హైదరాబాద్‌లో పేలుడు... ఇద్దరు మృతి - ప్రెస్‌రివ్యూ

హైదరాబాద్‌లో గురువారం రాత్రి జరిగిన పేలుడులో ఇద్దరు మృతి చెందారని 'ఈనాడు' కథనం తెలిపింది.

''ఛత్రినాక పరిధి కందికల్ గేట్ వద్ద గురువారం రాత్రి పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుణ్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లారు. క్లూస్ టీం అక్కడికి చేరుకుని పరిశీలించింది.

మృతులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు(25), జగన్నాథ్(30)గా గుర్తించారు.

చనిపోయినవారు పీవోపీ విగ్రహాల తయారీ కార్మికులు.

విగ్రహ తయారీ పరిశ్రమలో బాణసంచా కారణంగానే పేలుడు సంభవించినట్లు పోలీసులు చెప్పారు.

బాణసంచాకు రసాయనాలు కలపడంతో పేలుడు తీవ్రత ఎక్కువైందని పోలీసులు తెలిపారు'' అని ఆ కథనంలో రాశారు.

ఏపీలో ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ హెల్త్‌ పోర్టల్‌

దేశవ్యాప్తంగా చేపట్టిన నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ పనులు ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా జరుగుతున్నాయని 'సాక్షి' కథనం తెలిపింది.

''తొలిదశలో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి అనంతపురం జిల్లా సర్వజనాస్పత్రితో పాటు తిరుపతి, విజయవాడ, కాకినాడ ఆస్పత్రులు ముందుకొచ్చాయి.

డిసెంబర్‌ మొదటి వారంలో ఆయా చోట్ల ఏబీడీఎం (ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌) పోర్టల్‌ ఏర్పాటు చేయనున్నారు.

మొదట ఆయా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది (ల్యాబ్‌టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌ తదితరులు) వివరాలతోపాటు అదనంగా వైద్య సదుపాయాల సమాచారాన్ని సేకరిస్తున్నారు.

వీరికి 14 అంకెలతో కూడిన నంబర్‌ కేటాయిస్తారు. ఈ వివరాలను పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోకి వెళ్లినా ఆ నంబర్‌తో కూడిన వ్యక్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ నాలుగు ఆస్పత్రుల్లో నమోదు పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరిస్తారు. నాలుగు వారాల్లో బోధనాస్పత్రుల్లోనూ, ఆ తర్వాత నాలుగు వారాల్లో జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనూ, తర్వాత నాలుగు వారాల్లో సీహెచ్‌సీల్లోనూ, చివరగా పది వారాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ హెల్త్‌కేర్‌ ఫెసిలిటీస్, వైద్య సిబ్బంది వివరాలన్నీ సేకరించి ఏబీడీఎం పోర్టల్‌కు అనుసంధానం చేస్తారు.

త్వరలోనే ప్రైవేటు ఆస్పత్రుల వివరాలనూ సేకరిస్తార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

సైనికుల మధ్య ప్రధాని మోదీ దీపావళి సంబరాలు

జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో గురువారం ప్రధాని దీపావళి వేడుకలను జవాన్లతో జరుపుకొన్నారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ప్రధాని నివాళులర్పించారు. అనంతరం సైనికులనుద్దేశించి మాట్లాడారు.

సైనికుల కోసం 130కోట్ల మంది ప్రజల ఆశీస్సులు తీసుకువచ్చానని, తాను ప్రధానిగా రాలేదని, మీ కుటుంబ సభ్యుడిగా వచ్చానని అన్నారు.

సైన్యం ధైర్యసాహసాలు దీపావళికి మరింత శోభను తీసుకువచ్చాయని కొనియాడారు. ప్రతి దీపావళి సైనికులతోనే జరుపుకుంటున్నానని.. జవాన్ల మధ్య పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.

సైన్యం కేవలం కేవలం సరిహద్దుల్లోనే కాపలా కాయడం లేదని, రాష్ట్రాలకు కూడా సైన్యం రక్షణగా నిలుస్తుందన్నారు. అనంతరం సైనికులతో కలిపి ఫొటోలు దిగారు. ఆ తర్వాత జవాన్లకు ప్రధాని స్వీట్లు తినిపించార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)