You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పార్లమెంటు పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ వెంకయ్య నాయుడు ఆవేదన
ప్రతిపక్ష ఎంపీల గందరగోళం నడుమ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. గద్గద స్వరంతో ఆయన మాట్లాడారు.
‘‘కొంతమంది సభ్యులు బల్లపై కూర్చుకుంటున్నారు. మరికొందరు ఏకంగా బల్లపై ఎక్కి నిలబడుతున్నారు. పార్లమెంటు పవిత్రతను వీరు దెబ్బతీస్తున్నారు’’ అని సభలో ఆయన వ్యాఖ్యానించారు.
పెగాసస్ నిఘాపై చర్చ జరపాలంటూ కొందరు ఎంపీలు అనుచితంగా ప్రవర్తించడంపై జులై 30న కూడా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తంచేశారు. కొందరు ఎంపీలు సభ పరువు ప్రతిష్ఠలు, పవిత్రతను దెబ్బ తీస్తున్నారని అన్నారు.
‘‘కొంత మంది ఎంపీలు విజిల్స్ వేస్తున్నారు. బహుశా వారికిది అలవాటు కావొచ్చు. కానీ ఇది సభ. అది గుర్తుపెట్టుకోవాలి’’
‘‘కొందరైతే మార్షల్స్‌పై చేతులు వేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది పార్లమెంటు అనే విషయాన్ని వార్తు గుర్తుపెట్టుకోవాలి’’
‘‘సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సభలో ఇలా అనుచితంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోం’’ అని ఆయన హెచ్చరించారు.
‘‘ఇలాంటి ప్రవర్తనను ఎదుర్కొనేందుకు రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి చూసీచూడనట్లు వదిలేయడం. అప్పుడు సభ మార్కెట్‌లా మారిపోతుంది. అందరూ విజిల్స్ కూడా వేస్తారు. రెండోది చర్యలు తీసుకోవడం. అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడానికి వెనుకాడం’’ అని వెంకయ్య నాయుడు చెప్పారు.
‘‘ఇలాంటి చర్యలన్నీ సభ పవిత్రతను మసకబారుస్తాయి. ఈ విషయంలో నేను చాలా ఆందోళన చెందుతున్నాను. అందరూ దయచేసి ప్రశాంతంగా ఉండండి’’ అని వెంకయ్యనాయుడు అభ్యర్థించారు.
‘‘సభలో సభ్యులు ఇలా ప్రవర్తిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. ఇలా చెబుతున్నందుకు నాకే బాధగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
బుధవారం లోక్‌సభలోనూ ఇలాంటి పరిణామాలే సంభవించాయి. సభ మొదలవుతూనే విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు.
పార్లమెంట్‌లో కొన్ని అంశాలపై చర్చలు జరగాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
ముఖ్యంగా ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్‌తో నిఘా, వ్యవసాయ చట్టాలు, పెరుగుతున్న చమురు ధరలపై చర్చ జరగాలని విపక్ష సభ్యులు పట్టుబడుతున్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 19న మొదలయ్యాయి. మొదటిరోజే గందరగోళ పరిస్థితులు కనిపించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త మంత్రులను పరిచయం చేస్తుండగా విపక్ష ఎంపీలు అడ్డుపడ్డారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)