గంగానది ఒడ్డున చెక్కపెట్టెలో దొరికిన పసికందు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ దగ్గరున్న గంగా తీరంలో చెక్కపెట్టెలో తేలుతున్న 21 రోజుల పసికందు లభించింది.

ఆ పసికందును గంగా నదిలో పడవను నడిపే గుల్లూ చౌదరి రక్షించారు. ఆ పాప ఏడుపు వినిపించి ఆయన అటువైపు వెళ్లి ఆ పెట్టెను బయటకు తీసినట్లు ఆయన చెప్పారు.

చెక్కపెట్టె తెరిచేసరికి ఆ పాప కనిపించినట్లు చౌదరి స్థానిక విలేకరులకు చెప్పారు.

హిందూ దేవతల చిత్రాలతో అలంకరించిన చెక్క పెట్టెలో ఎర్రని వస్త్రంతో చుట్టి పెట్టిన పసికందు ఉన్నట్లు తెలిపారు.

ఈ పాపను రక్షించినందుకు ఆయన పై ప్రశంసల వర్షం కురిసింది.

ఆ పసిపాపను ఆసుపత్రిలో చేర్చి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆ తర్వాత ఆ పసికందును బాలల శరణాలయానికి పంపిస్తారు.

ఆ పసికందు నదిలోకి ఎలా చేరిందనే విషయాన్ని అధికారులు విచారణ చేస్తున్నారు.

పసికందు లభించిన పెట్టెలో ఆ పాప పుట్టిన రోజు, సమయం లాంటి వివరాలతో కూడిన జాతక చక్రం కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఆ పాపకు గంగ అనే పేరు పెట్టారు.

ఈ పసికందును నదిలో విడిచిపెట్టేందుకు గల కారణాలను పోలీసులు ఇంకా ఊహించలేదు.

ప్రపంచంలో దారుణమైన జెండర్ నిష్పత్తి ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఇక్కడ మహిళల పట్ల సామాజిక వివక్షతో పాటు, ముఖ్యంగా అల్పాదాయ వర్గాల్లో అమ్మాయిలను ఆర్ధికంగా భారంగా చూస్తారు.

చట్ట వ్యతిరేకంగా ఆడశిశువుల పిండాలను గర్భస్రావం ద్వారా తొలగించడం, లేదా పుట్టిన శిశువులను హతం చేయడం కూడా సాధారణంగా చోటు చేసుకుంటూ ఉంటాయి.

ఈ పాప పెంపకపు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చింది. ఆ పాపను రక్షించిన వ్యక్తి ప్రదర్శించిన "అసమాన మానవతావాదానికి" బహుమతిగా ప్రభుత్వ పథకాలతో పాటు, ఒక ఇంటిని కూడా ఇస్తామని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

ఈ పసికందును చూసేందుకు జిల్లా మేజిస్ట్రేట్ ఎమ్‌పి సింగ్ కూడా వెళ్లినట్లు ఘాజీపూర్ అధికారులు తెలిపారు. అధికారులు పడవను నడిపే వ్యక్తిని కూడా కలిసినట్లు తెలిపారు.

నది ఒడ్డున పసికందు ఏడుపు విన్నప్పటికీ ఎవరూ రక్షించడానికి ముందుకు వెళ్లకపోవడంతో తాను చొరవ తీసుకుని వెళ్లి రక్షించినట్లు , చౌదరి స్థానిక విలేఖరులకు చెప్పారు.

ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే గంగా నది ఒడ్డున జనాలు గుమిగూడారు. పడవను నడిపే వ్యక్తి ఆ పసికందు ఉన్న చెక్కపెట్టెను నదిలోంచి బయటకు తీసి, తన ఒడిలోకి తీసుకున్న దృశ్యాలు సంఘటనా స్థలంలో తీసిన వీడియోల్లో కనిపిస్తున్నాయి.

ఆ తర్వాత గుల్లు చౌదరి ఆ పాపను తన ఇంటికి తీసుకుని వెళ్లారు. పోలీసులు అక్కడ నుంచి ఆ పాపను తీసుకుని వెళ్లగా, బాలల సంక్షేమ అధికారులు ఆ పాపను ఆసుపత్రిలో చేర్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)