ఆయేషా మీరా-సత్యంబాబు: అత్యాచారం, హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది, మరణ శిక్ష కావాలని నిందితుడు కోరాడు... హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.. ఎందుకంటే..

    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సయ్యద్ ఆయేషా మీరా. అప్పుడామె వయసు 17 సంవత్సరాలు. స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. అక్కడికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో విజయవాడ సమీపంలోని నిమ్రా కాలేజీలో బీఫార్మసీ మొదటి సంవత్సరం చదువుకునేది.

ఇబ్రహీంపట్నంలో ఉన్న శ్రీదుర్గా లేడీస్ హాస్టల్‌లో ఉండి కాలేజీకి వెళ్లి వస్తుండేది. అది ప్రైవేటు లేడీస్ హాస్టల్. 2007 డిసెంబర్ చివర్లో సెలవులకు ఇంటికి వెళ్లింది. కాలేజీలు తెరుస్తుండటంతో.. ఆ నెల 26వ తేదీ సాయంత్రం ఆమె తల్లి షంషాద్ బేగం ఆయేషాను హాస్టల్‌లో వదిలివెళ్లారు.

తెల్లారేసరికి అదే హాస్టల్‌లో ఆయేషా దారుణ హత్యకు గురై విగతజీవిగా కనిపించింది.

హాస్టల్ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న టాయిలెట్‌లో రక్తపు మడుగులో నగ్నంగా కనిపించింది ఆయేషా మృతదేహం. ఈ ఉదంతం రాష్ట్రమంతటా సంచలనం సృష్టించింది. కేసు విచారణ అనూహ్య మలుపులు తిరిగింది.

మొదట్లో అనుమానితులుగా పలువురిని చూపిన పోలీసులు.. చివరికి ఆయేషాపై అత్యాచారం చేసి, హత్య చేసింది పిడతల సత్యం బాబు అనే యువకుడు అంటూ అతడిని అరెస్ట్ చేశారు. 2010లో విజయవాడలోని విచారణ కోర్టు అతడిని దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. (జీవిత ఖైదు, మరణ శిక్ష ఏది కావాలని కోర్టు అడిగినప్పుడు తనకు మరణ శిక్ష విధించాలని సత్యంబాబు కోరుకున్నారు).

కానీ రాజకీయ పలుకుబడి గల అసలు నేరస్తులను కాపాడటానికి అమాయకుడైన సత్యంబాబును పోలీసులు ఈ కేసులో ఇరికించారని ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. హక్కుల సంస్థలూ ఇదే మాట అన్నాయి.

ఆయేషా హత్య కేసులో తనకు శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హైదరాబాద్‌లోని హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు సత్యంబాబు. దీనిపై విచారణలో.. పోలీసుల కథనం, ఆధారాలు, వాదనల్లోని లోపాలను ఎత్తిచూపారు అతడి తరఫు వాదించిన న్యాయవాదులు. వారి వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.

సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 31న విడుదల చేసింది.

కేసును తప్పుదోవ పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు నిర్దేశించింది. సత్యంబాబుకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలనీ ఆదేశించింది. చేయని నేరానికి ఎనిమిదేళ్ల పాటు జైలు జీవితం గడిపానని సత్యంబాబు వాపోయారు.

పోలీసులపై చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలూ అమలు కాలేదని, తనకు న్యాయం చేయాలంటూ జాతీయ ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ను ఆశ్రయించారు. పోలీసులపై ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, తనకు పరిహారంగా రూ. 10 కోట్లు చెల్లించాలని కోరారు.

ఆయన పిటిషన్‌ మీద కమిషన్ విచారణ చేపట్టింది.

అసలింతకీ.. ఆయేషా మీరాను హత్య చేసింది సత్యంబాబేనని పోలీసులు ఎలా నిరూపించారు? కింది కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించిన ఏడేళ్ల తర్వాత.. అతడు నిర్దోషి అని హైకోర్టు ఎలా విడుదల చేసింది? ఈ కథ కూడా జైభీమ్ సినిమాకు ఆధారమైన వాస్తవ కథను తలపిస్తుంది.

ఈ కథేమిటో.. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా చూద్దాం.

విచారణ కోర్టు శిక్ష విధించిందిలా...

''2007 డిసెంబర్ 27 తెల్లవారుజామున సుమారు 2:00 గంటల సమయంలో పిడతల సత్యంబాబు కామవాంఛతో శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్‌లోకి చొరబడ్డాడు. భవనం కాంపౌండ్ వాల్ దూకి, ముందు ఆవరణలో ఉన్న బాత్‌రూం కప్పుమీదకు చేరుకుని, అక్కడి నుంచి మొదటి అంతస్తుకు ఎగబాకి, అక్కడి నుంచి మెట్ల మీదుగా రెండో అంతస్తుకు చేరుకున్నాడు.

అక్కడ ఆరో బ్లాకులో ఉన్న ఒక గదిలోకి ప్రవేశించాడు. ఒక మంచం మీద ఒంటరిగా పడుకుని ఉన్న ఆయేషా మీరాను చూశాడు. మిగతా వారు పక్కగదుల్లో పడుకుని ఉండటం చూశాడు. ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేయాలనే ఉద్దేశంతో, హాస్టల్‌లోని వారు ఎవరైనా దాడి చేస్తే తప్పించుకోవాలనే ఉద్దేశంతో మళ్లీ కిందకు వెళ్లి, పక్క ఇంట్లో నుంచి రోకలిబండ తెచ్చాడు.

ఆ రోకలి బండతో ఆమె తలపై బలంగా కొట్టటంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. ఆ తర్వాత ఆమెను మంచం మీద నుంచి పైకెత్తి, వరండాలోకి తీసుకొచ్చి, అదే అంతస్తులో ఆగ్నేయ మూలగా ఉన్న బాత్‌రూంలోకి ఈడ్చుకెళ్లాడు. ఆమె దుస్తులు తొలగించి, ఆమె కుడి కాలును ఒక టవల్‌తో ట్యాప్‌కు కట్టేసి ఆమెపై అత్యాచారం చేశాడు.

'హాస్టల్‌లో అమ్మాయిలను ఉద్దేశించి లేఖ రాశాడు...'

