పశ్చిమ గోదావరి జిల్లా: 14 ఏళ్లుగా రెండుపూటలా ఇంటి వద్దకే భోజనం.. ఆకలి అంటే అన్నం వండి క్యారేజ్ పంపిస్తారు..

వీడియో క్యాప్షన్, 14 ఏళ్లుగా రెండుపూటలా ఇంటి వద్దకే భోజనం.. ఆకలి అంటే అన్నం వండి క్యారేజ్ పంపిస్తారు..

పశ్చిమ గోదావరి జిల్లా చెరుకుమిల్లి గ్రామంలో వృద్ధులకు, ఒంటరిగా ఉండేవారికి 14 ఏళ్లుగా ఇంటి వద్దకే భోజనం వస్తోంది. ఉపాధి కోసం పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లడం వల్ల ఒంటరిగా బతుకుతున్నవారికి, వృద్ధాప్యంలో తోడు లేక కష్టపడుతున్నవారికి ఇలా భోజనం అందిస్తున్నారు. ఇలాంటివారెవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మధ్యాహ్నం, రాత్రి ఓ చోట భోజనం వండి, వారి ఇళ్లకు క్యారేజీల్లో సర్ది పంపిస్తున్నారు.

డెల్టా ప్రాంతంలో ఉండడంతో చెరుకుమిల్లి వ్యవసాయకంగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత విద్యారంగంలో పురోగతి సాధించిన కొందరు ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం మొదలయ్యింది.

ఎక్కువ మంది హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. అలాంటి దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా తమ ఊరిలో ఉన్న పెద్దల పరిస్థితి గురించి ఆలోచించి ఈ భోజనం క్యారేజీల పంపిణీ పథకం ప్రారంభించారు.

క్షత్రియ సేవా సమితి పేరుతో హైదరాబాద్ లో ఉన్న వారంతా సంఘటితం కావడం ద్వారా ఈ భోజనాల నిమిత్తం ఖర్చు సమీకరించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. భోజనాలకు అవసరమైన కూరగాయలు వంటివి సొంతంగా పండించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు.

ప్రారంభంలో పూర్తి ఉచితంగా ఈ భోజనాలు పంపిణీ చేసేవారు. ఆతర్వాత ఆర్థికంగా స్తోమత ఉన్న వారు ఇచ్చే వాటిని సహాయ నిధిగా స్వీకరిస్తున్నారు. ఇప్పటికీ చెరుకుమిల్లి వాసులు తప్ప ఇతరులు ఎవరైనా ఈ భోజనాల పంపిణీకి ఆర్థిక సహకారం అందించినా స్వీకరించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వారి చొరవ, గ్రామంలో ఉన్న వారి సహకారం కారణంగా ఈ భోజనాల పంపిణీ సజావుగా సాగుతోందని అంటున్నారు.

వాలంటీర్ల మూలంగా ఈ పథకం వరదల్లో కూడా కొనసాగించగలిగామని క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు అంటున్నారు. ఈ ఊరిలో భోజనం క్యారేజీల పంపిణీ ప్రక్రియ చూసి సమీపంలో కొన్ని గ్రామాల్లో కూడా దానిని అనుసరించడం మొదలెట్టారు. వివిధ ప్రాంతాల్లో కూడా కొందరు ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ 14 ఏళ్లు పైబడి విరామం లేకుండా 20 మందికి తగ్గకుండా వృద్ధులకు నిత్యం ఆహారం అందించే పథకం చాలామందికి ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)