You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సాయి ధరమ్ తేజ్: నిలకడగా ఆరోగ్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు
హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్ ఒక ప్రకటనలో తెలిపింది.
శనివారం ఉదయం విడుదల చేసిన ఈ ప్రకటనలో, సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కీలక పరీక్షలు కొనసాగుతున్నాయని, తదుపరి హెల్త్ బులెటిన్ రేపు విడుదల చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
రాయదుర్గం పోలీసులు సాయిధరమ్ తేజ్‌పై నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు. రాత్రి 8గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు తెలిపారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద ఆయనపై అభియోగాలు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌ను ( ట్రంప్ ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం గురించి పోలీసులకు 108 సిబ్బంది తెలియజేశారు.
అర్థరాత్రి 12.15 గంటలకు అపోలో డాక్టర్ల హెల్ బులెటిన్..
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో డాక్టర్లు ప్రకటించారు.
కాలర్ బోన్ విరిగిందని, అయినా కంగారు పడాల్సిన పనిలేదని చెప్పారు.
అయితే, ముందు జాగ్రత్త చర్యగా ఐసీయూకు తరలించి, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
సాయి ధరమ్ తేజ్‌ను పరీక్షించామని, ఆయన తలకు, వెన్నెముకకు తీవ్రమైన గాయాలు ఏమీ కాలేదని చెప్పారు. అవసరాన్ని బట్టి రాబోయే 24 గంటల్లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఇప్పటికైతే ఎలాంటి శస్త్రచికిత్సలూ చేయాల్సిన పనిలేదన్నారు.
రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనల్లో చికిత్స అందించేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని, కాబట్టి మరో 48 గంటల పాటు ఆయన్ను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందన్నారు.
వెంటిలేటర్‌పై ఉండటం చెడ్డ విషయమేమీ కాదని, ముందు జాగ్రత్త కోసమే ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచాల్సి వచ్చిందన్నారు.
సాయి ధరమ్ తేజ్ తలకు గానీ, వెన్నెముకకు గానీ ఎలాంటి గాయాలూ కాలేదని, అంతర్గతంగా రక్తస్రావం కూడా జరగలేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు.
అపోలో ఆసుపత్రి వద్ద రాత్రి 11.30 గంటల సమయంలో విలేకరులతో మాట్లాడారు.
శనివారం ఉదయానికి సాయి ధరమ్ తేజ్ మాట్లాడొచ్చని డాక్టర్లు తెలిపారని అరవింద్ వెల్లడించారు.
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అపోహలకూ తావివ్వకూడదని, మెగా కుటుంబం తరపున తాను మాట్లాడుతున్నానని చెప్పారు.
ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ జరిగిందంటే..
సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో తన స్పోర్ట్స్ బైక్ మీద హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై నుంచి ఐకియా వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
ఆయన్ను తొలుత మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రమాదం జరిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్ స్పృహ తప్పారు.
పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. జనసేన అధినేత, సినీ హీరో, సాయి ధరమ్ తేజ్‌కు మేనమామ అయిన పవన్ కల్యాణ్ సైతం ఆసుపత్రికి వచ్చారు.
సాయి ధరమ్ తేజ్ 14 చిత్రాల్లో నటించారు. తాజా చిత్రం రిపబ్లిక్ అక్టోబర్ 11న విడుదల కానుంది.
సినిమా హీరోగానే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు.
సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ ఇదే..
ఇవి కూడా చదవండి:
- 11 సెప్టెంబర్ 2001: 20 ఏళ్ల క్రితం అమెరికాలో ట్విన్ టవర్స్ కూలడానికి 2 శాస్త్రీయ కారణాలు
- అఫ్గానిస్తాన్: పంజ్‌షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయా?
- ఆంధ్రప్రదేశ్: 'సినిమా వ్యాపారం మాది, ప్రభుత్వం టికెట్లు అమ్ముకుంటే ఎలా?' - కొత్త జీవోపై కలకలం
- ఆత్మహత్య ఆలోచనలను టెక్నాలజీతో పసిగట్టవచ్చా... ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవచ్చా? :డిజిహబ్
- యలవర్తి నాయుడమ్మ: వరి పొట్టు నుంచి సిమెంటు తయారు చేయవచ్చన్న ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త
- ఫోర్డ్: భారత్‌కు గుడ్‌బై చెబుతున్న అమెరికన్ కార్ల కంపెనీ
- క్లిటోరిస్ అంటే ఏంటి? సెక్స్‌లో మహిళల లైంగిక ఆనందానికీ, దీనికీ లింకేంటి?
- INDvsENG ఐదో టెస్టు రద్దు: ‘బీసీసీఐ నిర్ణయం వెనుక ఐపీఎల్ అజెండా ఏమీ లేదు’ - ఈసీబీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)