ఆ తర్వాత అతడు తిరిగి ఆమె గదికి వెళ్లి ఆమె బ్యాగును బయటకు లాగి, మరో రెండు సూట్‌కేసులను కూడా బయటకు తీసి, వాటిలోని వస్తువులను చిందరవందరగా పారేశాడు. ఆయేషా బ్యాగులో నుంచి రూ. 500 డబ్బు, కొంత చిల్లరతో పాటు రెండు పెన్నులు, ఒక పెన్సిల్ తీసుకుని మళ్లీ బాత్‌రూం దగ్గరకు తిరిగివెళ్లాడు.

ఆమె ఛాతీ మీద తెలుగులో ప్రేమ చిరుత అని రాశాడు. మళ్లీ వెళ్లి ఆమె బ్యాగులో నుంచి ఒక ఒక నాన్‌జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ ఫొటోకాపీ తీసుకుని, దాని వెనుక పక్క.. ఆమెను హత్య చేసినందుకు, రేప్ చేసినందుకు తనను క్షమించాలని కోరుతూ హాస్టల్‌లోని అమ్మాయిలను ఉద్దేశించి తెలుగులో ఒక లేఖ రాశాడు. అదే కాగితం మరోవైపు చిరుత, చరణ్ తేజ, 143 అని రాసి లవ్ సింబల్స్ గీశాడు.

ఆ కాగితాన్ని అక్కడ పెట్టేసి, రోకలిబండ తీసుకుని, ఆ భవనంలోకి తాను వచ్చిన దారి గుండానే తిరిగి వెళ్లిపోయాడు. రోకలిబండను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడికి వెళ్లి, ఆ ఇంటి ముందు ఆవరణలో గల పొదల్లోకి దానిని విసిరేశాడు.

ఆ తర్వాత ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గరకు వెళ్లి అక్కడ సీలాండ్ టీ స్టాల్ దగ్గర చాలా సేపు ఉన్నాడు. హత్య, అత్యాచారం జరిగిన రోజు సత్యంబాబు తమ టీ స్టాల్ దగ్గర చాలాసేపు ఉన్నాడని దాని యజమాని నిర్ధారించారు.

నిందితుడి మీద నిర్వహించిన డీఎన్ఏ పరీక్ష, చేతిరాత నిపుణుడి అభిప్రాయం, నిందితుడి పాదముద్ర మీద నిపుణుల అభిప్రాయంతో పాటు.. పోలీసుల కస్టడీలో నిందితుడి నేరాంగీకారం, ఇతర ప్రాసంగిక సాక్ష్యాలు (సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్) కలిపి.. సత్యంబాబు ఆయేషా మీరాను హత్య చేశాడని, ఆమెపై అత్యాచారం చేశాడని నిరూపితమవుతోందని ప్రాసిక్యూషన్ చెప్పింది.

దీనితో ఏకీభవించిన విచారణ కోర్టు.. పిడతల సత్యంబాబును దోషిగా నిర్ధారించి, ఐపీసీ సెక్షన్ 302 కింద జీవిత ఖైదు, ఐపీసీ సెక్షన్ 376 కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష.. ఈ రెండూ ఏకకాలంలో అమలయ్యేలా శిక్ష విధిస్తూ 2010 సెప్టెంబర్ 29న తీర్పు చెప్పింది.

హైకోర్టులో ఏం జరిగింది?

విచారణ కోర్టు తీర్పు వెలువడిన ఎనిమిదేళ్ల తర్వాత.. జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైస్వాల్‌లతో కూడిన హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్.. సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసింది.

సత్యంబాబు తరఫున సీనియర్ న్యాయవాది వి. పట్టాభి, న్యాయవాది వసుధా నాగరాజ్‌లు వాదించారు. పోలీసు దర్యాప్తులో లోపాలను, ప్రాసిక్యూషన్ కథనంలోని వైరుధ్యాలను ప్రస్తావించారు.

''నిందితుడిని 2008 ఆగస్టు 16-17 తేదీ రాత్రి అరెస్ట్ చేశామని, ఆయేషా మీరా హత్య సహా తొమ్మిది నేరాల్లో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని నందిగామ సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన సాక్ష్యం చెల్లదు. ఎందుకంటే, ఆ తొమ్మిది కేసుల్లో ఐదు కేసులను హైకోర్టు కొట్టివేసింది'' అని వారు నివేదించారు.

అలాగే.. ''హతురాలి మీద అత్యాచారం జరిగిందని చూపటానికి చట్టపరమైన, ఆమోదనీయమైన ఆధారమేదీ రికార్డయి లేదు. 2008 జనవరి 4వ తేదీన ఎఫ్ఎస్ఎల్‌కు పంపించినట్లుగా చెప్తున్న శాంపిల్స్‌తో ఏదైనా డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేశారని చెప్పే రికార్డు ఏదీ లేదు.

అలాంటి డీఎన్ఏ ప్రొఫైలింగ్ ఏదీ లేనపుడు.. నిందితుడి రక్తం, వీర్య నమూనాలను.. మృతురాలి వద్ద లభించిన డీఎన్ఏ ప్రొఫైల్‌తో మ్యాచ్ అయ్యాయనే వాదన చట్ట ప్రకారం ఆమోదనీయం కాదు'' అని చెప్పారు.

నిందితుడు ఇచ్చినట్లు చెప్తున్న నేరాంగీకార వాంగ్మూలం.. పోలీసు కస్టడీలో ఇచ్చినది కాబట్టి చట్టప్రకారం చెల్లదని వాదించారు.

ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు తీర్పు చెప్పింది. అందులోని ముఖ్యాంశాలివీ...

సర్కమ్‌స్టాన్సియల్ ఎవిడెన్స్‌లో మోటివ్‌ కీలకం...

''నేరానికి కారణమని చెప్తున్న ఆరోపణ కృత్రిమంగా ఉంది. సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా ఉన్న కేసులో మోటివ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. హత్య సంఘటన 2007 డిసెంబర్ 26 వేకువజామున జరిగింది. నందిగామ సబ్‌డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సాక్ష్యం ప్రకారం.. నిందితుడిని 2008 ఆగస్టు 16-17 రాత్రి పాలిటెక్నిక్ హాస్టల్ వెనుక అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకోగా.. అతడు ఈ కేసులో హతురాలి హత్య, ఆమెపై అత్యాచారంతో పాటు, నందిగామలో జరిగిన నేరాలన్నిటికీ తానే పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. నిందితుడు నందిగామ లోని అనాసాగరం నివాసి కాగా, ఈ నేరం జరిగిన హాస్టల్ ఇబ్రహీంపట్నంలో ఉంది. మృతురాలితో కానీ, ఆమె ఉంటున్న హాస్టల్‌తో కానీ నిందితుడికి ముందస్తు పరిచయం ఉందని ప్రాసిక్యూషన్ చెప్పలేదు.''

