You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఠాణాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న సీజేఐ ఎన్‌వీ రమణ: ప్రెస్ రివ్యూ
పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేసినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.
పోలీసుల అదుపులో ఉన్నవారిపై వేధింపులు, చిత్రహింసలు దేశవ్యాప్తంగా ఇంకా కొనసాగుతున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో పేరు ప్రతిష్ఠలు ఉన్నవారిపై కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆవేదన చెందారు. రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం విచారకరమన్నారు.
అవసరమైన సమయంలో న్యాయసాయం అందకపోవడం వల్ల పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు ఎంతో నష్టపోతున్నారని చెప్పారు. మానవ హక్కులపై, ఇందుకు సంబంధించిన చట్టాలపై పోలీసులకు అవగాహన కోసం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ (నల్సా) దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
పేదలకు న్యాయసాయం అందించడం కోసం రూపొందించిన నల్సా మొబైల్ యాప్‌ను ఆదివారం జస్టిస్ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలను పంచుకొన్నారు.
సమాజంలో చట్టబద్ధ పాలన సాగాలంటే.. న్యాయసాయం పొందడంలో పేదలకు, ధనికులకు మధ్య ఉన్న అంతరం తొలగిపోవాలన్నారు.
న్యాయ వ్యవస్థ, చట్టాలు తమకోసమే ఉన్నాయన్న భావన ప్రజల్లో కలగాలన్నారు. చాలా కాలంగా పేదప్రజలు న్యాయవ్యవస్థకు ఎంతో దూరంగా ఉండిపోయారని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) ద్వారా అందజేస్తున్న ఉచిత బియ్యం పంపిణీకి మోదీ చిత్రపటంతో తప్పనిసరిగా ఉండి తీరాల్సిందేనని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసినట్లు ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తోందనే విషయం ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆదివారం విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం రేషన్ డిపోను ఆమె పరిశీలించారు.
'జాతీయ ఆహార భద్రత మిషన్‌లో భాగంగా ప్రజా పంపిణీ దుకాణంలోనే లబ్ధిదారులకు రేషన్ అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లకు తీసుకెళ్లి ఇస్తే మాకు అనవసరం. కేంద్రం వాటా రేషన్ దుకాణాల వద్దే ఇవ్వండి. ఇచ్చేటప్పుడు అన్ని దుకాణాల్లోనూ పీఎంజీకేఏవై బోర్డులు ప్రదర్శించండి' అని అధికారులను ఆదేశించారు.
'తాను వస్తున్నానని పీఎంజీకేఏవై బోర్డు పెట్టారా.. ఇంతకుముందు కూడా ఉందా' అని డీలర్‌ను ప్రశ్నించారు.
అనంతరం ఉచిత బియ్యం ఎవరు అందిస్తున్నారో తెలుసా అని లబ్ధిదారులను ఆరా తీశారు. వారి నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ను పిలిచి ఉచిత బియ్యం గురించి లబ్ధిదారులకు మా ముందే తెలియజేయాలన్నారు.
దీంతో ఎమ్మెల్యే.. పీఎంజీకేఏవై ద్వారా బియ్యం ఇస్తున్నారని చెబుతూనే 'మా అన్న పథకాలైతే చెప్పగలంగానీ ఇవేం చెప్పగలం' అని నవ్వడంతో.. ప్రధాని మోదీ దేశంలో అందరికీ అన్నలాంటివారేనని గుర్తుంచుకోండి అంటూ మంత్రి సీతారామన్ పేర్కొన్నారని ఈనాడు వివరించింది.
రెండు వేరు వేరు డోసుల ఫలితాలు బాగున్నాయి
రెండు వేరు వేరు టీకాల డోసులు వేసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని ఐసీఎంఆర్ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో 18 మంది అనుకోకుండా ఒక డోసు కొవిషీల్డ్, మరో డోసు కొవాగ్జిన్ టీకా తీసుకున్న ఘటన గుర్తుందా ?
