You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కృష్ణా జిల్లాలో టీడీపీ-వైసీపీ వర్గాల ఘర్షణ, దేవినేని ఉమ అరెస్ట్
కృష్ణా జిల్లా కొండపల్లిలో సాగుతున్న మైనింగ్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇది ఇప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టుకు దారితీసింది.
మైలవరం నియోజకవర్గ పరిధిలోని కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ జరుగుతోందంటూ టీడీపీ విమర్శలు చేస్తోంది.
దానిని పరిశీలించేందుకు దేవినేని ఉమ సహా టీడీపీ బృందం వెళ్ళింది. ఆ సమయంలో జి కొండూరు వద్ద వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది.
టీడీపీ నాయకుడి కారు ఒకటి ధ్వంసం అయ్యింది. దేవినేని ఉమా కారు అద్దాలు పగిలాయి.
నిందితులను అరెస్ట్ చేయాలంటూ దేవినేని ఉమా జి కొండూరు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు.
ఆయనకు మద్దతుగా పలువురు టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
అదే సమయంలో దేవినేని ఉమపై దాడి జరిగిందంటూ మాజీ సీఎం చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాశారు.
పోలీసులు స్పందించడం లేదంటూ ఉమా నిరసన కొనసాగించారు. ఈ క్రమంలో అర్థరాత్రి ఆయన్ని అరెస్ట్ చేసి నందివాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
దేవినేని ఉమకు ఫోన్ చేసిన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన్ను పరామర్శించారు.
ఉమామహేశ్వరరావుపై దాడి అమానుషమని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండా రాజకీయాలు తీవ్రంగా ఖండిస్తున్నానన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
"అక్రమంగా గ్రావెల్ తవ్వుకుని లక్షలాది రూపాయల ప్రజల సొమ్ము దోచుకుంటున్నారు. దోపిడీలను పరిశీలిస్తే దాడులు చేస్తారా? పథకం ప్రకారమే ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. కార్యకర్తలతో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ దాడికి ప్రేరేపించారు. దాడి చేస్తున్న వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవాల్సి వస్తుందనే దాడి జరుగుతున్నా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదు. పోలీసులు తీరు ఆక్షేపణీయం. రాష్ట్రంలో ఒక మాజీ మంత్రికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? టీడీపీ కార్యకర్తలు రాకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు హత్య చేసి ఉండేవాళ్లు" అని విమర్శించారు.
మాపై దుష్ప్రచారం- వైసీపీ
మరోవైపు, ప్రశాంతమైన మైలవరం నియోజకవర్గంలో ఘర్షణలు, అల్లర్లు ప్రేరేపించేందుకు మాజీ మంత్రి దేవినేని ఉమ గత కొంతకాలంగా తనపై, తమ ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ ఆరోపించారు.
రక్షిత అటవీ ప్రాంతమైన కొండపల్లి కొండల్లోకి ఇప్పటివరకూ 15 సార్లు వెళ్ళిన దేవినేని ఒక అబద్ధాన్ని నిజం చేయాలని, దానిని తనపై రుద్దాలని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
"కొండపల్లి ప్రాంతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దేవినేని ఉమ అనుమతులు ఇప్పించారు. అప్పుడు అవి రెవెన్యూ భూములని చెప్పి ప్రారంభోత్సవు చేసి, ఇప్పుడు వాటిని ఫారెస్టు భూములంటున్నారు" అన్నారు.
ఘర్షణలను రెచ్చగొట్టారు- డీజీపీ
దేవినేని ఉమామహేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా గొడవలను రెచ్చగొట్టారని, జి.కొండూరు ఘర్షణకి ఆయనే ప్రధాన కారణం అని డీఐజీ మోహన్ రావు మీడియాతో అన్నారు.
ఆయన ముందస్తు పథకంతో, కొండపల్లి వెళ్లి అక్కడ అనుచరులను కలుపుకున్నారని వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని అన్నారు.
"అక్కడ వైసీపీ వాళ్లను రెచ్చగొట్టడం, హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఆయన రెచ్చగొట్టడం వల్లే అవి జరిగాయి. కుట్రపూరితంగా, ప్రణాళికలో భాగంగానే దేవినేని ఉమ అక్కడకి వెళ్లారు. దీనికి ప్రధాన కారణం దేవినేని ఉమా మహేశ్వరరావే" అని డీఐజీ చెప్పారు.
టీడీపీ నాయకులు మీడియాలో హడావిడి చేయడం కూడా ప్లాన్‌లో భాగమేనని, దీనికి సంబంధించి దేవినేని ఉమపై కేసు నమోదు చేశామని డీఐజీ మోహనరావు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)