You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం
వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తెలిపాయి.
వాయిదా అనంతరం 12 గంటలకు లోక్‌సభ తిరిగి సమావేశం కాగానే కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ సభలో వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు.
ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, గందరగోళం మధ్య లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది.
అనంతరం స్పీకర్ లోక్‌సభను తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో కూడా నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు.
కాంగ్రెస్ పార్టీ చర్చకు పట్టుబట్టినప్పటికీ.. ఎలాంటి చర్చ లేకుండానే రాజ్యసభ ఈ బిల్లులను ఆమోదించింది.
అనంతరం సభ 30 నిమిషాల పాటు వాయిదా పడింది.
అయితే.. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుపై చర్చ జరపాలంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటు ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది.
''వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుపై చర్చ జరగాలని టీఎంసీ కోరింది. కానీ రైతుల పరిస్థితులపై చర్చించటానికి ప్రభుత్వం భయపడుతోంది. రైతుల తరఫున మాట్లాడటానికి ప్రతిపక్షానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వటం లేదు" అని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ విమర్శించారు.
దానికిముందు కాంగ్రెస్ నేత జైరాంరమేశ్ ట్వీట్ చేస్తూ.. పార్లమెంటులో చర్చించకుండానే వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు.
16 నెలల కిందట వ్యవసాయ బిల్లులను పార్లమెంటులో చర్చ లేకుండానే చాలా అప్రజాస్వామికంగా ఆమోదించారని, ఇప్పుడు అదే తరహాలో వాటిని ఉపసంహరించుకుంటున్నారని మండిపడ్డారు.
అంతకుముందు, ఉదయం 11 గంటలకు లోక్‌సభ, రాజ్యసభల సమావేశాలు మొదలయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ఇటీవల చనిపోయిన సభ్యుల కోసం లోక్‌సభ స్పీకర్ బిర్లా సంతాప సందేశం చదివారు.
సభా కార్యకలాపాలు మొదలైన వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు మొదలుపెట్టారు. శాంతించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.
నినాదాలు కొనసాగటంతో సభను 12 గంటల వరకూ వాయిదా వేశారు.
దేశం చాలా సమస్యలను ఎదుర్కొంటోందని, వీటిపై సీరియస్ చర్చ జరగాల్సిన అవసరముందని, సభ సాఫీగా సాగటానికి సభ్యులు సహకరిస్తారని ఆశిస్తున్నానని లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా చెప్పారు.
రైతుల ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించే అంశంపై కాంగ్రెస్ నాయకుడు మాణిక్కం టాగూర్ వాయిదా నోటీసు ఇచ్చారు.
మొత్తం 25 రోజుల పాటు సాగే ఈ భేటీల్లో వివాదాస్పద వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లు సహా 36 బిల్లులను ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రతి ప్రశ్నకూ బదులిస్తాం: నరేంద్ర మోదీ
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతి అంశం మీద చర్చించటానికి, ప్రతి ప్రశ్నకూ సమాధానం ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సమావేశాలు వాయిదాలతో సమయం వ్యర్థమవటానికి బదులుగా.. అర్థవంతమైన చర్చలతో సాగాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
సభ ముందుకు కీలక బిల్లులు
వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును (ఫామ్ లాస్ రిపీల్ బిల్లు) ఈ సమావేశాల తొలి రోజే లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ తమ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులందరూ సోమవారం సభకు హాజరు కావాలని విప్‌లు జారీ చేశాయి.
కీలకమైన క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
దీనితో పాటు ఇన్‌సాల్వెన్సీ అండ్ బాంకరప్ట్సీ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్లు, విద్యుత్ (సవరణ) బిల్లులు కూడా ముఖ్యమైనవి.
వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో మళ్లీ తిరిగి తెచ్చే అవకాశంతో పాటు.. పెగాసస్ వివాదం, ధరల పెరుగుదల అంశాలను ప్రతిపక్షం ఈ సమావేశాల్లో లేవనెత్తే అవకాశముంది.
ఇవి కూడా చదవండి:
- ‘కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
- చెక్క, గడ్డి, గంజాయితో 1941లోనే కారు తయారీ.. దీన్ని ఫోర్డ్ సంస్థ ఎందుకు ధ్వంసం చేసింది?
- లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది, భాగస్వాముల్ని మోసం చేస్తున్నాయి, ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి
- క్రిప్టోకరెన్సీలో 70 లక్షలు నష్టపోయి ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు...’
- కొందరు వందేళ్లకు పైగా జీవించడానికి కారణమేంటి... ఏమిటీ మిస్టరీ?
- రూ. 7 కోట్ల లాటరీ తగిలితే ఇన్ని కష్టాలా?
- బీజింగ్ ఎయిర్పోర్ట్ ఫొటోను నోయిడా ఎయిర్పోర్ట్ అంటూ కేంద్ర మంత్రులు ఎందుకు పోస్ట్ చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)