PTSD: అత్యంత బాధాకరమైన జ్ఞాపకాలు వెంటాడుతుంటే ఏం చేయాలి?

    • రచయిత, శైలజా చందు
    • హోదా, బీబీసీ కోసం

రఘురాం ఒక బాంక్ ఉద్యోగి. విహార యాత్రకని కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది. భార్య, పిల్లలు మరణించారు. తీవ్ర గాయాలతో సుమారు 8 గంటల పాటు విపరీతమైన బాధతో ఆయన అరుస్తూ అలానే ఉండిపోవాల్సి వచ్చింది.

తర్వాత ఆయనకు సహాయం అందింది.

ఆ ఘటన తర్వాత ఆయన యాంగ్జయిటీ, డిప్రెషన్‌తో బాధ పడేవారు. ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేక, ఆల్కహాల్ తీసుకుంటూ మత్తులో గడిపేవారు.

సమయం పడుతుంది...

జీవితంలో తీవ్రమైన బాధ కలిగించిన సంఘటనల తర్వాత, మామూలు స్థితికి రావడానికి, మనుషులకు సమయం పడుతుంది. ఆ బాధాకరమైన జ్ఞాపకాల నుంచి బయటకు రాలేక, చాలామంది మానసికంగా కృంగిపోయి, ఒత్తిడికి లోనవుతారు.

ఆ ఒత్తిడికి సంబంధించిన లక్షణాలన్నింటిని కలిపి, Post Traumatic Stress Disorder (PTSD) అంటారు.

ఉదాహరణకు, బాంబు పేలుడులో గాయపడిన బాధితులు, రేప్‌కు గురైన వారు, యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి, చావును తప్పించుకున్నవారు, గృహ హింస బాధితులు, ఆ సంఘటనల తర్వాత తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతారు.

ఆ ఘటనలకు సంబంధించిన జ్ఞాపకాలు చాలా కాలం వరకూ వారిని వెంటాడుతుంటాయి.

ఈ ఒత్తిడి లక్షణాలు ఈ క్రింది విధంగా వుంటాయి

  • నిస్పృహకు లోనవుతారు
  • ఆందోళన చెందుతారు
  • ఆల్కహాల్ లేదా డ్రగ్స్ అలవాటు చేసుకునే అవకాశం వుంది
  • ఆత్మహత్య గురించి ఆలోచనలు వస్తుంటాయి
  • సన్నిహితులతో సంబంధాలు దెబ్బ తినవచ్చు

అప్పుడు మరింత ఉద్వేగం

వారు బాధకు గురైన గాయాల గురించి చర్చించే సమయంలో, పరీక్ష చేసే సమయంలో తీవ్ర ఉద్వేగానికి లోనవుతారు. ఉదా: వణుకు, చెమట, ఆందోళన రావొచ్చు.

ఆత్మ విశ్వాసం కోల్పోయినట్లు ప్రవర్తిస్తారు. ప్రవర్తనలో తేడాలు కనిపిస్తాయి. ఏకాగ్రత వుండదు. పనిలో సామర్థ్యాన్ని కోల్పోతారు.

PTSD ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు కొన్ని స్క్రీనింగ్ పద్ధతులు, ప్రమాణాలను ఉపయోగిస్తారు. వీటి ద్వారా స్వీయ లేదా ఇతరులకు హాని కలిగించే ప్రమాదముందేమోనన్న విషయాన్ని అంచనా వేస్తారు.

అంతకు మునుపేమైనా మానసిక వ్యాధులతో బాధ పడుతున్నారా, చికిత్సలేవైనా తీసుకున్నారా అన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

జీవితంలో ఒక బాధాకరమైన ఘటన..

రేవతి జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. అప్పటినుండి ఆమె జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి.

ఆమె ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నర్స్‌గా పని చేసేది.

ఒకరోజు నైట్ డ్యూటీకి వెళ్లే సమయంలో భర్తతో వాదన మొదలైంది.

వారిద్దరిదీ ప్రేమ వివాహం. రెండు కుటుంబాలకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. అతనికింకా ఉద్యోగం లేదు. ఆమె కొచ్చే జీతమే ఆధారం. ఉద్యోగం రాకపోవడంతో తరచూ ఆయన డిప్రెషన్‌కు గురయ్యేవారు. ఆమెపై అనుమానపడేవాడు. అలా తాగుడు కూడా అలవాటయ్యింది. ఆ రోజు ఆల్కహాల్‌కి ఆమె డబ్బివ్వనంది.