'నేరాంగీకార వాంగ్మూలం' ఏం చెప్తోందంటే...

''నిందితుడు ఇచ్చినట్లుగా చెప్తున్న నేరాంగీకార వాంగ్మూలం ప్రకారం.. అతడు తన భార్య తనను వదిలివేయటంతో తీవ్ర కామవాంఛతో ఉన్నాడు. సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళ్తే ఎయిడ్స్ వస్తుందని, భయపడ్డాడని, డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందని భావించాడు.

2007లో క్రిస్మస్ తర్వాతి రోజు సాయంత్రం 8:30 గంటలకు లారీ ఎక్కి ఇబ్రహీంపట్నం సెంటర్ చేరుకుని, స్వర్ణ సినిమా హాల్‌లో సెకండ్ షో సినిమా చూశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లటం కోసం బస్ స్టాప్‌కు వెళ్లి, బస్ లేదా లారీ కోసం ఎదురు చూస్తున్నపుడు హాస్టల్ బిల్డింగ్‌లో రెండో అంతస్తులో వరండాలోని లైటు వెలుతురులో ఒక మహిళను చూశాడు. ఆమెను చూసినపుడు అతడికి కామవాంఛ కలిగి, ఆ హాస్టల్‌ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ దూకి, బాత్‌రూం మీదకు చేరుకుని, అక్కడి నుంచి మొదటి అంతస్తులోకి ఎక్కి..అక్కడ పడుకుని ఉన్న మహిళను చూసినపుడు కామవాంఛ కలిగింది.

అక్కడ ఆమెపై లైంగిక చర్య చేస్తే ఆమె ఏడవవచ్చునని, మిగతా మహిళలు నిద్రలేవవచ్చునని ఆలోచించి.. ఆమెను కొట్టి తన కామవాంఛ తీర్చుకోవాలని భావించాడు. ఒక ఆయుధం కోసం అక్కడ వెతకగా అతడికి ఏమీ కనిపించలేదు. దీంతో మెట్లు దిగి కిందకు వెళ్లాడు. అక్కడా ఏమీ కనిపించలేదు. దీంతో పక్క భవనం కాంపౌండ్ లోకి వెళ్లి, అక్కడ కనిపించిన రోకలిబండను తీసుకువచ్చి, రెండో అంతస్తులోకి వెళ్లి, ఆ యువతి నిద్రపోతున్న మంచం దగ్గరకు వెళ్లి, ఆమె తల మీద ఎడమవైపు ఆ రోకలిబండతో కొట్టాడు. ఆమె చిన్నగా మూలిగి శబ్దం చేయకుండా ఉండిపోయింది.

నిందితుడు రాసినట్లు చెప్తున్న లేఖలో ఏముందంటే...

''అయితే.. ఈ కథనం, హతురాలి పక్కన నిందితుడు రాసి వదిలివెళ్లినట్లు చెప్తున్న లేఖలోని విషయానికి భిన్నంగా ఉంది. ఆ లేఖలో.. హాస్టల్‌లోకి వచ్చింది ఆమెను తాను చంపటానికి కాదని, ఐ లవ్ యూ చెప్పటానికి వచ్చానని, తాను గదిలోకి వచ్చి చాలాసార్లు వేడుకున్నా ఆమె ఐ లవ్ యూ చెప్పటానికి నిరాకరించిందని, దీంతో తాను కోపంతో ఆమె తల మీద గట్టిగా కొట్టానని రాసివుంది.

నిందితుడు ఇచ్చినట్లుగా చెప్తున్న నేరాంగీకార వాంగ్మూలానికి, ఈ లేఖకు మధ్య తీవ్ర వైరుధ్యం ఉంది. లేఖలోని అంశాలు.. హతురాలితో నిందితుడికి ముందస్తు పరిచయం ఉందని సూచిస్తున్నాయి. కానీ వాంగ్మూలం ప్రకారం.. అతడు తన కామవాంఛ తీర్చుకోవటానికి హాస్టల్‌కు వెళ్లాడు, హాలులో ఒంటరిగా పడుకుని ఉన్న హతురాలిని యాదృచ్ఛికంగా ఎంచుకున్నాడు.

ప్రాసిక్యూషన్ సూచిస్తున్న మోటివ్‌ స్వవిరుద్ధంగా ఉండటమే కాదున బలహీనంగా కూడా ఉంది. ఈ భాగాన్ని నిశితంగా పరిశీలిస్తే.. చాలా కృతకంగా కనిపిస్తోంది.''

ఆ ఫీట్లు చేయాలంటే సూపర్‌మాన్ శక్తులుండాలి...

''నిందితుడు హాస్టల్ భవనం కాంపాండ్ వాల్ దూకి.. బాత్‌రూం పైకప్పు మీదకు వెళ్లి, అక్కడి నుంచి పైకెగిరి ఆరడగుల ఐదంగుళాల ఎత్తులో ఉన్న మొదటి అంతస్తు పిట్టగోడను అందుకున్నాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. భవనం కింది భాగంలో ఉన్న బాత్‌రూం నుంచి ప్రధాన భవనం మధ్య ఎనిమిది అడుగుల దూరం ఉందని సీన్ ఆఫ్ అఫెన్స్ అబ్జర్వేషన్ రిపోర్ట్ చెప్తోంది. అంటే.. ఒక వ్యక్తి మొదటి అంతుస్తుకు చేరుకోవాలంటే టాయిలెట్ పైకప్పుకు వెళ్లటమే కాదు.. అక్కడి నుంచి ఆరడుగుల ఐదంగుళాల ఎత్తు, ఎనిమిది అడుగుల దూరం ఎగిరి పిట్టగోడను పట్టుకోవాలి. నిందితుడు ఒకసారి కాదు రెండుసార్లు - మొదటిసారి ఒట్టి చేతులతో, రెండోసారి రోకలిబండ చేత్తో పట్టుకుని - ఈ విన్యాసం చేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపణ.

