You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐపీఎల్: విమర్శల నుంచి వాయిదా వరకు.. అంచనాలు ఎందుకు తప్పాయి
52 రోజుల పాటు సాగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నీ, కోవిడ్ కారణంగా నెల రోజులు తిరగకుండానే నిరవధికంగా వాయిదా పడింది.
ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లు కరోనా పాజిటివ్‌గా తేలడంతో నిన్నటి కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగలేదు.
వృద్ధిమాన్ సాహా(సన్ రైజర్స్ హైదరాబాద్) కు కరోనా సోకిందని జట్టు యాజమాన్యం ప్రకటించడంతో మంగళవారం జరగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆగింది.
చెన్నై బౌలింగ్ కోచ్ లక్ష్మిపతి బాలాజీకి కరోనా సోకడంతో బుధవారం జరగాల్సిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ను ఇప్పటికే వాయిదా వేశారు.
ఇలా ఒక్కొక్కళ్లుగా ఆటగాళ్లు కరోనా బారిన పడుతుండటంతో మొత్తం టోర్నీనే వాయిదా వేసింది బీసీసీఐ.
బీసీసీఐ ఏం చెప్పింది?
అత్యవసర సమావేశం తర్వాత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
''ఐపీఎల్‌లో పాల్గొంటున్న ఆటగాళ్లు, సిబ్బంది, ఈ టోర్నీ నిర్వహణలో పాల్గొంటున్న వారి ఆరోగ్య భద్రత విషయంలో రాజీ పడాలని బీసీసీఐ భావించడం లేదు. అందరి సంక్షేమాన్ని ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని ఆ ప్రకటనలో పేర్కొంది.
''ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. అయినా క్రికెట్ ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో కొంత ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించాం. కానీ, ఈ క్లిష్ట పరిస్థితుల్లో టోర్నమెంటులో పాల్గొనే ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో గడపడం చాలా ముఖ్యం. అందుకే టోర్నమెంటును నిరవధికంగా వాయిదా వేస్తున్నాం.'' అని తెలిపింది.
''ఐపీఎల్‌లో పాల్గొన్నవారందరూ క్షేమంగా వారి వారి ప్రాంతాలకు చేరే వరకు వారికి అన్ని విధాలా సహకరిస్తాం'' అని కూడా బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.
ఐపీఎల్ టోర్నీపై విమర్శలు
ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆటగాళ్ల కోసం బయో బబుల్స్ ఏర్పాటు చేసి, వారికి కరోనా సోకకుండా జాగ్రత్త తీసుకుంది.
అయితే, కరోనా విజృంభిస్తున్న వేళ ఐపీఎల్ టోర్నీ ఏంటని కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఖర్చును దేశంలో ఆక్సిజన్ కొరతను ఎదుర్కోవడానికి ఉపయోగించవచ్చని కొందరు సూచించారు.
మరోవైపు, ప్రస్తుత కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఐపీఎల్‌ను రద్దు చేసేలా లేదా వాయిదా వేసేలా బీసీసీఐను ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
ఐపీఎల్ కోసం వెచ్చించే వనరులను కోవిడ్ వ్యాప్తి కట్టడికి వినియోగించాలని ఆ వ్యాజ్యంలో పిటిషనర్ కోరారు. దీనిపై గురువారం విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది.
ఉద్ధృతంగా కోవిడ్ వ్యాప్తి
కోవిడ్ సంక్షోభం ఎలా ఉన్నా... ఐపీఎల్ 14వ సీజన్ ఏ సమస్యా లేకుండా సాగుతుందని భారత క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా టోర్నీ ఆరంభంలో విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆటగాళ్లకు, టోర్నీ నిర్వహణలో భాగమయ్యేవారి అందరి రక్షణ కోసం 'బయో బబుల్స్' ఏర్పాటు చేశామని, వారికి క్రమం తప్పకుండా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు.
‘‘జట్లన్నీ తమకు కేటాయించిన సురక్షితమైన బబుల్స్ పరిమితిలోనే ఉంటున్నాయి. బయటివారిని ఎవరినీ కలవడం లేదు. నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా ప్రతి జట్టుకూ 'బబుల్ ఇంటెగ్రిటీ మేనేజర్స్'ను భారత క్రికెట్ బోర్డు నియమించింది. ముంబయిలోని మైదాన సిబ్బందికి రెండు రోజులకోసారి పరీక్షలు చేస్తున్నారు’’ అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్ పేర్కొంది.
