You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నాగాలాండ్‌లో భద్రతాదళాల ఆపరేషన్‌లో పౌరులు మృతి, సిట్ దర్యాప్తునకు సీఎం ఆదేశం
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో శనివారం రాత్రి భద్రతాదళాల కాల్పుల్లో పలువురు పౌరులు చనిపోయినట్లు చెబుతున్నారు.
ఎంతమంది పౌరులు చనిపోయారో అధికారులు ప్రకటించలేదు. కానీ 11 మంది మరణించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. 14 మంది చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
ఈ ఘటనలో మొత్తం 13 మంది మరణించినట్లు నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి టి.ఆర్. జెలియాంగ్ చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
"రిటైర్డ్ న్యాయమూర్తుల అధ్యక్షతన తక్షణమే విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ ఘటనకు బాధ్యులైన భద్రతా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ ఆయన ట్వీట్ చేశారు.
"శాంతి, సామరస్యంతో జీవించాలనుకున్న నాగరిక సమాజంలో మిలటరీ చేపట్టిన ఈ చర్యలు దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
"మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో సామాన్య ప్రజలను చంపడం అత్యంత హేయమైన విషయం. దీన్ని ఖండిస్తున్నాను" అంటూ నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో ట్వీట్ చేశారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి రియో తెలిపారు.
విచారణ కోసం ఉన్నత స్థాయి సిట్‌ను ఏర్పాటు చేశామని, చట్ట ప్రకారం న్యాయం జరుగుతుందని, శాంతిభద్రతలు కాపాడాలని అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటననుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా విచారం వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.
ఇది దురదృష్టకర సంఘటనగా పేర్కొంటూ సైన్యం విచారం వ్యక్తం చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.
ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయిలో విచారణ జరుపుతామని సైన్యం తన ప్రకటనలో పేర్కొంది.
ఈ ఘటనలో ఒక జవాను కూడా మృతి చెందారని, పలువురు గాయపడ్డారని అసాం రైఫిల్స్ అధికారి ఒకరు తెలినట్లు ఏఎన్ఐ వెల్లడించింది.
మోన్ జిలాల్లోని తిరులో ఉగ్రవాదుల జాడపై తమకు బలమైన సమాచారం అందిందని, ఆ తరువాతే ఆపరేషన్ ప్రారంభించామని అసోం రైఫిల్స్ అధికారులు తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
మోన్ ప్రాంతం నాగా గ్రూప్ ఎన్ఎస్‌సీఎన్ (కే), యూఎల్ఎఫ్ఏ (ఉల్ఫా) బృందాలకు బలమైన కోట అని చెబుతారు.
నాగాలాండ్‌లో జరుపుకునే ముఖ్యమైన పండుగ "హార్న్‌బిల్ ఫెస్టివల్"కి ముందు ఈ సంఘటన జరిగింది. ఈ ఉత్సావాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు దౌత్యవేత్తలు నాగాలాండ్ చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- మా దేశంపై ఆంక్షలు ఎత్తివేయండి - దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
- ఏడేళ్ల క్రితం అదృశ్యమైంది.. ఈ విమానం జాడ ఇప్పటికీ దొరకలేదు
- ట్విటర్ కొత్త సీఈవో పరాగ్ అగర్వాల్ ఎవరు? ఆయన గురించి మాజీ సీఈవో ఏం చెప్పారు?
- ఒమిక్రాన్ కరోనా వేరియంట్ లక్షణాలేంటి? దీన్ని మొదట గుర్తించిన దక్షిణాఫ్రికా డాక్టర్ ఏం చెప్పారు?
- భారత్-చైనా: సరిహద్దుల్లో ఘర్షణలున్నా క్రీడల కోసం ఎందుకు చేతులు కలిపాయి?
- యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు - సీఎం కేసీఆర్ ప్రకటన
- షారుక్ ఖాన్‌ను మహిళలు ఎందుకు ఇష్టపడతారు?
- ఆంధ్రప్రదేశ్‌లో చెరకు ఫ్యాక్టరీలు రైతులకు బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)