మొదటిసారి వట్టిచేతులతో కాంపౌండ్ వాల్ దూకి, బాత్‌రూం పైకప్పు ఎక్కి, అక్కడి నుంచి మొదటి అంతస్తుమీది పిట్టగోడ మీదకు దూకాడని; రెండోసారి ఆయేషా మీద దాడి చేయటం కోసం ఆయుధం వెతుకుతూ మళ్లీ కిందకు వచ్చి పక్క ఇంటి కాంపౌండ్ నుంచి రోకలిబండను తీసుకుని దానితోపాటు మళ్లీ అలాగే బాత్‌రూం పైకప్పు నుంచి ఎగిరి మొదటి అంతస్తుకు చేరుకున్నాడని ప్రాసిక్యూషన్ కథనం. ఆ తర్వాత నేరం పూర్తయ్యాక మళ్లీ ఆ రోకలిబండను వెంట తీసుకుని భవనం మీద నుంచి కిందకు దూకి దానిని తాను తీసుకువచ్చిన చోటే పడేశాడు.

మామూలు వ్యక్తి కోణం నుంచి పరిశీలిస్తే.. ఐదడుగుల ఐదంగుళాల ఎత్తు, 50 కిలోల బరువు ఉన్న నిందితుడి వంటి ఒక వ్యక్తి ఇటువంటి విన్యాసం చేయటం అసాధ్యం. ఇలాంటి విన్యాసం చేయాలంటే ఒక సూపర్‌మాన్ శక్తి అవసరమవుతుంది. నిందితుడి వంటి మామూలు వ్యక్తి ఇలాంటిది సాధించగలిగే అవకాశం ఏమాత్రం లేదు.''

చుట్టూ అంతమంది ఉంటే ఒక్కరికీ వినపడలేదా..?

''ఇక ఈ సంఘటన జరిగినపుడు హాస్టల్‌లో 55 మంది స్టూడెంట్స్ ఉన్నారని వార్డెన్ తన సాక్ష్యంలో చెప్పారు. హాస్టల్ విద్యార్థినుల సాక్ష్యం ప్రకారం.. హతురాలు బ్లాక్‌లోని ఒక హాలులో ఒంటరిగా నిద్రపోతోంటే.. ఆమె మంచానికి రెండు అడుగుల దూరంలో ఆనుకుని ఉన్న వంటగదిలో మరో ఇద్దరు యువతులు నిద్రపోతున్నారు.

వంటగదికి ఆనుకుని ఉన్న గదిలో మరో ఐదుగురు విద్యార్థినిలు నిద్రపోతున్నారు. ఆ గది హతురాలి మంచానికి 9.8 అడుగుల దూరంలో ఉంది. హాలుకి ఆనుకుని ఉన్న మరో గదిలో మరో నలుగురు విద్యార్థులు నిద్రపోతున్నారు. అంటే.. హతురాలు నిద్రపోతున్న మంచానికి 2 అడుగుల నుంచి 15 అడుగుల దూరంలో మొత్తం 11 మంది విద్యార్థులు నిద్రపోతూ ఉన్నారు.

నిందితుడు రెండో అంతస్తులోకి రాగలగటమే కాదు.. ఎవరికంటా పడకుండా ఆ హాలులోకి చొరబడి, మృతురాలి తలమీద రోకలిబండతో మోది, ఒంటిచేత్తో ఆమెను ఎత్తుకుని 6వ బ్లాకు తలుపు దగ్గరకు తీసుకెళ్లి, అక్కడి నుంచి దాదాపు 60 అడుగుల దూరం లాక్కెళ్లాడని మేము (హైకోర్టు) నమ్మాలని ప్రాసిక్యూషన్ కోరుకుంటోంది.

5వ బ్లాకులో కూడా ఒక హాలు, రెండు బెడ్‌రూంలు ఉన్నాయని, అందులో కొందరు విద్యార్థినులు ఉన్నారని గుర్తుపెట్టుకోవటం ముఖ్యం. నిందితుడు హతురాలి శరీరాన్ని.. ఐదో బ్లాకు హాలు, బెడ్‌రూం ముందుగా వెళ్లే వరండా లో నుంచి కొంతదూరం, ఆ తర్వాత బాత్‌రూం వరకూ మరికొంత దూరం లాక్కెళ్లాడని చెప్తున్నారు. అతడు ఈ పనంతా పూర్తిచేసి, భవనం నుంచి వెళ్లిపోయే వరకూ హాస్టల్‌లో ఉన్నవారిలో కనీసం ఒక్కరు కూడా నేరస్తుడు వరుస నేరాలు చేస్తుంటే గమనించలేదు.

అకస్మాత్తుగా చేసిన దాడిలో సైతం బాధితురాలు తన మీద దాడి జరిగితే కేకలు వేస్తుంది. హతురాలు కేవలం సన్నగా మూలిగింది కానీ మరే శబ్దమూ చేయలేదని చెప్తున్నారు. నిందితుడు ఈ హింసాత్మక హత్య, ఆరోపిత అత్యాచారం.. అర్థరాత్రి అయినా సరే ఎలాంటి శబ్దం రాకుండా ప్రశాంతంగా, ఎవరి దృష్టిలో పడకుండా చేశాడంటే ఎవరైనా నమ్మటం అసాధ్యం.

హతురాలు నిద్రిస్తున్న హాలుకు బోల్టు పెట్టుకోలేదన్న వాదన కూడా అనుమానాస్పదంగా ఉంది. భద్రత రీత్యా తలుపులకు లోపలి నుంచి బోల్టు పెట్టుకోవటం మంచిదని.. కానీ హాలులోని వారు టాయిలెట్‌కు వెళ్లటం కోసం.. బెడ్‌రూమ్‌ల బోల్టులు కూడా పెట్టుకోమని విద్యార్థునులు వాంగ్మూలంలో చెప్పారు.

కానీ.. కారిడార్ నుంచి నేరుగా లోపలికి రావటానికి వీలుకల్పించే హాలు తలుపులకు బోల్టు పెట్టుకోకుండా, దానిని తెరిచే ఉంచటానికి కారణం కానీ, హేతుబద్ధత కానీ కనిపించటం లేదు. నేరస్తుడు లోపలి వారి సహాయ సహకారాలు లేకుండా నేరుగా హాలు లోపలికి రావటానికి వీలుకల్పించేలా.. హాలు తలుపుకు లోపలి నుంచి బోల్టు పెట్టలేదన్న ప్రాసిక్యూషన్ వాదనను అంగీకరించటం కష్టం.''

