You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డాక్టర్ గురుమూర్తి: తిరుపతి లోక్‌సభ ఎంపీగా గెలిచిన ఫిజియో థెరపిస్ట్
- రచయిత, హరికృష్ణ పులుగు
- హోదా, బీబీసీ ప్రతినిధి
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ మద్దిల గురుమూర్తి విజయం సాధించారు. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు ప్రధానంగా పోటీ పడిన ఈ ఎన్నికల్లో డాక్టర్ గురుమూర్తి తన సమీప ప్రత్యర్ధి, తెలుగుదేశం పార్టీకి చెందిన పనబాక లక్ష్మిని 2,68,978 ఓట్ల తేడాతో ఓడించారు.
తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాత్తుగా మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
అయితే దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ భార్య లేదా కుమారుడికి ఈ సీటును కేటాయిస్తారని అంతా భావించినా, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా తనకు అత్యంత విధేయుడైన గురుమూర్తిని తెర మీదకు తీసుకువచ్చారు.
చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్న సముద్రం గ్రామానికి చెందిన మద్దిల గురుమూర్తి ఓ సాధారణ దళిత వ్యవసాయ కుటుంబంలో 1985, జూన్ 22న జన్మించారు.
నిరక్షరాస్యులైన గురుమూర్తి తల్లిదండ్రులు ఆయనను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించారు.
56 వ ర్యాంకు సాధించడం ద్వారా తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)లో ఫిజియోథెరపీ కోర్సులో చేరారు. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ అండ్ సర్టిఫైడ్ మాన్యువల్ థెరపీ కోర్సును పూర్తి చేశారు.
స్విమ్స్‌లో ఫిజియో థెరపీ కోర్సు చేస్తున్న సమయంలో గురుమూర్తి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రాజకీయ విధానాలకు ఆకర్షితులయ్యారు.
రాష్ట్రంలో ఫిజియో థెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన సహ విద్యార్ధులతో కలిసి పలుమార్లు నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డిని కలుసుకున్నారు.
ఈ విషయంలో సీఎం రాజశేఖర్ రెడ్డి ఆయనకు సంపూర్ణ సహకారం అందించడంతో, గురుమూర్తి రాజశేఖర్ రెడ్డికి, ఆయన కుటుంబానికి వీరాభిమానిగా మారారు.
రాజకీయాలలో...
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కూడా గురుమూర్తి ఆయన కుటుంబానికి విధేయుడిగా కొనసాగారు. వైయస్సార్ కాంగ్రెస్ స్థాపించిన తొలినాళ్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో డాక్టర్ గురుమూర్తి పాల్గొన్నారు.
2014 జనరల్ ఎలక్షన్‌లలో కూడా ఆయన పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. 2017లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించినప్పుడు, గురుమూర్తి జగన్ తన సహకారం అందించారు.
3648 కి.మీ.ల పాటు సాగిన ఈ యాత్రలో నిత్యం జగన్ వెంట ఉండి ఫిజియో థెరపిస్టుగా సేవలందించారు.
2019 ఎన్నికల్లో వై.ఎస్.విజమయమ్మ ఎన్నికల ప్రచార కమిటీలో సభ్యుడిగా పని చేసిన గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు.
డాక్టర్ గురుమూర్తి సేవలను మెచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనకు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్ధిగా అవకాశం ఇచ్చారు.
గురుమూర్తికి భార్య నవ్యకిరణ్, వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు( ఒక పాప, ఒక బాబు) ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- టీకా ఉత్సవ్: విశాఖ జిల్లాలో వ్యాక్సీన్ల కోసం 14వేల మంది వస్తే.. 580 మందికి మాత్రమే ఇచ్చారు.. భారత్‌లో టీకాల కొరతకు కారణమేంటి..
- కరోనా కాలంలో విడాకులు, బ్రేకప్‌లు ఎందుకు పెరుగుతున్నాయి?
- కరోనావైరస్: సెకండ్ వేవ్‌లో పిల్లలు, యువతకు ఎక్కువగా వైరస్ సోకుతోందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్: 'గత ఏడాది లాక్డౌన్ వల్ల అడుక్కోవాల్సి వచ్చింది... మళ్లీ విధిస్తారా'
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)