‘‘నాకు 23 ఏళ్లు.. మీ పిల్లల వయసు నాది.. నీ రూమ్‌లో ఏసీ లేదు నా రూమ్‌కు రా అని పిలుస్తారా’’.. నెల్లూరు వైద్య విద్యార్థినిపై అధికారి వేధింపులు - ప్రెస్‌రివ్యూ

నెల్లూరు జీజీహెచ్‌లో ఓ వైద్య విద్యార్థినితో అధ్యాపకుడు ఒకరు అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేశారని ‘ఈనాడు’ వార్తాకథనం ప్రచురించింది.

‘‘నెల్లూరు జీజీహెచ్‌లో వైద్య విద్యార్థినులపై వేధింపులు ఆగడం లేదు. కొందరు చదువు చెప్పే గురువులు.. అధికారులే.. ఈ దుశ్చర్యలకు పాల్పడటం విస్తుగొలుపుతోంది.

రెండేళ్ల కిందట ఓ వైద్య విద్యార్థినితో ఓ అధ్యాపకుడు అసభ్యంగా మాట్లాడిన ఆడియో వెలుగుచూడటంతో ఆమె కుటుంబసభ్యులు ఆయనపై దాడి చేశారు. దీంతో అధ్యాపకుడిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించి.. విచారణ కమిటీ వేసింది.

ఆ ఘటన మరువక ముందే.. మరో కీచకుడు ఇంకో వైద్య విద్యార్థినిపై కన్నేశాడు. అందుకు సంబంధించిన ఆడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. సదరు విద్యార్థిని.. ఆ వ్యక్తి వల్ల పడిన బాధను ఆ సంభాషణలో బయటపెట్టింది.

'నువ్వు నా సోల్‌మేట్‌.. లైఫ్‌ పార్ట్‌నర్‌.. వైజాగ్‌ కోడలయ్యేదానివి అంటూ మాట్లాడటం ఏమిటి సార్‌? నా వయస్సు 23 ఏళ్లు.. నాకు తెలిసి మీ పిల్లలకూ ఇదే వయస్సు ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా.. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నా... ఎందుకు ఫోన్‌ చేస్తున్నారు? రెస్టారెంట్లు, బీచ్‌కు రావాలని అడుగుతారా? నీ రూమ్‌లో ఏసీ లేదుగా.. నా రూముకు రా అని ఎలా పిలుస్తారు? ఏం మాటలవి సార్‌.. నేను మౌనంగా ఉన్నానని అనుకుంటున్నారా? మీ నంబరును బ్లాక్‌ చేస్తే.. మరో నంబరు నుంచి ఫోన్‌ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మానసికంగా వేధించడం వల్ల కొన్ని నెలలుగా పుస్తకాలు తెరవలేదు. విధులు నిర్వహించినా.. సంతకం పెట్టలేదు.. సార్‌' అంటూ తన పట్ల సదరు అధికారి ప్రవర్తించిన తీరును ఎంతో బాధతో చెప్పుకొచ్చింది.

ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు’’ అని ఆ కథనంలో రాశారు.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఫ్రంట్‌ రన్నర్‌ కేటగిరీలో ఏపీ, తెలంగాణ

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనలో పురోగతి సాధించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నీతి ఆయోగ్‌ ర్యాంకులు ప్రకటించింది. టాప్‌-5 రాష్ట్రాల కేటగిరీలో 72 మార్కులతో ఏపీ 4వ ర్యాంకు, 69 మార్కులతో తెలంగాణ 11వ ర్యాంకు సాధించినట్లు వెల్లడించిందని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో తెలిపింది.

‘‘నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌, సీఈవో అమితాబ్‌ కాంత్‌, సభ్యుడు (ఆరోగ్యం) వినోద్‌ పాల్‌, ఎస్‌డీజీ సలహాదారు సంయుక్త సమద్దార్‌ ఆధ్వర్యంలో 2020-21లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై రూపొందించిన ఇండెక్స్‌ను గురువారం విడుదల చేశారు.

75 మార్కులతో కేరళ తొలిర్యాంకును నిలబెట్టుకోగా, ఆ తర్వాత స్థానాల్లో హిమాచల్‌ప్రదేశ్‌(74), తమిళనాడు(74), ఆంధ్రప్రదేశ్‌(72), గోవా(72), కర్ణాటక(72), ఉత్తరాఖండ్‌(72), సిక్కిం(71), మహారాష్ట్ర(70), గుజరాత్‌(69), తెలంగాణ(69), మిజోరం(68), పంజాబ్‌ (68), హరియాణా(67), త్రిపుర(65) నిలిచాయి.

