You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫూలన్ దేవి: కొందరికి వీరనారి... ఇంకొందరికి కిరాతకురాలు
- రచయిత, చింకీ సిన్హా
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న బంజరు భూమి చంబల్ ప్రాంతం. కొండలు, గుట్టలు, డొంకలు, లోయలతో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఇంకా లొంగదీసుకోలేకపోయింది.
ఇప్పుడు ఇక్కడ బందిపోట్లు లేరు. బందిపోటు రాణిగా పేరుకెక్కిన ఫూలన్ దేవి కూడా లేరు.
అయితే, కింది స్థాయి కులం మహిళపై అత్యాచారం జరిగిందన్న వార్త చర్చనీయమైన ప్రతిసారీ ఫూలన్ దేవి కథ ఇక్కడ పునరుజ్జీవం పోసుకుంటుంది.
హాథ్‌రస్‌లో 19 ఏళ్ల దళిత అమ్మాయిపై ఠాకుర్ వర్గానికి చెందిన కొందరు అత్యాచారం చేసినట్లు కొన్నాళ్ల క్రితం కేసు నమోదైంది. దళితులపై అత్యాచారాలకు వ్యతిరేకంగా అప్పుడు జరిగిన నిరసనల్లో.. ‘‘న్యాయం జరగకపోతే ఫూలన్ మార్గంలో వెళ్లడం కూడా మాకు తెలుసు’’ అంటూ నినాదాలు వినిపించాయి.
వార్తల్లో, సోషల్ మీడియాలో హాథ్‌రస్ హంగామా అంతా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు అవి వేరే అంశాలు చుట్టూ తిరుగుతున్నాయి.
హాథ్‌రస్ కేసు నిందితులు జైల్లో ఉన్నారు. బాధితురాలి కుటుంబాన్ని సీబీఐ విచారిస్తోంది. వారికి సీఆర్‌పీఎఫ్ జవాన్లతో భద్రత కూడా ఏర్పాటు చేశారు. సీబీఐ విచారణ ఎప్పుడు పూర్తవుతుందో, దోషులకు శిక్ష ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు.
హాథ్‌రస్ నుంచి ఐదు గంటల ప్రయాణం చేస్తే బెహ్మాయ్ వస్తుంది. ఫూలన్ దేవి ఠాకుర్ వర్గానికి చెందిన 22 మందిని ఈ ఊర్లోనే చంపినట్లుగా చెబుతుంటారు. ఈ ఆరోపణను ఫూలన్ దేవి మాత్రం అంగీకరించలేదు.
ఠాకుర్ ప్రజలు అత్యధికంగా ఉండే 84 ఊర్ల సమూహంలో బెహ్మాయ్ కూడా ఒకటి. ఈ ఊర్లలో మెజారిటీ వర్గం ఠాకుర్లే. వారు కాకుండా బ్రాహ్మణులు, దళితులు కూడా కనిపిస్తారు.
1981 ఫిబ్రవరి 14న బెహ్మాయ్‌లో ఠాకుర్ వర్గానికి చెందిన 30 మందిని కొందరు ఓ గట్టు మీదకు తీసుకువెళ్లారు. వారిలో 22 మందిని కాల్చి చంపారు.
ఈ ఘటన జరిగినప్పటికి ఫూలన్ వయసు 18 ఏళ్లు.
అంతకు ఏడాది ముందు బెహ్మాయ్‌లోనే ఠాకుర్ వర్గానికి చెందిన కొందరు ఫూలన్‌పై సామూహిక అత్యాచారం చేశారని చెబుతుంటారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఆమె సొంతంగా బందిపోట్ల ముఠాను తయారుచేసుకుందని అంటారు.
నలబై ఏళ్లు అంటే చాలా కాలం. అయినా, ఆ రక్తపాతాన్ని బెహ్మాయ్ ఇంకా మరిచిపోలేదు.
ఫూలన్ ప్రతీకారం తీర్చుకుందని కొందరు కొనియాడుతూ ఉంటారు.
ఇక ఫూలన్ చనిపోయి కూడా 20 ఏళ్లు అవుతోంది.
1981లో హత్యకు గురైనవారిలో 20 మంది బెహ్మాయ్‌కు చెందినవారే. ఇంకో ఇద్దరు రాజ్‌పుర్, సికంద్రా గ్రామాలకు చెందినవారు. బెహ్మాయ్ గ్రామానికి చెందిన ఆ 20 మందికి ఇక్కడో స్మారక ప్రాంతం ఉంది. అక్కడ గోడలపై ఎర్ర రంగులో వారి పేర్లు రాసి ఉన్నాయి.
స్మారక ఫలకంపై 1981 ఫిబ్రవరి 14, సాయంత్రం నాలుగు గంటలకు ఓ బందిపోటు ముఠా నిరాయుధులు, నిర్దోషులు, ఉన్నత వ్యక్తులైన వీరిని చంపింది అని రాసి ఉంది.
