You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉప్పెన సినిమా రివ్యూ: కమర్షియల్ ఫార్ములా మధ్య నలిగిన సెన్సిబుల్ లైన్
- రచయిత, శతపత్ర మంజరి
- హోదా, బీబీసీ కోసం
"ఇష్క్ షిఫాయా..ఇష్క్ షిఫాయా.." అంటూ కొన్నేళ్లుగా కుర్రకారు గుండెలను ధక్ ధక్ మనిపిస్తున్న సినిమా 'ఉప్పెన'.
మరి ఈ సినిమా జలజలమనే జలపాతంలా సినీప్రేమికులను ఉప్పెనలా చుట్టేసిందా? లేదా? మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో నటుడు వైష్ణవ్ తేజ్ సినీ భవితవ్యాన్ని ఈ సినిమా ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతుంది? సినిమా విడుదలకు ముందే క్రేజీ బజ్ క్రియేట్ చేసుకోగలిగిన కృతిశెట్టి నటన, అందం సినిమాకు ఎంతవరకు సహకరించాయి? విలన్ పాత్రలో కనపడిన విజయ్ సేతుపతి ఎలాంటి విలనిజం చూపించగలిగాడు?
అన్నింటి కంటే ముఖ్యంగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఎలాంటి కథాకథనాలతో చిత్రాన్ని ఎంత ఆసక్తిగా తెరకెక్కించగలిగాడు లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పాడ గ్రామంలో శేషగిరి రాయనం (విజయ్ సేతుపతి) మత్స్యకారులందరినీ ఆదుపాజ్ఞలలో ఉంచుకుని... చేపల వ్యాపారం చేస్తుంటాడు. కులం,పరువు లాంటి పట్టింపులున్న రాయనం కూతురు సంగీత అలియాస్ బేబమ్మ(కృతిశెట్టి)ను, ఆమె కోరిక మేరకు అతికష్టం మీద ఊరు నుండి పదిహేను కిలోమీటర్ల వరకు ఆమె కోసమే స్ఫెషల్ బస్ వేయించి ఉమెన్స్ కాలేజీలో చదివిస్తుంటాడు.
అలాంటి రాయనం పరువుకు అధికారిక సింబల్ లాంటి కూతురు మత్స్యకార వృత్తి చేసుకుని బతికే జాలరి జాలయ్య (సాయిచంద్) కొడుకు ఆశి అలియాస్ ఆశీర్వాదం(వైష్ణవ్ తేజ్) ప్రేమలో పడుతుంది. ఇలాంటి సర్వసాధారణమైన కథ రాయనం కర్కశత్వం వలన ఒక అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఇద్దరి జీవితాలు ప్రశ్నార్థకంగా నిలబడతాయి.అసలు అలాంటి మలుపు తిప్పే సంఘటన ఏమిటి? సంగీత, ఆశీర్వాదం ప్రేమ విఫలమవుతుందా, సఫలమవుతుందా... లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఒక ఐశ్వర్యవంతుడు ఉంటాడు. అతనికి ఒక అందమైన కూతురు ఉంటుంది.ఆమె ఏరికోరి ఒక పేదవాడిని ప్రేమిస్తుంది. ఆ తండ్రి వారి ప్రేమకు విలన్ గా మారుతాడు. ఆ పేదవాడైన కథానాయకుడు ప్రత్యర్థిని మట్టికరిపించి అతని కూతురుని వివాహం చేసుకుంటాడు.ఇది కొన్ని తరాలుగా సాగుతున్న ప్రేమ కథలకు మూలం. ఉప్పెన సినిమా కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. అయితే, ఇందులో తీసుకున్న ఒకే ఒక మలుపు మాత్రం మిగతా కమర్షియల్ సినిమాలకు భిన్నంగా అనిపిస్తుంది. ఆ మలుపు తిప్పే సంఘటనను దర్శకుడు ఎంత సెన్సిబుల్ చెప్పగలిగాడో అన్నదానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది.
