వికలాంగుడి పట్టుదలకు ఆశ్చర్యపోయి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా

జుగాడ్ క్రియేటివిటీని, పట్టుదలతో పనిచేసేవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ఒక వికలాంగుడిని చూసి ఆశ్చర్యపోయారు.

ఒక వికలాంగుడు మూడు చక్రాల వాహనాన్ని తయారు చేసుకుని, దానిపై పనికి వెళ్తున్న వీడియో చూసి ఆశ్చర్యపోయిన మహీంద్రా, ఆయనకు ఉద్యోగం ఆఫర్ చేశారు.

కాళ్లు, చేతులు సరిగా వృద్ధి చెందని వికలాంగుడు ఓ మూడు చక్రాల జుగాడ్ బండిని నడుపుతూ, దానిపై కూర్చుకుని మాట్లాడుతున్నప్పుడు తీసిన ఒక వీడియో తాజాగా వైరల్ అయ్యింది.

ఆ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఆ పట్టుదలను చూసి ఆశ్చర్యపోయానని చెప్పిన మహీంద్రా.. ఆయనకు బిజినెస్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇవ్వాలంటూ మహీంద్రా లాజిస్టిక్స్ సంస్థ ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేశారు. ఆ వ్యక్తి చిరునామాతో పాటు పూర్తి వివరాలను కనుక్కొనేందుకు ప్రయత్నిస్తున్నామని మహీంద్రా లాజిస్టిక్స్ సంస్థ ట్వీట్ చేసింది.

కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్రకు చెందిన ఓ వెల్డింగ్ షాపు నిర్వాహకుడు తయారు చేసిన జుగాడ్ జీపును చూసి, దానికి ఎక్స్ఛేంజ్ కింద బొలెరో వాహనాన్ని ఇస్తానని ఆనంద్ మహీంద్రా ఆఫర్ ఇచ్చారు. అయితే, ఆ జీపును ఇవ్వలేమని, ఆనంద్ మహీంద్రా కోసం మరోటి తయారు చేసిస్తామని జుగాడ్ జీపు తయారీదారుడు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)