దిగువ-5 రాష్ట్రాలు, యూటీలు సాధించిన సుస్థిర పురోగతిని మరో కేటగిరీగా వర్గీకరించారు. వాటిలో మణిపూర్‌(64), మధ్యప్రదేశ్‌ (62), పశ్చిమ బెంగాల్‌ (62), ఛత్తీస్‌గఢ్‌, నాగాలాండ్‌, ఒడిశా 61 మార్కులు చొప్పున, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ 60 మార్కుల చొప్పున సాధించాయి. అసోం 57, జార్ఖండ్‌ 56, బిహార్‌ 52 మార్కులు సాధించినట్లు నీతి ఆయోగ్‌ ప్రకటించింది.

కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా కేటాయించిన సూచిక ప్రకారం 79 మార్కులతో చంఢీగఢ్‌ తొలి ర్యాంకు సాధించగా ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ(68), పుదుచ్చేరి(68), లక్షద్వీప్‌(68), అండమాన్‌ నికోబార్‌ దీవులు (67), జమ్ము కశ్మీర్‌(66), లద్ధాఖ్‌(66), దాద్రా నగర్‌ హవేలీ(62), డామన్‌ డయ్యూ(62) నిలిచినట్లు నీతి ఆయోగ్‌ వెల్లడించింది.

దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల (ఫాస్ట్‌ మూవింగ్‌ స్టేట్స్‌) జాబితాలో మిజోరాం(68), హరియాణా (67), ఉత్తరాఖండ్‌ (72) ఉన్నట్లు పేర్కొంది.

65 నుంచి 99 మార్కులతో ఫ్రంట్‌ రన్నర్‌ కేటగిరీలో ఏపీ, తెలంగాణ, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్‌, సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్‌, మిజోరాం, పంజాబ్‌, హరియాణా, త్రిపుర, చండీగఢ్‌, ఢిల్లీ, లక్షద్వీప్‌, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులు, జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్ ఉన్నాయి.

కాగా, 2018లో ప్రారంభించిన ఎస్‌డీజీ ర్యాంకుల విధానంలో అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం రాష్ర్టాలు, యూటీల మధ్య మంచి పోటీ నెలకొందని నీతి ఆయోగ్‌ పేర్కొంది. 2030 నాటికి భారత్‌ సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాల ఫలాల ప్రణాళికకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని సీఈవో అమితాబ్‌కాంత్‌ చెప్పారు.

పేదరిక నిర్మూలన, మంచి ఆరోగ్యం, నాణ్యతతో కూడిన విద్య, పరిశుభ్రమైన తాగునీరు, పారిశుధ్యం, లింగ సమానత్వం, ఆర్థిక వృద్ధి, ఆకలి లేని రాష్ట్రాల కేటగిరీలో నిర్దేశించిన ఏడు లక్ష్యాలను సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిపోయింది.

పర్రిశమలు, మౌలిక సదుపాయాల కల్పన, అసమానతల నిర్మూలన, సుస్థిరమైన నగరాలు, వినియోగం-ఉత్పత్తి రంగాల్లో తెలుగు రాష్ట్రాలు ముందంజలో లేవు.

నాణ్యమైన విద్యుత్‌ కేటగిరీలో ఉన్న 20 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణకు చోటు దక్కింది’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఆనందయ్య ఐ డ్రాప్స్‌ కోరిన వారికి ఇవ్వండి అని సూచించిన ఏపీ హైకోర్టు.. నో చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

కరోనా చికిత్స కోసం ఆనందయ్య అందిస్తున్న మూలికా వైద్యంలోని నాలుగు రకాల మందుల పంపిణీకి అభ్యంతరం లేదని, అయితే కళ్లల్లో వేసే చుక్కల (ఐ డ్రాప్స్‌) పంపిణీకి మాత్రం ప్రస్తుతానికి అనుమతినివ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిందని సాక్షి ఒక వార్త రాసింది.

ఆనందయ్య ఐ డ్రాప్స్‌ పరిశుభ్ర వాతావరణంలో తయారు కావట్లేదని నిపుణుల కమిటీ తేల్చిందని వివరించింది. ఈ డ్రాప్స్‌ను వేసుకునేవారి కళ్లు దెబ్బతినే వీలుందని కూడా చెప్పిందని, అందువల్ల ప్రస్తుతానికి ఐ డ్రాప్స్‌ పంపిణీకి అనుమతినివ్వలేమంది. ఐ డ్రాప్స్‌పై తదుపరి పరీక్షలు అవసరమని, ఇందుకు నెలకుపైగా సమయం పట్టే వీలుందని తెలిపింది.