గొడవ పడ్డాక హాస్పిటల్ కు వెళ్లింది.

మర్నాడు ఉదయం డ్యూటీ నుండి రాగానే, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆయన కనిపించాడు.

ఆయన కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను తీవ్రంగా గాయపరిచారు. పోలీసు కేసు పెట్టారు. గాయాలు, కేసులు అన్నిటి నుంచి బయటపడేందుకు సమయం పట్టింది. ఉద్యోగం కూడా పోయింది.

ఎప్పటిలానే చిన్న పోట్లాట అనుకుంది. ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడనుకోలేదు.

ఇదంతా జరిగి నెలలు అవుతోంది. అయినా ఆ ఘటనతో ఆమె తీవ్రంగా కలత చెందింది. రోజూ అవే ఆలోచనలు. చనిపోయిన రోజున భర్త రూపం కళ్లముందు కనిపించేది. ఆమెకు నిద్రపట్టేది కాదు. తరచుగా పీడ కలలు, బాధ కలిగించే జ్ఞాపకాలతోనే జీవిస్తోంది.

ఒకటి రెండు సార్లు ఆమె ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు. అన్న కాపలా కాయడం వల్ల అవన్నీ విఫలమయ్యాయి.

కాపాడటం ఎలా?

పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD ) లక్షణాల నుండి కాపాడం ఎలా?

  • సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి
  • జీవితం పై భరోసా ఇవ్వాలి
  • అత్యవసర వైద్య సహాయం అందించాలి
  • మానసిక ప్రథమ చికిత్స అందించాలి. అంటే బాధను మానసిక ప్రథమ చికిత్స (PFA) ద్వారా తగ్గించవచ్చు. PFA లో భాగంగా, బాధితులకు సురక్షితమైన ఆశ్రయం, ఆహారం, ప్రియమైన వారి దగ్గరితనం లభించేలా చూస్తారు.

అలాంటి సూచనలతో ఫలితముండదు..

‘జరిగిదాన్ని మర్చిపోయి, జీవితంలో ముందుకు సాగిపో’ అన్న రొటీన్ సూచనల వల్ల ఫలితముండదు.

కలత చెందుతున్న మనసుకు ఓదార్పు కలిగేలా ఒక అర్థవంతమైన పరిష్కారాన్ని సూచించాలి.

సిగ్గు, అపరాధ భావనలు తగ్గించేలా భరోసా ఇవ్వడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

ట్రామా-ఫోకస్డ్ సైకోథెరపీలు PTSDకి సమర్థవంతమైన చికిత్సగా నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్‌కు వాడే మందులకన్నా, వ్యక్తిగత సమస్యనాధారంగా చికిత్సను ప్లాన్ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

ఘటన యొక్క గాఢతను, పూర్వాపరాలను అర్థం చేసుకుని , అనుగుణంగా సైకోథెరపీ ఇవ్వడమనేది మంచి ఫలితాలనిస్తుంది. ఈ తరహా వైద్యం మందులకన్నా చక్కగా పనిచేస్తుంది.

బిహేవియరల్ థెరపీ కూడా..

PTSD లక్షణాల చికిత్సకు ప్రత్యామ్నాయంగా శిక్షణ పొందిన థెరపిస్ట్ సహాయంతో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (iCBT) ఇవ్వవచ్చు.

ఇతర చికిత్సలను తిరస్కరించే రోగులకు ఈ థెరపీని సూచించవచ్చు. ఐసీబీటీని సిఫారసు చేయడానికి ముందు, దానిని రోగులకందించే విధానం వైద్యులకు కచ్చితంగా తెలిసి వుండాలి.

నిద్రలేమితో బాధ పడే PTSD బాధితులకు ముందుగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీని సూచించాలి. దానివల్ల ఉపశమనం కలగనపుడు మాత్రమే మందుల ద్వారా చికిత్స చేయవలసి వుంటుంది.

PTSD లక్షణాల చికిత్సలో యోగా, ధ్యానం వల్ల ఫలితముంటుందని ఆధారాలు సూచిస్తున్నాయి.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)