You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహారాష్ట్ర వరదలు: కొల్హాపూర్ సహా అనేక జిల్లాలు జలమయం, 136 మంది మృతి
మహారాష్ట్రలో వరద ధాటికి మృత్యువాత పడిన వారి సంఖ్య 136కు పెరిగింది. ఎక్కువ మంది ఇళ్లు కూలడం, కొండ చరియలు విరిగిపడటం వల్లే మరణించారు.
గత 24 గంటల్లో రాయగఢ్‌లో 47 మంది, సతారా, ముంబయిలలో నలుగురు చొప్పున, సింధుదుర్గ్‌లో ఇద్దరు మరణించారు. కొంకణ్, కొల్హాపూర్ జిల్లాల్లో పరిస్థితి మరీ ప్రమాదకరంగా మారింది.
శుక్రవారం సాయంత్రంనాటికి వరదలు, వర్షాల వల్ల మొత్తంగా 136 మంది మరణించినట్లు రాష్ట్ర సహాయక చర్యలు, పునరావాస శాఖల మంత్రి విజయ్ వడెట్టివార్ చెప్పారు.
గత 24 గంటల్లో ఠానే నుంచి 2,681 మందిని, రత్నగిరి నుంచి 1200 మందిని, సతారా నుంచి 27 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
నాలుగు రోజుల నుంచీ
నాలుగు రోజుల నుంచి వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.
ముఖ్యంగా, కోస్తా జిల్లాలైన రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. స్థానిక వశిష్ట, జాగ్బుడి, కజాలీ నదుల్లోకి వరద నీరు చేరడంతో చాలా గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ రాయగఢ్ జిల్లాలో 35 మంది చనిపోయారని అన్నారు. శిథిలాల్లో మరికొందరు చిక్కుకుపోయి ఉంటారని కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామాల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) బృందాలతో పాటు భారత నౌకాదళం కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది.
రత్నగిరి, కొల్హాపూర్ జిల్లాలలో సహాయక చర్యల కోసం మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిచాలని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.
రత్నగిరి జిల్లాలో వరద సహాయ చర్యలు చేపట్టేందుకు గాను సైన్యం చేరుకుంది.
రాయగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతమయ్యాయి.
తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాలు ఏర్పడ్డాయి. దీంతో ఎన్టీఆర్ఎఫ్ బలగాలు, సైన్యం రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నాయి.
వరదల తీవ్రతకు చాలా ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. మొబైల్ టవర్స్ కూడా కూలిపోవడంతో కమ్యూనికేషన్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు కలుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఆక్సిజన్ కొరతతో ఎవరూ చనిపోలేదన్న కేంద్రం, మరి రుయా ఆస్పత్రిలో మరణాలెలా సంభవించాయి?
- మొన్న చైనాలో మంకీ బీ వైరస్, ఇప్పుడు అమెరికాలో మంకీపాక్స్ కలకలం
- తెలంగాణలో భారీ వర్షాలు: నిర్మల్‌లో రోడ్ల మీదే చేపల వేట
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)