అపరిచితుడైతే నేరం చేశాక భయపడి పారిపోయేవాడు...

''నిందితుడు ఇచ్చినట్లుగా చెప్తున్న నేరాంగీకార వాంగ్మూలం ప్రకారం.. హతురాలితో అతడు రెండుసార్లు సెక్స్ చేశాడు. మొదటిసారి ఆమె శరీరాన్ని లాక్కెళ్లినపుడు సెక్స్ చేశాడు. ఆ తర్వాత కిచెన్‌లో ఉన్న ఆమె సూట్‌కేసును, హాలులో ఉన్న మరో సూట్‌కేసును తెరిచి, వాటిలోనుంచి దుస్తులను తీసి చిందరవందరగా పారేసి, బ్యాగు లోనుంచి పెన్ను తీసుకుని, రోకలిబండను కూడా తనతో తీసుకుని, హతురాలి దగ్గరకు వెళ్లి ఆమె ఛాతీ మీద 'H ప్రేమ చిరుత' అని రాసి, మళ్లీ రెండోసారి సెక్స్ చేశాడు.

ఈ సమయంలోనే.. హతురాలు శ్వాస తీసుకోవటం లేదని నిందితుడు గుర్తించాడని, ఆమె చనిపోయిందని భావించాడని చెప్తున్నారు. ఆ తర్వాత హాలులోకి వెళ్లి, ఆమె బ్యాగు లోనుంచి ఒక పేపర్ తీసుకుని, దానికి ఒకవైపు లేఖ రాశాడు. ఆ పేపర్ రెండోవైపున చిరుత, చరణ్ తేజ, 143 అని రాసి లవ్ సింబల్ గీసి, ఆ లేఖను అక్కడ వదిలి, బాత్‌రూం దగ్గరకు వెళ్లి, రోకలిబండను తీసుకుని, దానిని తీసుకువచ్చిన పొరుగింటి కాంపౌండ్‌కు వెళ్లి, అక్కడి పొదల్లోకి విసిరేశాడు. ఒక మనిషి నిజంగా మృగంగా మారితే తప్ప ప్రాసిక్యూషన్ ఆరోపించినట్లు ఈ విధంగా ప్రవర్తించటం అసాధ్యం.

హతురాలితో నిందితుడికి ముందస్తు పరిచయం ఉందని, తనను ప్రేమించాలని లేదా తనతో సంబంధం పెట్టుకోవాలని అతడు గతంలో ఆమెకు ఎలాంటి ప్రతిపాదనలైనా చేశాడని ప్రాసిక్యూషన్ చెప్పటం లేదనేది మరోసారి గుర్తుపెట్టుకోవాలి. దానికి విరుద్ధంగా.. నిందితుడు తన కామవాంఛ తీర్చుకోవటానికి ఈ హాస్టల్‌లోకి ప్రవేశించాడని, అనుకోకుండా హతురాలు అతడి బారిన పడిందని మాత్రమే చార్జ్‌షీట్ ఆరోపించింది.

ఒకవేళ అదే నిందితుడి ఏకైక లక్ష్యమైనట్లయితే.. హత్య, అత్యాచారం చేసిన తర్వాత అతడు పైన చెప్పిన మిగతా పనులన్నీ చేశాడనటం చాలా విడ్డూరంగా ఉంది. హతురాలు శ్వాస తీసుకోవటం లేదని గుర్తించినపుడు, ఆమె చనిపోయిందని అనుమానించినపుడు.. తనకు దగ్గరగా చుట్టుపక్కల గదుల్లో అంతమంది జనం ఉన్నపుడు (వార్డెన్ సాక్ష్యం ప్రకారం ఆ రోజు హాస్టల్‌లో 55 మంది మహిళలున్నారు) ఎవరైనా తనను గమనించి, పట్టుకుంటారేమోననే భయంతో నిందితుడు సాధ్యమైనంత త్వరగా హాస్టల్ బిల్డింగ్ నుంచి వెళ్లిపోవాలని తొందరపడేవాడు.

కానీ.. తాను హాస్టల్‌లోకి రావటానికి, ఆమెను హత్య చేసి, రేప్ చేయటానికి కారణం చెప్తూ, తను చేసిన దానికి క్షమాపణ చెప్తూ హాస్టల్ లోని వారికి లేఖ రాయటంతో పాటు.. పెన్నులు, పెన్సిళ్లు పట్టుకెళ్లి నింపాదిగా హతురాలి ఛాతీ మీద అక్షరాలు రాస్తాడనుకోలేం. ఈ ఆరోపిత పనులన్నీ చేయటానికి నిందితుడికి చాలా సమయమే పట్టివుండాలి. ఒక అపరిచితుడు, తన కామవాంఛను తీర్చుకున్నాక ఇవన్నీ చేశాడనటం.. సహజ మానవ ప్రవర్తనకు విరుద్ధం.''

నిందితుడి దుస్తుల మీద రక్తం మరకలు లేవా?

''సీన్ ఆఫ్ అఫెన్స్ అబ్జర్వేషన్ రిపోర్టు ప్రకారం.. నిందితుడు హతురాలిని మంచం మీద నుంచి పైకెత్తి వరండా దగ్గరకు తీసుకొచ్చి, అక్కడి నుంచి బాత్‌రూం వరకూ 60 అడుగుల దూరం లాక్కెళ్లాడు. ఒకవేళ నిందితుడు ఆ పనులన్నీ చేసివుంటే.. అతడి దుస్తులు హతురాలి తల గాయం నుంచి కారుతున్న రక్తంలో తడిసిముద్దయి ఉండేవి. హాలు, వరండా, బాత్‌రూంలో కనిపించిన రక్తపుగుర్తులు దీనిని సూచిస్తున్నాయి. అలాగే హతురాలి శరీరం కూడా పూర్తిగా రక్తంతో తడిసి ఉండేది. కానీ.. పంచనామా నివేదిక ప్రకారం..ఆమె తల దగ్గర రక్తపు మడుగు ఉంది, రెండు ముక్కులు, రెండు చెవుల నుంచి రక్తం కారుతోంది. తల వెనుక పెద్ద వాపు కనిపించింది. ఆమె శరీరం మీద మరే భాగంలోనూ రక్తం కనిపించలేదు.

