అజింక్య రహానె: భారత క్రికెట్ కెప్టెన్ చేయాలంటూ డిమాండ్... వైరల్ అవుతున్న వీడియో

భారత్-ఆస్ట్రేలియాల మధ్య టెస్ట్ సిరీస్‌ ముగిసి వారం రోజులు అవుతోంది. కానీ అక్కడ సాధించిన చరిత్రాత్మక విజయం తాలూకు సంబరాలకు మాత్రం ఇంకా తెరపడలేదు.

భారత క్రికెటర్లు స్వదేశానికి తిరిగి వచ్చారు. వారికి అభిమానులు అద్భుతమైన స్వాగతం పలికారు. ఆటగాళ్లకు భారీ నజరానాలు కూడా అందుతున్నాయి.

జట్టు మొత్తానికి రూ.5కోట్లు బోనస్‌గా ఇస్తామని బీసీసీఐ ప్రకటించింది. పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర అద్భుత ప్రతిభ కనబరిచిన ఆరుగురు క్రికెటర్లకు మహీంద్రా థార్‌ వాహనాన్ని అందిస్తామని శుక్రవారంనాడు ప్రకటించారు.

యువతరాన్ని ప్రోత్సహించడమే ఈ బహుమతి లక్ష్యమని ఆనంద్‌ మహీంద్ర వెల్లడించారు.“ఇటీవల ఆస్ట్రేలియాపై గెలిచిన భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లు ఇప్పుడే తమ కెరీర్‌ను ప్రారంభించారు. వారి కలలకు విశ్వాసాన్ని జత చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమన్న నమ్మకం కలిగించడానికే ఈ బహుమతి’’ అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.

కంపెనీకి భారం కాకుండా తన సొంత ఖర్చు మీద ఈ వాహనాలను ఇస్తున్నట్లు మహీంద్ర తెలిపారు.

రహానెకు ప్రశంసల వెల్లువ

తొలి టెస్టు ఓడిపోయినా, ఆ తర్వాత జట్టు నాయకత్వ బాధ్యతలు తీసుకుని విజయ తీరాలకు చేర్చారని అజింక్య రహానెను పొగుడుతూ బీసీసీఐ ట్వీట్ చేసింది.

ఈ సందర్భంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో జట్టు సభ్యులతో మాట్లాడుతున్న రహానే వీడియోను కూడా బీసీసీఐ షేర్‌ చేసింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున షేర్‌ అవుతోంది.

వీడియోలో జట్టు సభ్యులతో మాట్లాడుతూ కనిపించిన రహానే “ఇది మనకు గొప్ప ఆనందాన్ని కలిగించే క్షణం’’ అని అన్నారు. జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు ఆడితే సరిపోదని, అందరి సహకారంతో ఇలాంటి విజయాన్ని సాధించగలిగామని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

రహానెను కెప్టెన్‌ చేయాలంటూ డిమాండ్‌లు

ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో అడిలైడ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 36 పరుగులకే కుప్పకూలింది. ఇది ఇప్పటి వరకు ఒక ఇన్నింగ్స్‌లో టీమిండియా సాధించిన అతి తక్కువ స్కోరు.

దీని తరువాత మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించింది. సిడ్నీ మ్యాచ్‌డ్రా కాగా బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్‌ మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది.

ఆరంభంలో పేలవంగా ఆడి ఓడిన జట్టు చివరకు వచ్చేసరికి సిరీస్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో రహానె ఆటతీరు, నాయకత్వ సామర్ధ్యంపై చర్చ మొదలైంది. ఈ సిరీస్‌తో యువ ఆటగాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, రిషబ్‌ పంత్‌లు హీరోలుగా మారారు.

కోహ్లీ కెప్టెన్సీకి సవాళ్లు

ఆస్ట్రేలియా సిరీస్ విజయం తరువాత భారత క్రికెట్‌ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ఒత్తిడి పెరిగింది. మొదటి టెస్ట్‌ ఓటమి తర్వాత, కుమార్తె పుట్టడంతో కోహ్లీ భారత్‌కు తిరిగి వచ్చారు. తర్వాత రహానె నాయకత్వంలోని జట్టు బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో గెలిచింది.

రహానె ఆటతీరును క్రికెట్ ప్రపంచంలోని చాలామంది ప్రముఖులు మెచ్చుకున్నారు. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌, భారత మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడి రహానెను ప్రశంసించారు.

“రహానెకు కెప్టెన్సీ ఇచ్చే అంశాన్ని బీసీసీఐ ఖచ్చితంగా పరిశీలిస్తుందని నేను భావిస్తున్నాను” అని వాన్‌ ట్వీట్‌ చేశారు.“విరాట్‌ కోహ్లీ బ్యాట్స్‌మన్‌గా జట్టును బలోపేతం చేయగలడు. రహానేకు అద్భుతమైన వ్యూహం ఉంది'' అన్నారాయన.

రహానే కెప్టెన్సీ భారత మాజీ కెప్టెన్ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీని గుర్తు చేసిందని బిషన్‌ సింగ్‌ బేడి వ్యాఖ్యానించారు.

ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు కెప్టెన్‌గా కోహ్లీ

వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ జట్టు భారత పర్యటనకు వస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ మొదలవుతుంది. తొలి రెండు మ్యాచ్‌లకు టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్‌ బాధ్యతలను కోహ్లీకే అప్పగించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)