You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సమంత: ‘చైతూతో విడిపోయాక చనిపోతానేమో అనిపించింది..’ - ప్రెస్ రివ్యూ
చైతూతో విడిపోయినప్పుడు చనిపోతానేమో అనిపించిందని సినీ నటి సమంత తాజాగా కామెంట్ చేసినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
''నేను చాలా బలహీనురాల్ని అనుకుంటా. కానీ నా జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యల్ని చూస్తే.. నాలో ఇంత ధైర్యం ఉందా అనిపిస్తోంది. మానసికంగా ఎంత ధృఢంగా ఉన్నానో అర్థం అవుతోంది'' అన్నారు సమంత.
ఇటీవల సోషల్ మీడియాలో తన భావాల్ని నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా వ్యక్తపరుస్తున్నారామె. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరవాత భావోద్వేగభరితమైన పోస్ట్‌లు పెడుతున్నారు.
తాజాగా సమంత కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారని పత్రిక రాసింది.
''చైతూతో విడిపోయిన రోజులు నాకింకా గుర్తున్నాయి. అప్పుడు చాలా కృంగిపోయాను. చనిపోతానేమో అనిపించింది. కానీ.. అందులోంచి బయటపడ్డా. ఓ సమస్య ఎదురైతే దాన్ని ముందు మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే జయించడానికి మార్గం దొరుకుతుంది. సమస్యని అంగీకరించాలి. లేదంటే అంతం లేని యుద్ధం చేస్తున్నట్టే'' అని చెప్పుకొచ్చారు.
కాలం, ఆ ప్రయాణంలో ఎదురవుతున్న కష్టాలే తనని మరింత శక్తిమంతం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారని పత్రిక వివరించింది.
ఏపీ వరద బాధితులకు ప్రభాస్ రూ. కోటి విరాళం
ఏపీ వరద బాధితులకు హీరో ప్రభాస్ కోటి రూపాయల విరాళం ఇచ్చారంటూ సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అందులో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సినీ నటుడు ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి విరాళంగా ప్రకటించారు.
ఆయన దీనికి సంబంధించిన చెక్కును త్వరలో సీఎం కార్యాలయానికి పంపనున్నారు.
గతంలో కరోనా సమయంలోనూ ఈ పాన్ ఇండియా స్టార్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించారు అని సాక్షి వివరించింది.
కడపలోని ఏటీఎంలలో సీసీ కెమెరాలకు రంగేసి లక్షలు దోచేశారు
ఆంధ్రప్రదేశ్ కడపలోని ఏటీఎంలలో కెమెరాలకు రంగు వేసిన దుండగులు లక్షలు దోచుకున్నారని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.
కడప నగరం సమీపంలో రెండు చోట్ల ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన దుండగులు రూ.41 లక్షలు అపహరించారు.
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఎస్‌బీఐ ఏటీఎం ఉంది.
సోమవారం అర్ధరాత్రి దాటాక దుండగులు సీసీ కెమెరాలకు నల్లని రంగు పూశారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్‌తో ఏటీఎంను తెరిచి, రూ.17 లక్షలు తీసుకెళ్లారు.
బ్యాంకు సిబ్బంది మంగళవారం చోరీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
రిమ్స్ ఠాణా పరిధిలోనూ రామాంజినేయపురం ఎస్‌బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి ఆగంతుకులు రూ.24 లక్షలు దోచుకెళ్లారు.
ఇక్కడా గ్యాస్ కట్టర్‌తోనే ఏటీఎంను తెరిచారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
జాగిలాలతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాలకు రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఓ కారు కాలిపోయి ఉంది.
చోరులకు ఆ కారుకు సంబంధముందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారని ఈనాడు వివరించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల బహిష్కరణ - టీఆర్ఎస్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను టీఆర్ఎస్ బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రకటించారని నమస్తే తెలంగాణ వార్తా కథనం ప్రచురించింది.
ధాన్యం కొనుగోళ్ల అంశంపై పార్లమెంటులో పది రోజులుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం స్పందించకుండా, మొండిగా వ్యవహరిస్తున్నందున శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నామని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు ప్రకటించారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని రైతు వ్యతిరేక, ఫాసిస్టు ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఆయన చెప్పారని పత్రిక రాసింది.
మంగళవారం పార్లమెంటు ఉభయసభల నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, 'ఆజ్ సే హమారా నారా హై మోదీ సర్కార్ జానా హై' (మోదీ ప్రభుత్వం పోవాలన్నదే ఇవాళ్టి నుంచి మా నినాదం) అన్నారు.
మోదీ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ నిలబడిందని చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే దాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వ ఫాసిస్టు విధానంపై తిరుగుబాటు చేసేలా ప్రజలను ప్రజాస్వామ్య పద్ధతిలో సన్నద్ధం చేస్తామని చెప్పారు.
పార్లమెంటులో కేంద్రం పది రోజులు తమ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని మండిపడ్డారు. పంటల కొనుగోళ్ల విషయంలో విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తమ గోడును వినడానికి సిద్ధంగా లేకపోవడం బాధించిందని కేకే ఆవేదన వ్యక్తం చేశారని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది?
- ‘తెలంగాణలో ఏ క్షణమైనా ఒమిక్రాన్ కేసులు.. ఆఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన వారిలో 12 మందికి కరోనా పాజిటివ్’
- కరోనావైరస్: mRNA వ్యాక్సీన్ తీసుకుంటే సూపర్ హ్యూమన్ అయిపోతారా?
- దిల్లీలో బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు
- కోవిడ్‌తో యూరప్‌లో మరో 7 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కోవిడ్-19 వ్యాక్సినేషన్: వ్యాక్సీన్ వేసుకున్న తర్వాత కూడా వైరస్ సోకుతుందా?
- కోవిడ్-19: ఒమిక్రాన్, డెల్టా, డెల్టా ప్లస్, ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లు అంటే ఏమిటి... ఇవి వ్యాక్సీన్లకు లొంగుతాయా
- మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా?
- మా దేశంపై ఆంక్షలు ఎత్తివేయండి - దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
- కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ తీసుకోవాల్సిన 5 చర్యలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)