అలాగే.. ఇబ్రహీంపట్నం దగ్గర టీ స్టాల్ యజమాని చెప్పిన సాక్ష్యం ప్రకారం.. 2007 డిసెంబర్ 27వ తేదీ ఉదయం సుమారు 5:30 గంటలకు ఒక అపరిచితుడు తన దుకాణానికి వచ్చి, ఉదయం 11:00 గంటల వరకూ అక్కడే టీవీ చూస్తూ ఉన్నాడు. అతడు టీ, సిగరెట్లు కొంటూ టీ స్టాల్ లోపల, చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాడు. తన దుకాణానికి వచ్చేవాళ్లు మామూలుగా ఐదు, పది నిమిషాలు ఉండి వెళ్లిపోతారని, కానీ నిందితుడు తన షాపు దగ్గర సుమారు 5 గంటల పాటు ఉన్నాడని కూడా టీ స్టాల్ యజమాని చెప్పాడు. ఆ అపరిచితుడినే నిందితుడిగా ఆ తర్వాత గుర్తించానని చెప్పాడు.

నిందితుడి దుస్తుల నిండా రక్తం ఉంటే.. అతడు అవతారం మామూలుగా ఉండి ఉండదు. అతడు టీస్టాల్ దగ్గరకు వెళ్లి.. దాదాపు 5 గంటలు ఉన్నాడని చెప్తున్నారు. కానీ టీస్టాల్ యజమానికి ఎలాంటి అనుమానం రాలేదు. నిందితుడు ఆ టీస్టాల్‌కు వెళ్లటానికి ముందు తన దుస్తులను ఉతికి, రక్తపు మరకలను తొలగించాడా అనేది వివరించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైంది.

ఆరోపిత సంఘటనకు, నిందితుడు టీస్టాల్‌కు వెళ్లినట్లు చెప్తున్న సమయానికి మధ్య ఉన్న స్వల్ప సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. అతడు తన బట్టలు ఉతికి, రక్తపుమరకలేమీ కనిపించకుండా పొడిగా, మామూలుగా ఉండేలా చేసుకోవటం అసాధ్యం. ప్రాసిక్యూషన్ కథలో ఈ భాగం చాలా దూరంపోయినట్లు మాకు కనిపిస్తోంది.''

వేలిముద్రలు, పాదముద్రలు ఎందుకు లేవు?

''నిందితుడికి ఆపాదించిన పనులన్నీ అతడు చేసివున్నట్లయితే.. హతురాలి శరీరం అంతటా, సూట్ కేసులు, పెన్నులు, పెన్సిళ్లు, లెటర్ మీద లెక్కలేనన్ని వేలిముద్రలు ఉండేవి. హాలులో కారిడార్‌లో, వరండాలో, బాత్‌రూంలో కాలిముద్రలు కూడా ఉండేవి.

ఆశ్చర్యకరంగా..నేర స్థలాన్ని తాను అణువణువూ పరిశీలించానని, క్లూస్ టీం సాయంతో వేలిముద్రల కోసం వెతికానని కానీ ఏవీ కనిపెట్టలేక పోయామని దర్యాప్తుకు సారథ్యం వహించిన పోలీసు అధికారి సాక్ష్యం చెప్పారు. క్లూస్ టీం ఎలాంటి పాదముద్రలను కూడా గుర్తించలేకపోయిందని ఆయన క్రాస్-ఎగ్జామినేషన్‌లో చెప్పారు.

తన కళ్లతో తాను ఎలాంటి పాదముద్రలూ చూడలేదని చెప్పిన ఆయన.. ఆ తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ వీడియోను క్షుణ్నంగా పరిశీలించిన క్లూస్ టీం అందులో పాక్షికంగా ఉన్న ఒక పాదముద్రను గుర్తించిందని చెప్పారు. అయితే.. పోలీసులు నేరస్థలంలో కారిడార్లో, బాత్‌రూం దగ్గర పాదముద్రలు కనుగొన్నారని, కానీ వాటిని వారే చెరిపేశారనే వాదనను ఆయనను తిరస్కరించారు.

హతురాలి మీద దాడి చేయటంతో పాటు, ఆమెను ఎత్తుకుని, 60 అడుగుల దూరం లాక్కెళ్లి, ఆమె కాలుని ట్యాప్‌కు కట్టి.. ఇన్ని పనులు నిందితుడు ఒంటరిగా చేశాడని ప్రాసిక్యూషన్ చెప్తున్నపుడు.. హతురాలి శరీరం మీద వేలిముద్రలేవీ కనిపంచలేదంటే నమ్మటం అసాధ్యం. అలాగే నిందితుడు నాన్-జ్యుడీషియల్ పేపర్ మీద లేఖ రాశాడని చెప్తున్నారు. దానిమీద వేలిముద్రలు ఉండాలి. ఆ ముద్రలన్నిటినీ నిందితుడు చెరిపివేయటం అసాధ్యం.

అలాగే అనేక పాదముద్రలు కూడా ఉండాలి. కానీ.. వీడియోలో గుర్తించిన ఓ పాక్షిక పాదముద్ర మినహా.. నేర స్థలంలో వేలిముద్రలు, పాదముద్రలు లేకపోవటం గురించి వివరించే ప్రయత్నం కూడా ప్రాసిక్యూషన్ చేయలేదు.

ఇక వీడియోలో గుర్తించిన పాక్షిక పాదముద్రతో నిందితుడి పాదముద్ర సరిపోలిందంటున్న విషయానికి వస్తే.. ఆ పాదముద్రపై ఎఫ్ఎస్‌ఎల్ నివేదికను ప్రాసిక్యూషన్ సమర్పించింది. దానిని జారీచేసిన సైంటిఫిక్ ఆఫీసర్‌ను ప్రశ్నించినపుడు.. వీడియోలో గుర్తించిన పాక్షిక పాదముద్ర అస్పష్టంగా ఉందని చెప్పారు. దానితో నిందితుడి పాదముద్ర మొత్తంగా సరిపోలినట్లు కనిపిస్తోందని చెప్పారు. అయితే.. నిందితుడి నుంచి పాదముద్రలను స్వతంత్ర సాక్షుల సమక్షంలో పంచనామా కింద సేకరించినట్లు ఆధారాలు లేవు.