అయితే, దేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మంగళవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొత్త కరోనా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,02,82,833కు చేరుకుంది.
భారత్‌లో 2020 మార్చి నుంచి పెరుగుతూ వచ్చిన కరోనా కేసులు, గత ఏడాది డిసెంబర్ 19న కోటి దాటాయి. ఈ ఏడాది సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడం, రోజువారీ కేసులు భారీగా నమోదు కావడంతో ఐదు నెలల్లోపే కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది.
ఆటగాళ్ల ఇంటిదారి..
సెకండ్ వేవ్ తాకిడి తీవ్రంగా ఉండడంతో కొందరు ఆటగాళ్లు, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు ఆందోళనకు గురయ్యారు.
ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆండ్రూ టైతో పాటూ ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ లాంటి వాళ్లు ఐపీఎల్‌ను మధ్యలోనే వదిలేసి స్వదేశాలకు తిరిగి వెళ్లారు.
రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు ఆడుతున్న ఆండ్రూ టై ఆదివారమే సిడ్నీ ఫ్లైట్ ఎక్కేశారు. అటూ ఇటూ కదల్లేకుండా నిర్బంధంలో ఉన్నట్టు ఉండి ఆడడానికి కష్టంగా ఉందని ఆండ్రూ తెలిపారు.
అంతే కాకుండా, ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు విమానాలను అనుమతించకపొతే ఇబ్బంది అవుతుందని ఆయన అన్నారు. "నా దేశానికి వెళ్లలేకపోయే పరిస్థితి రాక ముందే బయలుదేరిపోవడం మంచిదని అనిపించింది.'' అని ఆండ్రూ అన్నారు.
''నేను వెళ్తున్నానని తెలియగానే చాలామంది నన్ను కాంటాక్ట్ చేశారు. నేను ఎలా వెళ్తున్నాను, ఏ ఫ్లైట్ ఎక్కాను, ఎలా ఇంటికి చేరానో వివరాలు చెప్పమని అడిగారు. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల గురించి అందరికీ ఆందోళనగా ఉంది" అని ఆస్ట్రేలియన్ రేడియో స్టేషన్ ఎస్ఈఎన్‌తో చెప్పారు.
భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ సమయంలో కుటుంబానికి తాను ఎంతో అవసరం అంటూ టోర్నీ నుంచి వైదొలిగారు.
మొదటి నుంచి కోవిడ్ సమస్య
అయితే టోర్నీ ప్రారంభానికి ముందే నలుగురు ఆటగాళ్లు, ఓ జట్టు సలహాదారుడు కరోనావైరస్ పాజిటివ్‌గా తేలారు. టోర్నీ మొదలవ్వక ముందే వారిని ఐసోలోషేన్‌లో ఉంచారు.
బబుల్స్‌లో అంతర్గతంగా పెద్ద స్థాయిలో కేసులు వస్తే, టోర్నీ రద్దు చేయాల్సి రావొచ్చని విజ్డెన్ ఇండియా అల్మనాక్ ఎడిటర్ సురేశ్ మేనన్ అప్పట్లోనే బీబీసీతో అన్నారు. ఇప్పుడు అదే జరిగింది.
దేశవ్యాప్తంగా ఆరు స్టేడియంలలో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది బీసీసీఐ. గత సీజన్ యూఏఈలో జరగ్గ మూడు నగరాలు మ్యాచ్‌లకు వేదికలుగా మారాయి. అయితే ఇక్కడ విమానంలో ప్రయాణించాల్సిన అవసరం లేకపోవడంతో సమస్య రాలేదు.
కానీ ఈసారి ఇండియా మ్యాచ్‌ల సందర్భంగా ఆటగాళ్లు ఈ నగరాలకు వెళ్లడానికి ప్రైవేట్, చార్టర్ ఫ్లైట్లు ఏర్పాటు చేశారు.
ఆటగాళ్లు ఉండే హోటళ్లు, రిసార్టులకు సామాన్య ప్రజలు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుని బబుల్స్ నిర్వహించారు.
కానీ, టోర్నీ సగంలోనే ఆటగాళ్లలో కోవిడ్ కేసులు ఒక్కొక్కటిగా బయటపడటం మొదలు పెట్టాయి. దీంతో మొత్తం టోర్నీని నిరవధికంగా వాయిదా వేసింది బీసీసీఐ.
ఇవి కూడా చదవండి:
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)