You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు: ప్రధానమంత్రి కొత్త ఇంటిపై వివాదం ఏమిటి
- రచయిత, టీమ్ బీబీసీ గుజరాతీ
- హోదా, న్యూదిల్లీ
దిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా పనులకు మరో అడ్డంకి తొలగింది. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ‘ఉద్దేశపూర్వకంగా‘ దాఖలు చేసిన పిటిషన్‌గా పేర్కొంటూ దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది.
సమీప భవిష్యత్తులో ఎంపీల సంఖ్యను పెంచే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన రాజ్యసభ, లోక్‌సభ భవనాలతోపాటు దిల్లీలోని పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను కొత్తగా నిర్మించబోయే భవనాలలోకి మార్చనున్నారు.
2024 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. తదుపరి దశలో ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి నివాసాలను కూడా కొత్త ప్రదేశానికి మారుస్తారు.
కరోనా కాలంలో ఈ భవనాల నిర్మాణాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడమే కాకుండా, ఇది 'మోదీ కొత్త ఇంటి కోసం చేస్తున్న ఖర్చు'గా అభివర్ణించాయి. అయితే, ఈ భవనాలలో ప్రధానమంత్రి నివాసం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
గత మూడున్నర దశాబ్దాలుగా, భారత ప్రధానమంత్రి నివాసం దిల్లీలోని 7- లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉంది. ఇందులో ప్రధాన మంత్రి నివాసంతోపాటు ఆఫీసు, సెక్యురిటీ సిబ్బంది భవనాలు ఉంటాయి.
ఎందుకీ కొత్త భవనాలు?
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి దేశానికి ప్రధాన మంత్రి నివాసం ఒక చోట స్థిరంగా లేదు. ప్రప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తీన్‌మూర్తి భవన్‌లో నివసించారు. ఆయన మరణం తరువాత దానిని స్మారక చిహ్నంగా, లైబ్రరీగా మార్చారు.
లాల్ బహదూర్ శాస్త్రి 10, జనపథ్‌ను నివాసంగా చేసుకున్నారు. ఈ భవనం ఒకవైపు అక్బర్ రోడ్‌లో ఉండేది. ఇది ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం. భవనం రెండోవైపు మోతీలాల్ మార్గ్‌లో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఉంది.
10 జనపథ్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివసిస్తున్నారు. 1991లో రాజీవ్ గాంధీ ప్రధాని పదవిలో లేకపోయినా, కుటుంబంతో సహా 10, జనపథ్‌లో నివసించారు.
ఇందిరా గాంధీ కాలంలో...
భారత మొట్ట మొదటి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ సఫ్దర్ జంగ్ రోడ్‌లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నివాసంలోనే ఆమె హత్యకు గురయ్యారు. రాజీవ్ ప్రధాని అయ్యాక సఫ్దర్ జంగ్ నివాసాన్ని ఇందిరా గాంధీ మెమోరియల్‌గా మార్చారు.
ఇందిర హత్య తాలూకు జ్ఞాపకాలకు దూరంగా ఉండేందుకు రాజీవ్ కొత్త ఇల్లు కోసం వెతికారు. ప్రధాన మంత్రి ఇల్లు, భద్రతా సిబ్బంది అవసరాలకు అనుగుణంగా ఉన్న 7, రేస్ కోర్స్ రోడ్‌ను రాజీవ్‌గాంధీ ఎంచుకున్నారు.
7 రేస్‌కోర్స్ రోడ్... 7, లోక్‌కల్యాణ్ మార్గ్‌లో
వీపీ సింగ్, చంద్రశేఖర్, పీవీ నరసింహా రావు, ఐకే గుజ్రాల్, హెచ్.డి.దేవెగౌడ, అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ తదితరులంతా 7, లోక్‌కల్యాణ్ మార్గ్‌లోనే నివాసమున్నారు.
ప్రస్తుతం ప్రధానమంత్రి నివాసం చుట్టూ ఎత్తైన కాంక్రీట్ గోడలు, ముళ్ల కంచెలు ఉన్నాయి. గోడ చుట్టూ ఆన్-డ్యూటీ సెక్యూరిటీ సిబ్బంది కోసం వాచ్ టవర్లు ఉన్నాయి.