అంతేకాదు.. అంతకుముందు పోలీసులు నిందితుడిగా చూపిన గురవిందర్ సింగ్ ఆనంద్ (లడ్డు) పాదముద్ర కూడా సరిపోయిందంటూ 2008 మార్చి 17న ఇదే సైంటిఫిక్ అధికారి నివేదిక ఇచ్చారు. ఈ రెండిటిలో ఏది ఎక్కువ బలమైనదనేది ఆయన నిర్ధారితంగా చెప్పలేదు. అలాగే.. లడ్డూ పాదముద్ర కూడా సరిపోయినపుడు, అతడిని ఎందుకు వదిలిపెట్టారో అర్థంకాదు.

ఇక హతురాలి దగ్గర దొరికిన లేఖలోని చేతిరాతతో, నిందితుడి చేతిరాత సరిపోయిందనే వాదనలు కూడా ఇలాగే అనుమానాస్పదంగా ఉన్నాయి.

రోకలిబండతో కొడితే అల్మరా మీద రక్తపు మరకలు ఎందుకున్నాయి?

నిందితుడు.. ఆయేషా తల మీద రోకలిబండతో కొట్టటం ద్వారా గాయపరిచాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అయితే పోస్టుమార్టం నివేదిక.. తల వెనుక పెద్ద గాయంతో పాటు.. ముందుభాగంలో పై పెదవి ఎడమవైపు 2X2 సెంటీమీటర్లు, కింది పెదవి ఎడమవైపు 1X1 సెంటీమీటర్ల గాయం ఉంది. ఈ గాయం గురించి వివరించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని నిందితుడి తరఫు న్యాయవాది పట్టాభి వాదించారు.

ఆయన వాదన ప్రకారం: ఆయేషా మరణం.. ప్రాసిక్యూషన్ చెప్తున్న విధానానికి పూర్తి విరుద్ధంగా సంభవించింది. అంటే.. ఆమె తలను గోడకేసి కొట్టినపుడు ఆమె తలలోని పుర్రె పగిలి, ఆమె ముక్కు నుంచి, నోటి నుంచి రక్తస్రావం జరిగింది. ఆమె అరుస్తుందేమోననే భయంతో హంతకుడు ఆమె గొంతునొక్కాడు.. ఆమె ముఖాన్ని దిండుకేసి ఒత్తిపెట్టి ఉండొచ్చు, ఈ క్రమంలో రక్తస్రావంతో ఆమె ఊపిరాడక చనిపోయి ఉండాలి. రెండు కళ్లలోనూ అంతర్గత రక్తస్రావం ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక చెప్తోందని.. ఇది గొంతు నొక్కటానికి లేదా శ్వాస అందకపోవటానికి సూచిక.

అలాగే సీన్ ఆఫ్ అఫెన్స్ అబ్జర్వేషన్ నివేదిక ప్రకారం.. హతురాలి మంచం పక్కనే ఉన్న సిమెంట్ వాల్ అల్మరా మీద 2X2 సెంటీమీటర్ల రక్తపు మరక ఉంది. అలాగే దిండ్లు రక్తపు మడుగులో తడిసిపోయి ఉన్నాయి.

'నేర స్థలంలో, హతురాలి శరీరం మీద కనిపించిన ఆధారాలనుబట్టి.. నేరస్తులు ఆమె గొంతు నొక్కటం ద్వారా కానీ, ఆమె తలను గోడ మూల కేసి కొట్టటం ద్వారా కానీ చంపి, ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని బాత్‌రూం దగ్గరకు లాక్కెళ్లి ఉంటారని, ఆ నేరస్తులు ఆమెతో కలిసి నివసించి ఉండవచ్చునని అనుమానిస్తున్నాం' అంటూ తొలుత దర్యాప్తు అధికారి వేసిన అంచనాలను సీనియర్ కౌన్సిల్ ఉటంకిస్తున్నారు. ఇలా జరిగి ఉండే అవకాశాన్ని కొట్టివేయలేం.''

డీఎన్ఏ నివేదిక అనుమానాస్పదం...

''చైన్ ఆఫ్ సర్కమ్‌స్టాన్సెస్‌లో అత్యంత కీలకమైన లింక్.. నిందితుడి రక్త నమూనాలు, హతురాలి శరీరం నుంచి సేకరించిన వెజైనల్ స్వాబ్స్, స్మెర్స్ డీఎన్ఏ ప్రొఫైల్‌తో సరిపోయినట్లు చెప్పటం.

హతురాలి శరీరం మీద నుంచి సేకరించిన వజైనల్ స్వాబ్స్, వజైనల్ స్మెర్స్‌.. మానవ వీర్యం ఉన్నట్లు చూపాయని, లైంగిక చర్య జరిగినట్లు ఇది సూచిస్తోందని శవపరీక్ష నిర్వహించిన డాక్టర్ సాక్ష్యం చెప్పారు.

అయితే హతురాలి నుంచి సేకరించిన వజైనల్ స్వాబ్స్‌ను భద్రపరచటంలో, డీఎన్ఏ పరీక్షలకు పంపించటంలో ఎఫ్ఎస్ఎల్, దర్యాప్తు సంస్థ మొట్టమొదటి నుంచీ పారదర్శకత పాటించలేదు. ఈ పరిస్థితుల్లో దర్యాప్తు సంస్థ అనుసరించి విధానం మొత్తం.. మానిప్యులేషన్‌కు తావిస్తుంది.

హతురాలి నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలతో, అవే నమూనాలను సరిపోల్చేలా చేసి, డీఎన్ఏ మ్యాచ్ అయిందంటూ ఎవరినైనా ఈ కేసులో నిందితుడిగా తేల్చే అవకాశముందన్న డిఫెన్స్ వాదనలను కొట్టివేయలేం. డీఎన్ఏ ప్రొఫైలింగ్‌ను 2008 ఫిబ్రవరి 13వ తేదీన జెనరేట్ చేసినట్లు చెప్తున్నపుడు..డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఎక్స్‌పర్ట్ ఆ డీఎన్ఏ ప్రొఫైలింగ్‌ను, మిగిలిన నమూనాలను దర్యాప్తు సంస్థకు పంపించి ఉండాల్సింది.

వారు ఆ నివేదికను, నమూనాలను భద్రపరచటం కోసం కోర్టులో ప్రవేశపెట్టి ఉండాల్సింది. దీనివల్ల.. నిందితుడిని తప్పుగా ఇరికించేందుకు చేశారని అనుమానిస్తున్నట్లుగా.. డీఎన్ఏ రిపోర్టును మానిప్యులేట్ చేయటానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి.. దర్యాప్తు సంస్థ, ఎఫ్ఎస్‌ఎల్‌లు అనుసరించిన విధానం.. డీఎన్ఏ నివేదిక విశ్వసనీయతను సందేహాస్పదం చేశాయని మేం భావిస్తున్నాం.

