You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఖమ్మం మహిళలు
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏప్రిల్ 11వ తేదీ ఆదివారం. ఉదయం 7 గంటల ప్రాంతం. ఖమ్మం పట్టణ శివార్లలోని రైల్వే ట్రాక్. అక్కడ ట్రాక్ పై ఒక మృతదేహం పడి ఉంది. ఇంకా రక్తం కారుతోంది. కొన్ని శరీర భాగాలు తెగి పడి ఉన్నాయి. అప్పుడే అక్కడకు కొందరు బృందంగా వచ్చారు. వారిలో ముగ్గురు ఆడవాళ్లు కూడా ఉన్నారు.
వీరు అక్కడకు వెళ్లగానే ఏదో ప్రొఫెషనల్స్ చేసినట్టు, చకచకా తమతో తెచ్చిన పాత చీరలను ట్రాక్ పై పరిచారు. ఆ మృతదేహాన్ని దానిపైకి చేర్చారు. జేబుల్లో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని వెతికారు. ఇంకా శరీర భాగాలు వేరే చోట పడ్డాయా అని చుట్టూ వెతికారు. తరువాత తమతో తెచ్చిన కర్రకు ఆ శరీరం ఉన్న చీరలను కట్టి డోలీలా చేసుకుని మోసుకుని వెళ్లి అంబులెన్సులో ఎక్కించారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు.
వీరంతా స్థానికంగా అనాథాశ్రమం నడుపుతున్న అన్నం శ్రీనివాసరావు ఫౌండేషన్ కు చెందిన వారు. ఆ బృందంలో ఆయన ఉన్నారు. ఆయనతో పాటూ 17 ఏళ్లు కూడా నిండని ఓ అమ్మాయి ఉంది. ఇద్దరు మధ్య వయసు మహిళలు, మరో నలుగు మగవారూ ఉన్నారు. స్థానిక పోలీసుల కోరిక మేరకు వారిదంతా చేశారు.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోన్న దేవిశ్రీ ఈ పనిలో చాలా చురుగ్గా పాల్గొంది. ఆమె అన్నం శ్రీనివాస రావు బంధువు అవుతుంది. లాక్ డౌన్ సమయంలో శ్రీనివాస రావు నడిపే ఆశ్రమంలో సేవ చేయడానికి వచ్చింది. ‘‘ఒక రోజు తాతగారు (శ్రీనివాస రావు) అంబులెన్సులో వెళ్తుంటే ఎక్కడకు అన్నాను. నీవు రాకూడదు అని ఆయన అన్నారు. ఎందుకు రాకూడదు? నేను వస్తాను అని చెప్పాను. అలా మొదటిసారి మృతదేహాలను తరలించేందుకు వెళ్లాను.’’ అని చెప్పారు దేవిశ్రీ. ఇప్పటి వరకూ ఆమె పదుల సంఖ్యలో మృతదేహాలను తొలగించడంలో ఆ బృందానికి సహకరించారు. ఎంతో ఛిద్రమైన వాటినీ హ్యాండిల్ చేశారు.
ఎప్పుడూ భయం వేయలేదా? అని ప్రశ్నిస్తే.. అసలు లేదు అంటూ ధైర్యంగా సమాధానం చెప్పింది దేవిశ్రీ. తన తల్లితండ్రులు కూడా తాను చేసే సేవకు అభ్యంతరం పెట్టరన్న దేవి, కాలేజీ లేనప్పుడు సేవకు వస్తుంటానని చెప్పింది. మిగిలిన సమయాల్లో శ్రీనివాస రావు అనాథాశ్రమంలో అక్కడి వారికి సపర్యలు చేస్తున్నట్టు వివరించింది.
ఈ పనిలో పాల్గొన్న మిగిలిన ఇద్దరు మహిళలూ అన్నం ఫౌండేషన్ లో పనిచేస్తున్నారు. వారు జీతం తీసుకునే వారే అయినప్పటికీ, అటు మతిస్థిమితం లేని వారి సేవ అయినా, దెబ్బతిన్న మృతదేహాల తరలింపు అయినా ఎంతో ఓపిగ్గా చేస్తుంటారక్కడ.
సాధారణంగా మహిళలు తక్కువగా కనిపించే ఈ పనిలో వారు ఎంతో ధైర్యంగా, ఎక్కడా వెనుకాడకుంగా చేసుకుపోవడం ఆశ్చర్యం కలిగిస్తూంటుంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడం ద్వారా ఆయనకు పోలీసులతో పరిచయం. క్రమంగా గుర్తుపట్టలేని, దారుణంగా దెబ్బతిన్న మృతదేహాలను తరలించడంలో శ్రీనివాస రావు సాయం కోరేవారు పోలీసులు. ఇప్పుడు అది వారికి పెద్ద వ్యాపకం అయిపోయింది.