ఎస్పీజీతో పాటు, సీఆర్పీఎఫ్, దిల్లీ పోలీసుల భద్రత కూడా ఉంటుంది. ఇక్కడి భద్రతను ఎస్పీజీ నిరంతరం సమీక్షిస్తుంటుంది. ఇది నిరంతర ప్రక్రియ.
కొన్ని దేశాలలో ప్రధాన పాలకుడి ఇల్లు, ఆఫీసు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. కానీ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) సౌత్ బ్లాక్‌లో ఉంది.
ప్రధాన మంత్రి నివాసానికి కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా నిరంతరంగా ఉంటుంది. ఇది కాకుండా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంటుంది. ఇందులో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సిబ్బంది విధుల్లో ఉంటారు. మందులు, అంబులెన్స్ అందుబాటులో ఉంటాయి.
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, తోటమాలులు సహా అనేకమంది సిబ్బంది ఇక్కడ ఉంటారు.
ప్రధాన మంత్రి కార్యాలయానికి వచ్చిపోయే వారికి నిత్యం తనిఖీలు ఉంటాయి. పని చేయడానికి వచ్చిన వారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటనేది క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.
''ప్రధానిగా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఆంక్షలు కొంత వరకు తగ్గాయి. గతంలో ఇది ఊహించడం కూడా కష్టమే'' అని దిల్లీకి చెందిన ఒక జర్నలిస్ట్ అన్నారు.
2016కు ముందు ఈ ప్రాంతాన్ని 7, రేస్‌కోర్స్ రోడ్ అని పిలిచే వారు. మోదీ వచ్చిన తర్వాత దీనిని 7, లోక్‌కల్యాణ్ మార్గ్‌గా మార్చారు.
కొత్త ఇల్లు, కొత్త ఆఫీసు
సెంట్రల్ దిల్లీకి కొత్త రూపు ఇచ్చే బాధ్యత అహ్మదాబాద్‌కు చెందిన డా. బిమల్ పటేల్ అనే ఆర్కిటెక్ట్‌కు ఇచ్చారు.
2002 భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న భుజ్ ప్రాంతాన్ని పునర్నిర్మించడంలో కీలక పాత్ర పోషించిన బిమల్ పటేల్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించారు.
అంతకు ముందు సబర్మతి రివర్ ఫ్రంట్, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణంలో బిమల్ పటేల్ పాలుపంచుకున్నారు. 2019 సంవత్సరంలో మోదీ ప్రభుత్వం బిమల్ పటేల్‌కు పద్మ శ్రీ అవార్డు ఇచ్చింది.
సెంట్రల్ విస్టా తదుపరి దశ అనుమతి వ్యవహారం మే ప్రారంభంలో బయటకు వచ్చింది. ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ హౌస్ ప్రాజెక్టుకు అనుమతించారని అప్పట్లో ప్రచారం జరిగింది.
అయితే,''కేవలం కొత్త పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే పనులు ప్రారంభించాము.ప్రధాని కొత్త నివాసం కోసం పనులు ప్రారంభం కాలేదు.'' అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతవారం ప్రకటించారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.
దేశ స్వాతంత్ర్యపు 75వ వార్షికోత్సవానికి ముందే పార్లమెంటు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ కొత్త నిర్మాణం మన్నిక 150 నుంచి 200 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు.
ఇక్కడ చెట్లను తొలగించాల్సి వచ్చినప్పుడు, వాటిని కొట్టివేయకుండా వేరే ప్రాంతంలో నాటుతున్నారు.
సెంట్రల్ విస్టా ప్రస్తుత దశలో హైవేకి రెండు వైపులా 9 భవనాలు (ఒకవైపు 5, మరొక వైపు 4 ) ఉంటాయి (జనవరి 26న ఇక్కడే కవాతు జరుగుతుంది). భూగర్భ మార్గంలో వీటిని లింక్ చేస్తారు. వాటి ఎత్తు ఇండియా గేట్ కంటే తక్కువగా ఉంటుంది.
ప్రధాన మంత్రి కొత్త నివాసం ఎలా ఉంటుందనే దానిపై మాత్రం డిజైనర్లు, అధికారులు మౌనం పాటిస్తున్నారు.