అసలు ఆయేషా మీద అత్యాచారం జరిగిందా? లేదా?

నిందితుడు హతురాలి మీద అత్యాచారం చేశాడని చార్జ్‌షీట్ ఆరోపించింది. నిందితుడు ఇచ్చినట్లుగా చెప్తున్న నేరాంగీకార వాంగ్మూలం ప్రకారం.. అతడు హతురాలి మీద రెండుసార్లు అత్యాచారం చేశాడు.

పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. హతురాలి శరీరం మీద, ఆమె వ్యక్తిగత భాగాల మీద పెనుగులాడిన గుర్తులేవీ లేవు. వ్యక్తిగత భాగాల్లో అంతర్గత అవయవాలన్నీ మామూలుగానే ఉన్నాయి.

అయితే.. హతురాలి మీద నిందితుడు దాడి చేసిన తీరు గురించి ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణ ప్రకారం.. ఆమెపై అతడు అత్యాచారానికి పాల్పడే సమయానికి ఆమె చనిపోయి ఉండటమో, చనిపోతూఉండటమో జరగాలి.

నిందితుడు ఇచ్చినట్లు చెప్తున్న వాంగ్మూలంలో.. తను రెండోసారి రేప్ చేసిన తర్వాత, ఆమె కదలటం లేదని, ఆమె శ్వాసతీసుకోవటం లేదని, ఆమె చనిపోయిందని అనుకున్నానని చెప్పాడు. అంటే.. నిందితుడు ఆమెను దాదాపుగా చంపేసిన తర్వాత ఆమెపై అత్యాచారం చేసి ఉండాలి.

అయితే.. చనిపోయిన లేదా అపస్మారకంలో ఉన్న వ్యక్తి విషయంలో.. ఆమె వ్యక్తిగత భాగాలకు గాయం కాకుండా రేప్ చేయటం సాధ్యం కాదని సీనియర్ కౌన్సిల్ పట్టాభి వాదించారు. ఇందుకు సంబంధించి షాస్ టెక్ట్స్ బుక్ ఆఫ్ గైనకాలజీలోని కొన్ని అంశాలను కోర్టు ముందుంచారు.

'మహిళ మేల్కొని ఉన్నట్లయితే, కోరిక కలిగి, ఇంటర్‌కోర్సుకు అనుమతించేట్లయితే.. బార్తోలిన్స్ గ్లాండ్.. వజైన్ లోకి లూబ్రికేటింగ్ మ్యూకస్‌ను విడుదల చేస్తుంది. అయితే ఈ కేసులో హతురాలు అపస్మారకంలో కానీ, చనిపోయి కానీ ఉండటం వల్ల బార్తోలిన్స్ గ్లాండ్ లూబ్రికేటింగ్ మ్యూకస్‌ను విడుదల చేసే అవకాశం లేదు. కాబట్టి.. నిందితుడు బలవంతంగా ఇంటర్‌కోర్స్ చేసినట్లయితే, హతురాలి వ్యక్తిగత భాగాలకు గాయం కాకుండా అది సాధ్యమయ్యేది కాదు' అని సీనియర్ కౌన్సిల్ నివేదించారు.

దీనినిబట్టి.. హతురాలి వ్యక్తిగత భాగాలకు గాయం కాకుండా ఆమె మీద రెండుసార్లు కాదు.. కనీసం ఒక్కసారి కూడా అత్యాచారం చేసే అవకాశం లేదని మేం భావిస్తున్నాం. దీనికి తోడు.. డీఎన్ఏ టెస్ట్ కూడా చాలా అనుమానాస్పదంగా ఉండటం.. రేప్ జరిగిందన్న ప్రాసిక్యూషన్ వాదనను పూర్తిగా కొట్టివేస్తోంది.

అత్యాచారమే లేనపుడు.. హతురాలి మీద నిందితుడు దాడి చేయటానికి మోటివ్ కూడా ఉండదు. ఈ పరిస్థితులు.. అసలు నేరస్తుల నుంచి కోర్టు దృష్టిని మళ్లించటానికి, నిజాన్ని దాచిపెట్టటానికి దర్యాప్తు సంస్థ రేప్ థియరీని ముందుకు తెచ్చినట్లు స్పష్టంగా సూచిస్తున్నాయి.''

వీటితో పాటు ఇంకా అనేక అంశాలను హైకోర్టు తప్పుపట్టింది. నిందితుడికి శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ.. అతడిని నిర్దోషిగా విడుదల చేసింది. అతడికి పరిహారంగా రూ.1,00,000 చెల్లించాలని ఆదేశించింది.

ఆయేషా కేసులో అసలు నిందితులెవరు?

ఆయేషా హత్య కేసులో సంత్యంబాబే అసలు దోషి అని పోలీసులు వాదించారు. ఈ కేసు పునర్విచారణకు నిరాకరించటంతో హక్కుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి.

హైకోర్టు ఆదేశాల మేరకు ఆయేషా కేసు విచారణకు కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

అయితే.. తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆయేషా తల్లిదండ్రులు కోరగా కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. విచారణ కోర్టులు ఆధారాలు ధ్వంసం కావటం మీద కూడా దర్యాప్తు చేయాలని సీబీఐని నిర్దేశించింది.

ఆధారాలు ధ్వంసం కావటానికి సంబంధించి విజయవాడ విచారణ కోర్టు సిబ్బంది కొందరి మీద సీబీఐ కేసులు నమోదు చేసింది. కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుతో పాటు, అనుమానితులుగా ఉన్న కోనేరు సతీశ్, ఇతరులను ప్రశ్నించింది.

సీబీఐ 2019లో ఆయేషా మీరా మృతదేహాన్ని వెలికితీసి మరోసారి పోస్టుమార్టం నిర్వహించింది.

ఈ కేసులో కోనేరు సతీశ్ సహా కొందరు అనుమానితులపై నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించటానికి అనుమతించాలని సీబీఐ తాజాగా కోరింది. విజయవాడ కోర్టు అందుకు నిరాకరించింది.

ప్రస్తుతం సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)