అన్నం శ్రీనివాస రావు బీఎస్ఎన్ఎల్ లో లైన్ మెన్ గా చేసి రిటైర్ అయ్యారు. రోడ్డుపై మతిస్థిమితం లేక తిరుగుతోన్న వారిని చూసి చలించి పోయేవారు. ‘‘రోడ్డుపై బట్టలు లేక, చెత్తకుప్పల దగ్గర తింటూ, జనాన్ని కొడుతూ, తన్నులు తింటూ తిరిగే వారిని చూసి చలించిపోయేవాడిని. అటువంటి వారిని చేర్చుకోమని ఖమ్మంలోని చాలా ఆశ్రమాల దగ్గరకు వెళ్లేవాణ్ణి. మతిస్థిమితం లేని వారిని చేర్చుకునేందుకు వారు ఆసక్తి చూపలేదు. దీంతో వారిని తెచ్చి నా ఇంట్లోనే పెట్టుకునే వాడిని. 2008లో అలా చేయడం మొదలు పెట్టాను. తరువాత కొందరు పెద్దలు ఒక స్వచ్ఛంద సంస్థలా నిర్వహించాలని సూచించడంతో ఈ సంస్థను ప్రారంభించాను’’ అంటూ వివరించారు శ్రీనివాసరావు.
కుటుంబ పరిస్థితుల వల్ల తాను స్వయంగా ఒక ఆశ్రమంలో పెరిగినట్టు చెప్పారు శ్రీనివాస రావు. అన్నం సేవాశ్రమానికి సొంత భవనం లేదు. దీంతో అద్దెకు తీసుకున్న చోట మతిస్థిమితం లేని వారిని ఉంచేవారు. దీంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేది. ‘‘ఈ విషయంలో నేను చాలా చీత్కారాలు ఎదుర్కొన్నాను. ఖాళీ చేసేయమని ఇబ్బంది పెట్టేవారు. చివరకు ఖమ్మం మునిసిపాలిటీ వారు నిర్మించిన నైట్ షెల్టర్ లో ప్రస్తుతం ఆశ్రమం నడుపుతున్నాను.’’ అని చెప్పారాయన.
ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 300 మంది వరకూ అనాథలు, వికలాంగులు, మానసిక స్థితి సరిగా లేని వారు ఉన్నారు. ఆ షెల్టర్ లో మొదటి అంతస్తులో మగవారు, కింద ఆడవారు, ఆఫీసు గది ఉంటాయి. కరోనా సమయంలో కూడా వీరి సేవలకు కొనసాగాయి. కరోనా రోగులకు ఇంటి వద్దకు భోజనం అందించడం వంటివి చేశారు. అలాగే కరోనా వల్ల మరణించిన వారిని సొంత వారు పట్టించుకోనప్పుడు, వీరే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు.
వీరికి భోజనం, వసతితో పాటూ మానసిక చికిత్స కూడా అందిస్తారు. అవసరమైన వారిని హైదరాబాద్ తీసుకెళ్లి చికిత్స అందిస్తూంటారు. ‘‘ఇక్కడ ఎందరికో నయం అంది. మేం వారికి చికిత్స అందించాక వారి సొంత వివరాలు చెబితే అప్పుడు వారి ఊరు తీసుకెళ్లి దిగబెడతాం. అలా 20-25 ఏళ్ల తరువాత సొంత వారిని కలిసిన వారు కూడా ఉన్నారు. అలా కొన్ని వందల మందిని సొంత కుటుంబాల దగ్గరకు చేర్చినట్టు ఆయన వివరించారు. అది మాకెంతో సంతోషకరమైన విషయం’’ అన్నారు శ్రీనివాస రావు.
‘‘ఏడాది క్రితం నేనిక్కడకు వచ్చినప్పుడు త్రిష అని ఒకామె ఉండేది. బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివేది. గట్టిగా ఇంగ్లీషులో అరుస్తూ ఏదేదో మాట్లాడేది. మేం ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ చికిత్స చేయించాం. దీంతో బాగయి సొంత ఇంటికి వెళ్లింది.’’ అంటూ వివరించారు దేవిశ్రీ.
మతిస్థిమితం లేని వారికి చికిత్స అందించి సొంతింటికి చేర్చడంలో పోలీసులు, కోర్టులు, న్యాయ సేవా విభాగం సహకారం ఎంతో ఉందంటారు ఆశ్రమ నిర్వాహకులు.
‘‘పుట్టిన రోజు, పెళ్లి రోజు, తల్లితండ్రులు జ్ఞాపకార్థం ఇక్కడకు వచ్చి సేవ చేసే వారు, వస్తు రూపేణా, ధన రూపేణా విరాళాలు ఇచ్చేవారి వల్లే నడుస్తోంది. లేదంటే రోజుకు 350 మంది భోజనాలు, వైద్యం, ఇతర ఖర్చులు అంటే మాటలు కాదు. అప్పటి కలెక్టర్ గారి దయవల్ల ఈ నైట్ షెల్టర్ మా ఆధీనంలో పెట్టారు. కానీ ఇది సరిపోదు. శాశ్వతం కాదు. మాకు సొంత భవనం కావాలనేది మా కోరిక. భవనం కట్టాలనేది మా లక్ష్యం.’’ అని వివరించారు ఆశ్రమ నిర్వహణలో సహాయకారిగా ఉన్న కడవెండి వేణుగోపాల్.
ప్రస్తుతం వీరు తమ ఆశ్రమానికి శాశ్వత స్థలం, భవనం కోసం వెతుకుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ మన్దీప్ పునియా అరెస్ట్
- మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- ఎడారి ఇసుక నేలలో పచ్చని పొలం... ఈ అద్భుతం ఎలా సాధ్యం?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- రైతుల నిరసనలు: ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గొద్దు.. రైతులకు సూచించిన రాహుల్ గాంధీ
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- సింధు నదీజలాల ఒప్పందం వల్ల భారత్ నష్టపోతోందా.. అసలు ఎందుకీ ఒప్పందం చేసుకున్నారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)