ఆ రక్తపాతం జరిగి నాలుగు దశాబ్దాలు గడిచినా, ఆ జ్ఞాపకాలు ఇక్కడివారిలో అలాగే ఉన్నాయి. ఇన్నేళ్ల నుంచీ ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది జనవరిలో ఈ కేసులో కోర్టు తీర్పు రావాల్సింది. కానీ, కేసుకు సంబంధించి ఓ పోలీస్ డైరీ గల్లంతవ్వడంతో ఆలస్యమవుతూ వస్తోంది.
ఫూలన్ దేవిని బెహ్మాయ్ కిరాతకురాలిగా చూస్తుంది. ఆ గ్రామ పెద్ద జైవీర్ సింగ్ హత్యలు జరిగిన ఆ రోజు సాయంత్రం తమ ఇంట్లో లేరు.
‘‘ఫూలన్ తన ముఠాతో అడవుల్లో తిరుగుతుండేది. శ్రీరామ్, లాలా రామ్ (ఫూలన్ ప్రియుడిగా చెప్పే విక్రమ్ మల్లాను హత్య చేసినవాళ్లు) మా ఊరి వాళ్లు కాదు. మాకు పది కిలోమీటర్ల దూరంలోని దమన్‌పుర్ వాళ్లు. బీజేపీ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశించాం. మేం పోరాడుతూనే ఉంటాం. వాళ్లు చేసిందానికి శిక్ష అనుభవించాల్సిందే. ఆ రోజు హత్యలతో వితంతువులైన వాళ్లు, వారి పిల్లలు ప్రతి పండుగకీ ఏడుస్తూనే ఉన్నారు. ఏటా ఫిబ్రవరి 14ను మేం వారిని స్మరించుకునే కార్యక్రమం పెట్టుకుంటున్నాం’’ అని ఆయన చెప్పారు.
ఒకప్పుడు భారత్‌లోని ‘మోస్ట్ వాంటెడ్’ వ్యక్తుల్లో ఫూలన్ దేవి కూడా ఒకరు. ఆమెను పట్టించినవారికి రూ. 7.4 లక్షల రివార్డు ఉండేది.
‘‘అప్పట్లో పోలీసులు ఎవరో, బందిపోట్లు ఎవరో తెలిసేది కాదు. బందిపోట్లు కూడా ఖాకీ దుస్తులే వేసుకునేవారు. నీళ్ల కోసమో, తిండి కోసమో తరచూ గ్రామాలకు వస్తుండేవారు. ఈ ప్రాంతంలోని కొండలు, డొంకలు వారికి దాక్కునేందుకు అత్యంత అనుకూలంగా ఉండేవి’’ అని జైవీర్ సింగ్ వివరించారు.
జలావున్‌లోని ఓ గ్రామంలో ఫూలన్ దేవి ఇంటి ముందు ఉన్న ఇనుప గేటుపై ‘వీర నారి ఫూలన్ దేవి’ అని రాసి ఉంది. ఇక్కడ ఏకలవ్య సేన అనే సంస్థ ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థను ఫూలనే స్థాపించారు.
ఇప్పుడు ఆ ఇంట్లో ఫూలన్ తల్లి మూలా దేవీ ఉంటున్నారు.
పాల రాతితో ఫూలన్ దేవీ విగ్రహాన్ని తయారుచేశారు. ఫూలన్ అనగానే భుజానికి తుపాకీ, నుదుటికి ఎర్రటి బ్యాండ్‌తో ఉన్న రూపమే చాలా మందికి గుర్తుకువస్తుంది. కానీ, ఈ విగ్రహంలో మాత్రం ఆమె చీర కట్టుకుని, రెండు చేతులతో నమస్కారం పెడుతూ కనిపిస్తున్నారు.
నలబై ఏళ్లుగా ఈ గ్రామం ఫూలన్‌ను దేవతలా కొలుస్తోంది. ఈ ఊరి బయట మాత్రం ఆమెను హంతకురాలిగా చూస్తారు.
అటు బెహ్మాయ్‌లో చనిపోయినవారికి స్మారకంగా ఓ క్షేత్రం ఉంటే, ఇటు ఫూలన్ దేవికి స్మారకంగా ఇక్కడ మరో క్షేత్రం ఉంది.
ఈ రెండు ఊళ్ల వాళ్లు ఇప్పటికీ కలుసుకోరు.
ఫూలన్ దేవి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆమె ప్రచార బృందంలో కీలకంగా ఉన్నారు అనిల్ కుమార్.
ఠాకుర్లకు తమపై అక్కసు అని ఆయన అంటున్నారు. ఫూలన్ గురించి ఆయన పాటలు పాడుతారు. ఫూలన్ అరెస్టైన క్రమాన్ని వివరించే పాట కూడా వాటిలో ఉంది.
ఫూలన్ మల్లా కులంలో పుట్టారు. వివాహాల సమయంలో జానపద పాటలు పాడటం వారి సంప్రదాయం.
పండుగల సమయంలో ఫూలన్ పాటలు ఇక్కడ వినిపిస్తుంటాయి. దుర్గా పూజలు జరిగే అక్టోబర్ నెలలో ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఫూలన్ జేబులో ఎప్పుడూ చిన్న దుర్గా మాత విగ్రహం ఉండేదట. ఆమె పోలీసులకు లొంగిపోయినప్పుడు కూడా ఈ విగ్రహం ఉందట.
