You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘డుగ్ డుగ్' బుల్లెట్ బండిపై సినిమా, ఇంతకూ రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గుడి ఎందుకు కట్టారు
మోటార్ సైకిల్‌కు గుడి కట్టి, దాన్నొక దేవతగా పూజించే కథతో ఇటీవలే హిందీలో 'డుగ్ డుగ్' అనే సినిమా వచ్చింది.
ఈ చిత్ర కథ అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తోందంటూ ఫైజల్ ఖాన్ అందిస్తున్న కథనం ఇది.
సుమారు ఒక శతాబ్దం కిందట ఇంగ్లండ్‌లోని వార్సెస్టర్‌షైర్‌కు చెందిన రెడిచ్ పట్టణంలో తొలిసారిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌ను తయారుచేశారు.
దీని శబ్దాన్ని అనుకరిస్తూ ఈ సినిమాకు 'డుగ్ డుగ్' అని పేరు పెట్టారు.
ఈ సినిమా కథ రాజస్థాన్‌లో సాగుతుంది. మద్యం మత్తులో హైవేపై మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి ట్రక్కును ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోతారు.
మర్నాడు ఉదయం పోలీస్ కస్టడీలో ఉన్న ఆయన వాహనం అదృశ్యమైపోతుంది. దాని కోసం వెతుకుతుంటే ఆశ్చర్యకరంగా, ఆ వ్యక్తి మరణించిన ప్రదేశంలో ఆ వాహనం కనిపిస్తుంది.
దాన్ని తిరిగి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో పెడతారు. కానీ, అది మళ్లీ మాయమైపోయి ప్రమాదం జరిగిన చోటే దొరుకుతుంది.
దాంతో, చనిపోయిన వ్యక్తికి మహిమలు ఉన్నాయని ఆ గ్రామస్థులు నమ్ముతారు. ఆ వ్యక్తిని ఒక బాబాగా, మోటార్ సైకిల్‌ను దేవతగానూ పూజించడం మొదలుపెడతారు.
వ్యాపారంగా మారుతున్న మతం, మూఢనమ్మకాలు, మితిమీరిన భక్తి, ఆచారాలపై సంధించిన వ్యంగ్యాస్త్రమే ఈ డుగ్ డుగ్.
ఏమాత్రం ఆలోచించకుండా, ప్రశ్నించకుండా ప్రజలు తమ నమ్మకాలకు, విశ్వాసాలకు ఎలా కట్టుబడి ఉంటారో సూటిగా, సరళంగా ఈ చిత్రంలో చూపించారు.
"నువ్వు దేన్నైనా మనస్ఫూర్తిగా నమ్మితే, అది నిజమవుతుంది" అని ఈ చిత్ర దర్శకుడు రిత్విక్ పరీక్ అంటారు. రిత్విక్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో పుట్టి పెరిగారు.
గంట నలభై ఏడు నిముషాల నిడివి గల ఈ చిత్రాన్ని గత నెలలో 46వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.
జోధ్‌పూర్‌కు సుమారు 75 కిమీల దూరంలో పాలిలో ఉన్న ఓ ఆలయమే ఈ చిత్రానికి స్ఫూర్తి. విదేశీ పర్యటకులకు ఈ స్థలం ఓ ప్రత్యేక ఆకర్షణ.
రోడ్డు పక్కన ఉన్న ఈ గుడిలో ఓ పాత రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను పీఠంపై ఉంచి పూజిస్తారు.
ఆ మోటార్ సైకిల్ యజమాని ఓం సింగ్ రాథోడ్ 30 సంవత్సరాల క్రితం, జోధ్‌పూర్- జైపూర్ హైవేపై రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఈ ఆలయాన్ని "బుల్లెట్ బాబా" గుడి అంటారు. హైవేలపై ప్రయాణించే ట్రక్కు డ్రైవర్లు ఇక్కడ ఆగి, ప్రమాదాలు జరగకుండా చూడమని గుడిలో ఉన్న బుల్లెట్‌కు నమస్కరించి వెళుతుంటారు.
రోడ్డు ప్రమాదాల విషయంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంల్లో జరిగే రోడ్డు ప్రమాదాలో 11 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
2019లో 1,51,113 ప్రమాదాలు సంభవించినట్లు రికార్డులు చెబుతున్నాయి.
ఆర్ట్ డైరెక్టర్ నుంచి చిత్ర దర్శకుడిగా మారి..
"భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటన్నిటి వెనుక, ఒకదాన్ని మించి మరొకటిగా వింత వింత కథలుంటాయి" అని పరీక్ అన్నారు.
ముంబైలో వాణిజ్య ప్రకటనలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన పరీక్, ఆరేళ్ల క్రితమే ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి సినిమా దర్శకుడిగా మారారు.
తరువాత ఆయన ముంబై నుంచి జైపూర్‌కు మకాం మార్చారు.