మీరు అనుమతిని ఇవ్వొద్దని, అయితే తమకు అవసరముందంటూ తమంతట తాముగా వచ్చేవారికి ఐ డ్రాప్స్‌ ఇచ్చేందుకు అడ్డుచెప్పవద్దని హైకోర్టు సూచించగా, ఆ పని తాము చేయలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

ఈ దిశగా ఐ డ్రాప్స్‌ పంపిణీకి హైకోర్టు నిర్దిష్టమైన ఆదేశాలివ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని తెలిపింది. దీంతో ఐ డ్రాప్స్‌ పంపిణీ విషయంలో తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్య అందిస్తున్న కోవిడ్‌ మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా అధికారుల్ని ఆదేశించాలని, అలాగే ఆనందయ్య మందు పంపిణీకి తక్షణమే అనుమతులిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ పి.మల్లికార్జునరావు, ఎం.ఉమామహేశ్వర నాయుడులు వేర్వేరుగా పిల్‌లు దాఖలు చేశారు.

అలాగే తన ఔషధ పంపిణీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని, తనకు తగిన భద్రత కల్పించేలా కూడా ఆదేశాలివ్వాలంటూ ఆనందయ్య పిటిషన్‌ వేశారు. వీటిపై జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది.

తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కోవిడ్ పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్నదని, ప్రస్తుతం పాజిటివిటీ రేటు రెండు శాతమే ఉండటం దీనికి నిదర్శనమని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు జీ శ్రీనివాసరావు పేర్కొన్నారని నమస్తే తెలంగాణ తెలిపింది.

3 వారాల లాక్‌డౌన్‌ వల్ల ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయని, కొత్త కేసులు తగ్గి, కోలుకొంటున్నవారి సంఖ్య పెరిగిందని వివరించారు. గురువారం కోఠిలోని డీపీహెచ్‌ కార్యాలయంలో డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

కరోనా నుంచి సురక్షితంగా ఉండాలంటే పాజిటివిటీ రేటు కనీసం 5% లోపు ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించగా, ఇప్పుడు మనం 2శాతంతో పూర్తి సురక్షితంగా ఉన్నామని పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ తొలివారంలో పాజిటివిటీ రేటు 6.4% ఉండగా, మూడో వారానికి 2.1% కి తగ్గిందన్నారు. పడకలు పెద్ద సంఖ్యలో ఖాళీ అయ్యాయని, లాక్‌డౌన్‌కు ముందు రాష్ట్రంలో బెడ్‌ ఆక్యుపెన్సీ 52% ఉంటే, ఇప్పుడు కేవలం 26%గా ఉన్నదని వివరించారు.

ఇప్పటికే తొలి విడత జ్వర సర్వే పూర్తి కాగా, 31 జిల్లాల్లో రెండోవిడత సర్వే పూర్తిచేశామని, త్వరలో మూడో విడత సర్వే ప్రారంభించనున్నట్టు తెలిపారు. రెండో విడత సర్వేలో 87 లక్షల ఇండ్లలో పరీక్షలు చేయగా, ఫీవర్‌ ఓపీ ద్వారా ఇప్పటివరకు 3.5 లక్షల మందికి పరీక్షలు చేశామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఏపీ సరిహద్దు జిల్లాల్లో హెలికాప్టర్‌ ద్వారా పర్యటించి వైరస్‌కట్టడిపై దృష్టి సారించామని పేర్కొన్నారు.

114 దవాఖానలపై 185 ఫిర్యాదులు రాగా, అన్నింటికీ షోకాజు నోటీసులు జారీచేసినట్టు శ్రీనివాసరావు చెప్పారు. 22 దవాఖానల కొవిడ్‌ చికిత్స అనుమతులు రద్దు చేశామని తెలిపారు. అధిక ఫీజు వసూలుచేస్తున్న సందర్భంలో బాధితులకు న్యాయంజరిగేలా చూస్తున్నామన్నారు. దవాఖానల అసోసియేషన్లతో చర్చించి అధిక బిల్లులు వసూలుచేయకుండా చూడాలని కోరినట్టు వివరించారు.

