా ఉండాలని గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛంద కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు.
కానీ, ప్రతి ఏటా భీకరంగా మెరిసే మెరుపులు, కురిసే పిడుగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. "మేం భయం గుప్పిట్లో జీవిస్తున్నాం" అని గిరి అన్నారు.
మెరుపుదాడుల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
- పెద్ద ఇంట్లో లేదా కారులో తలదాచుకోవాలి.
- విశాలమైన మైదానాలు, కొండ ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లాలి
- ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ఉంటే చేతులు, కాళ్లు, తల దగ్గరకు ముడుచుకుని మిమ్మల్ని మీరు వీలైనంత అతి చిన్న లక్ష్యంగా మార్చుకోవాలి.
- పొడవైన, ఒంటరిగా ఉన్న చెట్ల కింద ఉండకూడదు.
- నీళ్ల మీద ఉన్నట్లయితే వెంటనే నేల మీదకు వచ్చి తీరం నుంచి వీలైనంత త్వరగా దూరంగా వెళ్లాలి.
(ఆధారం: రాయల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్)
ఇవి కూడా చదవండి:
- ఏబీజీ షిప్‌యార్డ్ కేసు: ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద బ్యాంక్ మోసం ఇదేనా, అసలేం జరిగింది?
- రామానుజాచార్యులు ఎవరు? సమాజం కోసం, సమానత్వం కోసం ఆయన ఏం చేశారు? రూ. వెయ్యి కోట్ల విగ్రహంపై విమర్శలు ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఉద్యోగులు ఆశించినవన్నీ జరగవా? కొత్త పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా?
- రష్యా, యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా లబ్ధి పొందాలని చూస్తోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)