సినిమా చూస్తున్నంతసేపు బుచ్చిబాబు సానా కొత్త దర్శకుడు అని అనిపించకపోవడం ఎంత ప్లస్ పాయింటో అంతే మైనస్ పాయింట్ కూడా, రొటీన్ కమర్షియల్ మూవీలకు ఏమాత్రం తగ్గని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నది ఎంత నిజమో, కొత్తదనం లోపించిందన్నది అంతే నిజం. కథ,కథనం, మత్స్యకారులు వారి జీవితాలు, విలన్, కథానాయకుడు, కథానాయిక, ఆ వాతావరణం... అన్ని ఎక్కడో అక్కడ మరొక సినిమాతో పోల్చుకుని ఐడెంటిఫై అయ్యేలా చేస్తాయి. అదే విధంగా క్లైమాక్స్ లో రాయనం కూతురు మాటలు వింటూ నిలబడిపోవడం కూడా చాలా కృతకంగా అనిపిస్తుంది.
అయితే, పాటలు మాత్రం తాజాగా ప్రేక్షకులలో ఉత్సాహం నింపుతాయనడంలో సందేహం లేదు. సంగీతం తరువాత గొప్పగా చెప్పుకోవాల్సింది శ్యాందత్ సినిమాటోగ్రఫీ. ఉన్నఫళంగా ఉప్పాడ గ్రామానికి వెళ్ళాలి అనిపించేంతగా ఆకట్టుకుంటుంది. ఆఫ్ బీట్ ప్రేమ కథలను ఇష్టపడేవాళ్ళకు నచ్చుతుంది. అంటే కథలో ఉండాల్సిన భావోద్వేగాలు ఏ సంఘటనలోనూ పతాకస్థాయికి చేరుకున్నట్లు కనపడదు.పైగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చే హీరోను కమర్షియల్ గా చూపాలన్న నియమం పెట్టుకుని కథానాయకుడి పాత్రను రూపొందించినట్లుగా ఉంటుంది.పోనీ మాస్ ప్రేక్షకులకు నచ్చుతుంది అనడానికి తీసుకున్న లైన్ చాలా సెన్సిబుల్ గా ఉంది. ఎటు వైపు చూసుకున్నా దర్శకుడికి కత్తిమీద సాములా ఉంది వ్యవహారం. వీటన్నింటినీ ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలైన సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాల్సిందే.
వైష్ణవ్ తేజ్ హావభావాలు,నటన ఆకట్టుకుంటాయి. కొత్త నటుడు అన్న సందేహం కూడా కలగదు. అయితే, సినిమా కథకు అనుగుణంగా తనను తాను మలుచుకుని హీరోయిజం ప్రదర్శన కంటే పాత్రలోనూ, ఆ వాతావరణంలోనూ ఇమిడిపోయి ఉంటే సినిమా మరింత అద్భుతంగా ఉండేదేమో అనిపిస్తుంది.
ఇక మలయాళ నటి కృతిశెట్టి తన అందంతో కట్టిపడేస్తుంది.క్లైమాక్స్ లో విజయ్ సేతుపతి,కృతిశెట్టిల మధ్య జరిగే సంభాషణలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. విజయ్ సేతుపతి విలన్ గా చాలా బాగా నటించాడు. కానీ అతని పాత్రకు కావాల్సినంత స్కోప్ దర్శకుడు ఇవ్వలేకపోయాడేమో అనిపిస్తుంది. సాయిచంద్‌కు కూడా నటనకు తగినంత విస్తృతి లోపించినట్లుగా అనిపించింది.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో ఏ విధంగానూ రాజీపడలేదన్న విషయం సినిమాలోని ప్రతి సీన్ లోనూ అర్థమవుతుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం, నేపథ్య సంగీతం,గాయనీగాయకుల గాత్రం బాగా ఆకట్టుకునే ఎలిమెంట్స్. శ్యాందత్ సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా కనపడుతుంది.ఆయన విజనరీ లోతును పట్టిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- చమోలీ గ్లేసియర్: ఉత్తరాఖండ్‌లో ఈ 'ప్రళయం' ఎందుకొచ్చింది, నిపుణులు ఏమంటున్నారు
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)