జన సహాయకులకు వ్యాక్సినేషన్‌ హైదరాబాద్‌తోపాటు, వరంగల్‌లో ప్రారంభించామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తామని డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం నారాయణగూడలోని ఐపీఎంలో ప్రత్యేకంగా కేంద్రం ఏర్పాటుచేసినట్టు తెలిపారు. స్విగ్గీ, జొమాటో వంటి వారికి 1.4 లక్షల మందికి ఆయా కంపెనీల ద్వారా ఉచితంగా టీకా ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

థర్డ్‌వేవ్‌ కూడా మన చేతుల్లోనే ఉన్నదని డీఎంఈ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా అన్ని చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. చిన్నారులకు కొవిడ్‌ వచ్చి తగ్గిన నెల తర్వాత ఎంఐఎస్‌-సీ వస్తున్నట్టు తెలుస్తున్నదని, అకస్మాత్తుగా జ్వరం, కడపు నొప్పి, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే చిన్న పిల్లల దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు.

బ్లాక్‌ ఫంగస్‌ కేసు లకు సంబంధించి ఈఎన్టీ దవాఖానలో 250, గాంధీలో 100 ఆపరేషన్లు చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి మొత్తంగా 1,100 కేసులు ఉన్నాయని చెప్పారు. బ్లాక్‌ఫంగస్‌ ఔషధాలను దవాఖానలే ప్రభుత్వం ద్వారా సమకూర్చుకుంటాయన్నారు. దీనికి సంబంధించిన చికిత్సలు ఇకపై నిజామాబాద్‌, వరంగల్‌ సహా ఇతర టీచింగ్‌ దవాఖానల్లోనూ ప్రారంభమవుతాయని తెలిపారు.

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.. రాష్ట్ర ముఖ్యమంత్రులకు జగన్ లేఖ

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకునేలా అందరం ఒకే స్వరం వినిపించాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారని ఈనాడు ఒక కథనంలో తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వనరుల నుంచైనా సరే టీకాల లభ్యతను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాల మద్దతుతో కూడిన కేంద్రీకృత, సమన్వయ వ్యాక్సినేషన్‌ విధానం ఉంటేనే సత్ఫలితాలు వస్తాయని గురువారం ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో జగన్‌ పేర్కొన్నారు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. అందరికీ ఉచితంగా కోవిడ్‌ టీకా అందించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా.. నేరుగా వ్యాక్సిన్లు కొనేందుకు గ్లోబల్‌ టెండర్లు పిలిచామన్నారు.

గురువారం సాయంత్రం 5 గంటలతో బిడ్ల సమర్పణకు గడువు ముగిసినా ఒక్కరూ స్పందించలేదని లేఖలో పేర్కొన్నారు. వాటికి ఆమోదం తెలిపే అధికారం కేంద్రం వద్దనే ఉండటంతో.. ఈ అంశం కేంద్ర, రాష్ట్రాల మధ్య వ్యవహారంగా మారిపోయిందని వివరించారు.

‘వ్యాక్సిన్ల కొనుగోలు అంశం రాష్ట్రాల నియంత్రణలో లేకుండా పోయింది. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కూడా మందకొడిగా సాగుతోంది. కొన్ని రాష్ట్రాలు తగినన్ని టీకాలు పొందలేకపోయామని భావిస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లకు వెళ్లినా ఆశించిన స్పందన లేదు. టీకాలు వేయడంలో జాప్యం జరిగితే ప్రజలు తీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని జగన్‌ లేఖలో వివరించారు.

‘ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు సకాలంలో కొవిడ్‌ టీకాలు వేయించింది. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. రెండో దశ తీవ్రంగా ఉన్న సమయంలో వైద్యసిబ్బంది పోరాడటానికి ఇది ఎంతో ఉపయోగపడింది. కొవిడ్‌పై పోరాటంలో పదునైన ఆయుధం వ్యాక్సినేషనే. దేశంలో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కావాల్సి ఉందని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ల ఉత్పత్తిలో అనేక ఇబ్బందులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ల కొనుగోలు బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించటం సరైనది కాదు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో నెలా పదిహేను రోజులుగా రాష్ట్రాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రాల్లో వైద్యరంగంపై చేయాల్సిన ఖర్చును వ్యాక్సిన్ల కోసం మళ్లించాల్సి వస్తోంది’ అని జగన్‌ ఆ లేఖలో వివరించారు.

ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రులుగా మనం అందరం ఒకే మాటపై ఉండి, ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు కృషి చేద్దామని ఆయన కోరారని ఈ వార్తలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)