'బ్లాక్ డే': కేంద్రం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన

కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన ప్రదర్శనలకు ఆరు నెలలు పూర్తైంది.

ఈ సందర్భంగా మే 26ను 'బ్లాక్ డే'గా పిలుపునిచ్చిన రైతు సంఘాలు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.

"ఈ రోజును మేం 'బ్లాక్ డే'గా జరుపుకొంటున్నాం. ఇక్కడ మాకు ఆరు నెలలైంది. కానీ ప్రభుత్వం మా మాట వినడం లేదు. అందుకే మేం నల్ల జెండాలు పట్టాం" అని గాజీపూర్ బోర్డర్‌లోని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికైత్ అన్నారు.

"బ్లాక్ డేను శాంతియుతంగా నిర్వహిస్తాం. కరోనా ప్రొటోకాల్ కూడా పాటిస్తాం. బయట నుంచి రైతులెవరూ ఇక్కడకు రావడం లేదు" అని ఆయన చెప్పారు.

మరోవైపు ఘాజియాబాద్ సరిహద్దులో కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిరసనలు కొనసాగుతున్నాయి.

రైతులు గుంపులు గుంపులుగా నల్ల జెండాలు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

పంజాబ్‌ అమృత్‌సర్‌ సమీపంలోని చబ్బా గ్రామంలో రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగరవేశారని, బ్లాక్ డే సందర్భంగా నిరసనలు తెలిపారని ఏఎన్ఐ రాసింది.

రైతులు బ్లాక్ డేకు పిలుపునివ్వడంతో సింఘూ బోర్డర్(దిల్లీ-హర్యానా సరిహద్దు)లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు.

పంజాబ్‌, సంగ్రూర్ జిల్లాలోని సంగత్‌పురాలో కూడా రైతులు నల్ల జెండాలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతల దిష్టిబొమ్మలు దహనం చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వామపక్షాలు, రైతు సంఘాలు బ్లాక్ డే నిర్వహించాయి.

ఒంగోలు కలెక్టర్ ఎదుట వామపక్షాలు, రైతు సంఘాల నేతలు ప్లకార్డులతో నిరసనలు చేశారు.

చీమకుర్తిలో సీఐటీయూ నేతృత్వంలో రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాలు బ్లాక్ డే నిర్వహించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)