ISWOTY: మరోసారి ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో వస్తున్న బీబీసీ

భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారులను సత్కరించే లక్ష్యంతో ఏటా ప్రకటించే బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ (ISWOTY) అవార్డు మూడో ఎడిషన్‌ మొదలైంది.

ISWOTY నామినీలను ఫిబ్రవరి 8వ తేదీన ప్రకటిస్తారు.

క్రీడా జర్నలిస్టులు, నిపుణులు, క్రీడా రచయితలతో కూడిన జ్యూరీ సభ్యులు మొత్తం నామినీల్లో నుంచి ఐదుగురు భారత మహిళా క్రీడాకారులను షార్ట్ లిస్ట్ చేస్తారు.

వీరిలో తమకు నచ్చిన క్రీడాకారిణికి అభిమానులు ఓటు వేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లు, బీబీసీ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు వెళ్లి తమ ఓటును నమోదు చేయవచ్చు.

గతేడాది ఈ పురస్కారాన్ని భారత చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి గెలుచుకున్నారు. మూడో ఎడిషన్ ప్రారంభం కావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.

‘‘బీబీసీ ISWOTY ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇది కేవలం యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే కాదు.. మహిళా క్రీడాకారుల గుర్తింపునకు దోహదపడుతుంది. బీబీసీ ISWOTYకి నా పేరు నామినేట్ అయినప్పుడు, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఒక చెస్ ప్లేయర్‌గా నాకు చాలా గుర్తింపు లభించింది’’ అని హంపి చెప్పారు.

బీబీసీ న్యూస్ ఇండియా సారథి రూపా ఝా మాట్లాడుతూ.. ‘‘2022 సంవత్సరం చాలా ప్రత్యేకం. మేం ISWOTY మూడో ఎడిషన్‌ను నిర్వహించనుండటమే కాదు.. ఈ ఏడాదితో బీబీసీ 100 ఏళ్లను పూర్తి చేసుకోబోతోంది. వందేళ్లుగా నిర్భయంగా సాగించిన సాహస ప్రయాణాన్ని బీబీసీ సెలెబ్రేట్ చేసుకుంటోంది. బీబీసీ స్ఫూర్తి ప్రయాణంతో ఈ కార్యక్రమం ముడిపడింది.

తమ ప్రయాణంలో ఎదురైన అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించడమే కాకుండా, ఈ ప్రపంచాన్ని మరింత సమానంగా, న్యాయంగా మార్చిన మహిళలను గౌరవించడానికి మేం మళ్లీ మీ ముందుకు వచ్చాం’’ అని అన్నారు.

ISWOTY మూడో ఎడిషన్ విజేతను మార్చి 7వ తేదీన ప్రకటించనున్నారు. దీనితో పాటు ‘బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు’, ‘బీబీసీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’లతో మరో ఇద్దరు క్రీడాకారిణులను కూడా బీబీసీ గౌరవించనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)