You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేరళ: కొండ చీలికలో ఇరుక్కుపోయి 48 గంటల పాటు తిండి, నీరు లేకుండా ఉండిపోయిన యువకుడిని రక్షించిన భారత సైన్యం
కేరళలో నిటారుగా ఉన్న ఒక కొండపైకి ట్రెక్కింగ్‌కు వెళ్లి గాయపడి అక్కడే కొండచీలికలో చిక్కుకుపోయిన యువకుడిని భారత సైన్యం రక్షించింది.
దాదాపు గత 48 గంటలుగా ఆయన ఆహారం, నీరు లేకుండా గాయంతో కొండపైనే ఉండిపోయారు.
సోమవారం ముగ్గురు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తోన్న ఆర్ బాబు (23) కాలుజారడంతో కిందపడిపోయి కొండ సందులో ఇరుక్కుపోయారు.
తొలుత మూడు వేర్వేరు రెస్క్యూ బృందాలు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాయి. కానీ సఫలం కాలేకపోయాయి.
చివరకు భారత ఆర్మీ బుధవారం ఉదయం అతన్ని చేరుకోగలిగింది.
''రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆర్మీ సిబ్బంది, ఆర్ బాబును చేరుకున్నారు. ఆయనకు ఆహారం, నీరు అందించారు. సహాయక బృందంలోని ఒక సభ్యుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆయనను కొండపైకి తీసుకొచ్చారు'' అని వార్తా సంస్థ మనోరమ పేర్కొంది.
పాలక్కాడ్ జిల్లాలోని కురుంబచి కొండ, ఏటవాలుగా 1000 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ కొండపైకి వెళ్లడం ట్రెక్కర్లకు ప్రమాదకరమని గతంలోనే కేరళ అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
సోమవారం జారిపడిన ఆర్ బాబుకు ఆ కొండచీలికలో కేవలం కూర్చోవడానికి మాత్రమే సరిపడే స్థలమున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
తాళ్లు, కర్రల సహాయంతో పైకి లాగేందుకు అతని మిత్రులు ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో పోలీసుల సహాయం కోరేందుకు కొండ నుంచి కిందికి దిగిపోయారు.
అతను చిక్కుకున్న ప్రాంతాన్ని గుర్తించడానికి వీలుగా ఫొటోలు, సెల్ఫీలను పోలీసులకు ఆర్ బాబు పంపించారు.
ఆయన ఉన్న ప్రాంతాన్ని సరిగ్గా గుర్తించడానికి పోలీసులు డ్రోన్లను కూడా వినియోగించారు.
కోస్ట్‌గార్డ్ హెలీకాప్టర్లు అతన్ని చేరుకోవడానికి మంగళవారం అనేకసార్లు ప్రయత్నించాయి. కానీ కొండ స్థలాకృతి, భారీ గాలుల కారణంగా అక్కడికి చేరుకోలేకపోయాయి.
కనీసం ఆహారం, నీరు కూడా అందించే పరిస్థితి కూడా లేకపోయింది.
బాబు ఆరోగ్య పరిస్థితిపై స్థానిక శాసనసభ్యుడు షఫీ పరంబిల్ ఆందోళన వ్యక్తం చేశారు. ''మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా ఆయన చేతులు ఊపుతూ సహాయక బృందాలకు స్పందించారు. కానీ సాయంత్రానికల్లా నీరసంగా మారిపోయారు'' అని చెప్పారు.
వన్యప్రాణుల నుంచి రక్షించేందుకు మంగళవారం రాత్రి ఆయనకు సమీపంలో మంటలను వెలిగించినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న ఒక అధికారి వార్తాపత్రిక హిందుస్థాన్ టైమ్స్‌తో చెప్పారు.
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు అతన్ని రక్షించేందుకు భారత ఆర్మీ బృందం ఘటనా స్థలానికి వెళ్లింది.
అనేక ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు బుధవారం ఉదయం భారత ఆర్మీ అతన్ని చేరుకోగలిగింది. ''మేం వచ్చేశాం. ఆందోళన చెందొద్దు'' అంటూ ఆయనకు ధైర్యం చెప్పారు.
ఆ తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు: బీబీసీ చేతికి నేపాల్ నివేదిక
- కర్ణాటక: హిజాబ్ వివాదంతో రాళ్ల దాడులు, మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించిన ప్రభుత్వం
- ‘పారాసిటమల్ ఎక్కువగా వాడితే రక్తపోటు పెరిగి గుండెపోటు రావొచ్చు’
- అయోధ్య: విశాలమైన రామ మందిర నిర్మాణం ఒకవైపు, శిథిల ఆలయాలు మరోవైపు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- భారీ విగ్రహాలను చైనా నుంచే ఎందుకు తెప్పిస్తున్నారు, ఇక్కడ తయారు చేయలేరా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)