కానీ, వివిధ సోర్సులు, మీడియా రిపోర్టుల ప్రకారం కొత్త నివాసంలో సహాయక సిబ్బంది, భద్రతా అధికారులు, మినీ పీఎంఓ కార్యాలయం, కాన్ఫరెన్స్ రూమ్, లాన్, ఎమర్జెన్సీ మెడికల్ సిస్టమ్‌తోపాటు మినీ థియేటర్ ఉంటుంది.
దేశ విదేశాలకు చెందిన అతిథులకు పార్టీ ఇవ్వడానికి అనువుగా 200-300 మంది పట్టేంత ఒక హాల్ ఉంటుంది.
ప్రధానమంత్రి సెక్యూరిటీ కాన్వాయ్, వచ్చిపోయే మినిస్టర్ల గెస్ట్ కాన్వాయ్‌ల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయి. దీని డిజైన్ భూకంపాలను తట్టుకునేలా ఉంటుంది.
ప్రధానమంత్రి కొత్త నివాసం ప్రస్తుతమున్న సౌత్ బ్లాక్‌కు సమీపంలో ఉంటుంది. ఇది పీఎంఓకు అండర్ గ్రౌండ్ ద్వారా అనుసంధానమైన ఉంటుంది. దీనివల్ల ప్రధానమంత్రి, ఇతర వీఐపీల కోసం ట్రాఫిక్‌ను నిలిపేయాల్సిన పని ఉండదు.
ఉప రాష్ట్రపతి నివాసం నార్త్‌బ్లాక్ సమీపానికి మారుస్తారు. ప్రస్తుతం ఈ రెండు బ్లాక్‌లు అనేక కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఆర్మీ, నేవీ ప్రధాన కార్యాలయాలకు నిలయాలు. ఈ రెండింటిని పబ్లిక్ మ్యూజియంలుగా మారుస్తారు.
రైసీనా హిల్స్‌లోని రాష్ట్రపతి భవన్ (గతంలో వైస్రాయ్ నివాసం)కు ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. అయితే, భూకంపాలు వస్తే ఈ భవనం తట్టుకోలేదన్న ఆందోళన ఉంది.
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రుల పర్యటనల సందర్భంగా భద్రత దృష్ట్యా రోడ్లను బ్లాక్ చేస్తుంటారు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కొత్త నిర్మాణాలతో ఇలాంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
ఎస్పీజీకి ప్రత్యేక కార్యాలయాలు
ప్రధాని రక్షణ బాధ్యతలను ప్రస్తుతం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) నిర్వహిస్తోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో ఈ సంస్థ కోసం ప్రత్యేక కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. అవసరాన్ని బట్టి ముఖ్యమంత్రులకు కూడా జెడ్ ప్లస్ కేటగిరీ కల్పిస్తారు. దిల్లీలోని లూటియెన్స్ ప్రాంతంలో సుమారు 70 బంగ్లాలను క్యాబినెట్ మంత్రులు, వీఐపీలకు కేటాయించారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రసంగం: ‘జూన్ 21 నుంచి 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా వ్యాక్సీన్.. రాష్ట్రాలు కొనుగోలు చేయనవసరం లేదు’
- ప్రతి నిమిషానికి 4 చెట్ల నరికివేత...గత అయిదేళ్లుగా భారత్‌లో జరిగిన పర్యావరణ ఘోరమిది.
- కరోనావైరస్: కోవిడ్ వ్యాక్సీన్లు ఎంతవరకు సురక్షితం?
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- కోవిడ్-19 వ్యాక్సీన్: రాష్ట్రాల దగ్గర లేదు...కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎలా దొరుకుతోంది?
- MIS-C: కరోనా వల్ల పిల్లలకు వస్తున్న ఈ కొత్త వ్యాధి ఎంత ప్రమాదకరం
- ‘‘వైట్ ఫంగస్’’: ఔషధాలకు లొంగని ఈ ఇన్ఫెక్షన్లు ఎలా వ్యాపిస్తున్నాయి
- కోవిడ్: కరోనా నుంచి కోలుకున్న తరువాత డయాబెటిస్ వస్తుందా
- కోవిడ్ సోకితే గర్భిణులు ఏం చేయాలి.. తల్లి నుంచి బిడ్డకు వస్తుందా..
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)