ఓరోజు బ్రిటిష్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ రిచర్డ్ డాకిన్స్ రాసిన 'గాడ్ డెల్యూషన్' అనే పుస్తకం చదువుతుండగా పరీక్‌కు జోధ్‌పూర్‌లో ఉన్న బుల్లెట్ బాబా గుడి గుర్తొచ్చింది.
"అప్పుడే డుగ్ డుగ్ కథ తట్టింది." అని పరీక్ చెప్పారు.
వెంటనే ఆయన బుల్లెట్ బాబా గుడిని, రాజస్థాన్‌లో ఉన్న ఇతర ఆలయాలను సందర్శించారు. అయిదు నెలల పాటు ఈ ఆలయాలపై పరిశోధన చేశారు.
"నా చిన్నప్పుడు ఓసారి పాలి గుడికి వెళ్లాను. మా ఇంట్లో అందరికీ దేవుడంటే భక్తి విశ్వాసాలు అధికం. మా అమ్మమ్మ ఏ గుడికి వెళ్లినా నన్నూ వెంటతీసుకెళ్లేవారు" అని పరీక్ తెలిపారు.
ఈ సినిమా కథ కోసం రాథోడ్ కుటుంబంతో మాట్లాడమని పరీక్ తన తండ్రిని జోధ్‌పూర్ పంపించారు.
రాథోడ్ కుటుంబం రెండు షరతులు పెట్టింది.. రాథోడ్ అసలు పేరును సినిమాలో ప్రస్తావించకూడదని, ఆయన కులం బయటపెట్టకూడదని.
సినిమా కథ రాసుకున్న తరువాత, నటుల కోసం రాంగఢ్‌కు చుట్టుపక్కల గ్రామాల్లోని వంద మందికి పైగా స్థానికులకు ఆడిషన్ చేశారు. జైపూర్‌కు 40 కిమీలో ఉన్న రాంగఢ్‌లోనే ఈ సినిమా తీశారు.
సినిమాలో రాథోడ్ పాత్ర పేరు ఠాకూర్ లాల్. మొదట ఈ పాత్రకు ఒక స్థానిక వ్యక్తిని ఎంపిక చేశారు.
అయితే, తనకు రాథోడ్ అంటే గౌరవం అని, ఆయనపై భక్తి విశ్వాసాలు ఉన్నాయంటూ ఆ వ్యక్తి సినిమా నుంచి తప్పుకొన్నారు.
సినిమాలో బుల్లెట్‌కు బదులు పాత లూనా బండిని పెట్టారు.
"భారతదేశంలో ప్రతి వ్యక్తికీ దేవాలయాలకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి. ఆ ఆలయాల వెనుక ఉన్న వింత కథలో, అక్కడ జరిగే మాయలూ, మంత్రాలకు సంబంధించిన కథలో ఉంటాయి. జోధ్‌పూర్ గుడి కథకు ఇది మా వెర్షన్" అని పరీక్ సోదరి, ఈ సినిమా ప్రొడ్యూసర్ ప్రేరణా రిత్విక్ చెప్పారు.
"ఇది ఎవరినీ ఎగతాళి చేసే కథ కాదు. నమ్మకానికి ఉన్న శక్తిని చూపించే కథ" అని ఈ చిత్రానికి సంగీతం అందించిన రోహన్ రాజాధ్యక్ష అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో మరోసారి ఈ చిత్రాన్ని ప్రదర్శించే అవకాశం కోసం ఈ చిత్ర నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.
"ప్రతీ సంస్కృతిలోనూ ఇతరులకు అసాధారణంగా కనిపించే అంశాలు ఉంటాయి" అని అని టొరంటో ఫెస్టివల్ ప్రోగ్రామర్ పీటర్ కుప్లోవ్‌స్కీ అన్నారు.
టొరొంటో ఫెస్టివల్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైన, విభిన్నమైన చిత్రాలను డిస్కవరీ విభాగంలో ఎంపిక చేస్తారు.
ఈ సంవత్సరం 'డుగ్ డుగ్' చిత్రాన్ని ఈ విభాగానికి ఎంపిక చేశారు పీటర్.
ఇవి కూడా చదవండి:
- తలైవి సినిమా రివ్యూ: ఒక అసంపూర్ణ బయోపిక్
- శ్రీదేవి తోడుగా జియా ఉల్ హక్ నియంతృత్వాన్ని దాటేశాం - అభిప్రాయం
- దిలీప్ కుమార్: 'మనం నటుల్ని ఆరాధిస్తాం, నటులు దిలీప్‌ను ఆరాధిస్తారు'
- చేతన్ కుమార్: బ్రాహ్మణిజంపై వివాదంలో కన్నడ హీరో ఎలా చిక్కుకున్నారు? ఈ వివాదం ఎలా మొదలైంది?
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. ‘గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- లగాన్ సినిమా కథ చెప్పినప్పుడు చెత్తగా ఉందని ఆమిర్‌ఖాన్ ఎందుకన్నారు
- ‘ఈ సినిమాతో ఎన్టీఆర్‌ను దేవుడిగా ఆరాధించడం మొదలైంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)