అలాంటి వారిపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఈ ఏడాది మే నుంచి జూన్ వరకు నిర్వహించిన అధ్యయనంలో ఆశాజనక ఫలితాలు వచ్చాయి.
ఒక డోసు కొవిషీల్డ్, మరో డోసు కొవాగ్జిన్ తీసుకున్న వారందరిలో రోగ నిరోధక స్పందన, ప్రభావశీలత మెరుగ్గా ఉన్నట్లు వెల్లడైంది.
ఈ సమాచారాన్ని కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న 40 మంది, కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న 40 మంది వలంటీర్ల ఆరోగ్య నివేదికలతో పోల్చిచూడగా ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి.
ఫుల్ డోసులు తీసుకున్న ఈ 80 మంది వలంటీర్లతో పోలిస్తే.. కొవిషీల్డ్, కొవాగ్జిన్ చెరో డోసును తీసుకున్న 18 మందిలోనే ఆల్ఫా, బీటా, డెల్టా కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా బలమైన రోగ నిరోధక ప్రతిస్పందన వెలువడిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వైర్‌సను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీలు, న్యూట్రలైజింగ్ యాంటీబాడీల మోతాదు కూడా వేర్వేరు టీకా డోసుల లబ్ధిదారుల్లోనే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
వ్యాక్సిన్ తీసుకున్నాక మొదటి వారంలో ఈ మూడు గ్రూపుల వలంటీర్లలోనూ ఒకే విధానమైన తేలికపాటి దుష్ప్రభావాలు తలెత్తాయన్నారు.
పెద్దఎత్తున ర్యాండమైజ్డ్ క్లినికల్ ట్రయల్స్ చేస్తే వేర్వేరు టీకా డోసుల వాడకం ప్రభావాలు, ఫలితాలపై మరింత స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు సూచించారని ఆంధ్రజ్యోతి వివరించింది.
ఇక వాట్సాప్‌లో కరోనా వ్యాక్సీన్ సర్టిఫికెట్
కరోనా టీకా డోసులు పూర్తిగా వేసుకున్న తర్వాత వాట్సాప్ ద్వారా కూడా టీకా సర్టిఫికెట్ పొందవచ్చని సాక్షి దినపత్రి కథనం ప్రచురించింది.
కరోనా టీకా తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందడం ఇప్పుడు మరింత సులభతరంగా మారింది. వాట్సాప్ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే ఈ ధ్రువపత్రం పొందవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా మారింది.
కరోనా టీకా తీసుకున్నట్లు ధ్రువపత్రం సమర్పించిన వారికే ప్రయాణ అనుమతి లభిస్తోంది. ప్రస్తుతం కోవిన్ పోర్టల్ ద్వారా ఈ సర్టిఫికెట్ పొందే సదుపాయం ఉంది.
అయితే, కొన్ని సందర్భాల్లో ఈ పోర్టల్ మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.
అందుకే సులభమైన ప్రత్యామ్నాయంగా వాట్సాప్ నుంచి సర్టిఫికెట్ పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది.
టీకా ఒక్క డోసు తీసుకున్నా, రెండో డోసు తీసుకున్నా ఆ మేరకు సర్టిఫికెట్ పొందవచ్చు. వాట్సాప్ నుంచి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకొనే సౌలభ్యాన్ని కల్పించడం పట్ల పార్టీలకు అతీతంగా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉందని, వేగంగా పని చేస్తోందని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం శశి థరూర్ ఎంపీ ట్వీట్ చేశారని సాక్షి రాసింది.
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు.. కాంస్యం కైవసం చేసుకున్న బ్రిటన్
- టోక్యో ఒలింపిక్స్: భారత్ గెలిచిన, తృటిలో చేజారిన పతకాలు ఇవే
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి: 'కుల వ్యవస్థ ప్రసంగాలతో పోయేది కాదు' - BBC Exclusive
- టోక్యో ఒలింపిక్స్: అమెరికాలో ఒలింపిక్ పతకాల పట్టికలో చైనా టాప్‌లో ఎందుకు కనిపించడం లేదు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)