ఎయిర్ ఇండియా విమానం ఓవర్‌ బ్రిడ్జి కింద ఎలా ఇరుక్కుపోయింది?

విమానం ఆకాశంలో ఎగురుతూ, రన్‌వేపై పరుగెత్తడాన్ని మీరు తప్పక చూసే ఉంటారు. కానీ, ఓ విమానం వంతెన కింద ఇరుక్కుపోవడాన్ని చూడటం మాత్రం చాలా అరుదు.

ఎయిర్ ఇండియా విమానం దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఒక ఓవర్‌బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ విమానాన్ని తుక్కు కింద అమ్మేసినట్టు సమాచారం. విమానాన్ని తరలిస్తున్న సమయంలో ఓవర్‌బ్రిడ్జ్ కింద ఇరుక్కుపోయింది.

వైరల్‌గా మారిన వీడియోలో, విమానం దగ్గరే ట్రాఫిక్ కొనసాగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. విమానానికి రెక్కలు లేవు. దాని పక్క నుంచే ట్రాఫిక్ కదులుతోంది.

ఈ వీడియోను ట్వీట్ చేసిన ఓ జర్నలిస్ట్.. ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్‌కు ఈ విమానంతో ఎలాంటి సంబంధం లేదు అని సదరు సంస్థ ప్రకటనను కూడా పోస్ట్‌ చేశారు.

"ఇది తుక్కు కింద అమ్మేసిన ఎయిర్ ఇండియా విమానం. నిన్న రాత్రి కొనుగోలుదారులు తీసుకు వెళ్లారు. ఎయిర్ ఇండియాకు ప్రస్తుతం ఈ విమానంతో ఎలాంటి సంబంధం లేదు" అని ప్రకటనలో పేర్కొన్నారు.

"విమానం ఖచ్చితంగా ఢిల్లీ విమానాశ్రయానికి చెందింది కాదు" అని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు అన్నారు.

వైరల్‌గా మారిన ఈ వీడియోను ట్విటర్‌, యూట్యూబ్‌లో చాలామంది వీక్షించారు. ఈ విమానం ఎలా ఇరుక్కుపోయిందో తెలుసుకోవాలని కామెంట్లలో ఆసక్తి చూపించారు.

ఈ వీడియో వైరల్ కావడంతో, గత కొన్ని రోజుల కిందటే ఈ విమానం ఇరుక్కుపోయిందని కొందరు కామెంట్లు చేయడం ప్రారంభించారు.

ఈ విమానం 2021 అక్టోబర్‌ 2న రాత్రి సమయంలో వంతెన కింద ఇరుక్కుపోయిందని టెర్మినల్‌3 నుంచి తిరిగి వస్తుండగా, వంతెన కింద ఇరుక్కున్న విమానాన్ని బయటకు తీయడానికి కార్మికులు ప్రయత్నిస్తుండటం చూశాను అని సుప్రభ అనే యూజర్ కామెంట్‌ చేశారు.

విమానాన్ని తరలించడానికి ముందే, అది ప్రయాణంచే దారిని చూసుకోవాలంటూ కొందరు సూచించారు.

సాధారణంగా రోడ్డు మార్గంలో విమానాన్ని తరలించడానికి ముందు రెండు నుండి మూడు సార్లు రెక్కీ నిర్వహించాలని.. స్థూలంగా ఇది అన్‌ ప్రొఫెషనల్‌ వర్క్‌ అని సంజీవ్‌ శ్రీవాస్తవ్‌ అనే యూజర్ కామెంట్‌ చేశారు

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన మరో సంఘటనతో, చాలామంది ఈ సంఘటనను పోల్చి చూస్తున్నారు. 2019లో సేవల నుంచి తప్పించిన ఇండియా పోస్ట్‌ విమానం కూడా వంతెన కింద ఇరుక్కుపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)