ఫూలన్‌కు, ఆమె సహచరులకు పేద ప్రజల మద్దతు ఉండేది. ‘పెద్దలను కొట్టి పేదలకు పంచే రాబిన్ హుడ్’ తరహా ఇమేజ్‌ను వాళ్లు సంపాదించుకున్నారు.
‘‘ఊరిలో అమ్మాయిల వివాహాలకు ఫూలన్ వచ్చేవారు. వారికి ఆభరణాలు ఇచ్చేవారు. వారి కుటుంబాలకు డబ్బులు పంచేవారు’’ అని అనిల్ చెప్పారు.
భిండ్ అనే గ్రామంలో ఫూలన్ పోలీసులకు లొంగిపోయారు. అప్పటివరకూ ఫూలన్ ఎలా ఉంటారన్నది ఎక్కువ మందికి తెలియదు. పోలీసుల దగ్గర ఆమె ఫొటో కూడా లేదు.
అప్పట్లో ఆమె లొంగిపోయిన ఘటనను జాతీయ, అంతర్జాతీయ మీడియా విశేషంగా కవర్ చేసింది. అయితే, ఫూలన్ భయంకరంగా ఉంటుందని ఊహించుకున్న విలేఖరులు.. ఆమె అసలు ఆకారాన్ని చూసి ‘అసంతృప్తి’కి గురయ్యారు.
కేసు విచారణ అన్నదే లేకుండా ఫూలన్ 11 ఏళ్లు జైల్లోనే ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయ్యాక, 1994 ఫిబ్రవరిలో ఆమె మీద పెట్టిన కేసులను ఎత్తివేయించారు.
ఆమె విడుదలను ఉన్నత కులాలపై ప్రతీకార చర్యగా అప్పుడు చాలా మంది చూశారు. కింది స్థాయి కులాలవారిపై జరుగుతున్న దాడులకు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిగా ఆమెపై ముద్ర పడింది.
జైలు నుంచి విడుదలైన రెండేళ్కు ఆమె సమాజ్‌వాదీ పార్టీ తరఫున మీర్జాపూర్ లోక్‌సభ స్థానంలో విజయం సాధించారు. మళ్లీ 1999లో రెండో సారి గెలిచారు. అయితే, కొన్ని రోజులకే దిల్లీలోని తన నివాసం బయటే ఫూలన్ హత్యకు గురయ్యారు. అప్పటికి ఆమె వయసు 38 ఏళ్లు.
బెహ్మాయ్‌లో జరిగిన రక్తపాతంలో శ్రీదేవి అనే మహిళ భర్త, మామ కూడా చనిపోయారు. అప్పటికి ఆమె వయసు 24 ఏళ్లు. ఆమెకు నలుగురు కూతుర్లు.
‘‘వాళ్లను ఆ రోజు ఎక్కడికి తీసుకువెళ్లారో మాకు తెలియలేదు. సాయంత్రం వారి శవాలు చూసేందుకు వెళ్లాం. మాకు ఏం న్యాయం చేస్తారు? ఆమె చనిపోయింది’’ అని శ్రీదేవి అన్నారు.
తరతరాలుగా కులాల మధ్య సాగుతున్న ఈ సంఘర్షణలో ఫూలన్ జీవితం లాంటి కథలు అనేకం కనిపిస్తాయి.
నెల క్రితం హాథ్‌రస్‌లో నమోదైన అత్యాచారం కేసులో నిందితులు ఠాకుర్లు. బాధితురాలు దళిత యువతి.
చనిపోయిన ఆ యువతి వ్యక్తిత్వాన్నే కొందరు ప్రశ్నించారు. ఆమెది పరువు హత్య కావొచ్చంటూ ఆమె కుటుంబంపైనా ఆరోపణలు మోపారు.
గత ఏడాది అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సగటున రోజూ పది మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరిగాయి. మహిళలపై హింస, లైంగిక దాడుల కేసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోనే అత్యధికంగా ఉన్నాయి.
నిజానికి ఫూలన్‌ది ఓబీసీ వర్గం. అయినా, ఠాకుర్ల అరాచకాలపై కింది కులాల మహిళల పోరాటానికి ఆమె ప్రతీకగా మారారు.
ఫూలన్ గ్రామం ఇప్పటికీ విసిరేసినట్లుగా, అభివృద్ధికి దూరంగా ఉంది. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చాలా కాలంగా గ్రామస్థులు డిమాండు చేస్తున్నా, ఫలితం లేదు.
ఈ గ్రామంలో దాదాపు వంద కుటుంబాలు ఉన్నాయి.
ఫూలన్‌కు నలుగురు అక్కాచెల్లెళ్లు. ఫూలన్ అక్క రుక్మిణీ దేవీ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు.
ఇవి కూడాచదవండి:
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- కరోనావైరస్ నుంచి 90 శాతం రక్షణ కల్పించే తొలి వ్యాక్సీన్ ఇదే
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- ఆకాశంలోని విమానాలను నేలకు దించిన మనిషి.. కెప్టెన్ జీఆర్ గోపీనాథ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)