కేంద్రంపై హైదరాబాద్ నుంచే యుద్ధం: కేసీఆర్ - Press Review

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గత ఆరున్నరేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని, తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించినట్లు ఈనాడు తెలిపింది.

బుధవారం తెలంగాణ భవన్‌లో తెరాస పార్లమెంటరీ, శాసనసభా పక్షం, జీహెచ్‌ఎంసీ ఇన్‌ఛార్జుల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు.

భాజపా కాంగ్రెస్‌ దొందూ దొందేనని, బడేభాయ్‌ వెంట చోటే భాయ్‌ అన్నట్లు దేశాన్ని సరైన దిశ చూపెట్టడంలో విఫలం అయ్యాయన్నారు. ఆ రెండు మూస పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలని, దేశం నూతన మార్గం పట్టాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరాటానికి తెరాస సన్నద్ధమవుతోందని తెలిపారు. ప్రజలను చైతన్యపరచేందుకు హైదరాబాద్‌ నుంచే యుద్ధం ప్రకటిస్తామన్నారు.

దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపై నిలిపేందుకు తెరాస ప్రయత్నాలు చేస్తోందని కేసీఆర్‌ చెప్పారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, డీఎంకే నేత స్టాలిన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్‌ యాదవ్‌, శరద్‌పవార్‌, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, కుమారస్వామి, సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడానని తెలిపారు.

ప్రధాన ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు. వారితో డిసెంబరు రెండోవారంలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తామని దేశవ్యాప్త ఉద్యమం గురించి చర్చిస్తామన్నారు.

కేంద్ర విధానాలతో నష్టపోతున్న రైతులు, కార్మికులు, పేదల పక్షాన నిలుస్తామన్నారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు భిన్నమైన ట్రెండ్‌ నడుస్తున్నదని, ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం భాజపా చేస్తోందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్: కోవిడ్-19‌ సెకండ్‌ వేవ్‌ వస్తోందని జగన్ హెచ్చరికలు

కోవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ వస్తోందని, ఇప్పటికే పలు దేశాల్లో ఇది కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించినట్లు సాక్షి దినపత్రిక తెలిపింది.

స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు ఎస్‌పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కోవిడ్‌–19 నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏమన్నారంటే..

  • కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో యూరప్‌ మొత్తం వణుకుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాపిస్తోంది. ఫ్రాన్స్, లండన్‌లో షట్‌డౌన్‌. అమెరికా కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది. అక్కడ మొదలు కాగానే ఇక్కడా వస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
  • స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి.
  • ప్రస్తుతానికి కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు తగ్గినా, సెకండ్‌ వేవ్‌ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
  • రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 75 వేల పరీక్షలు చేస్తున్నాం. కొన్నిరోజుల క్రితమే 90 లక్షల మార్కును దాటేశాం. ప్రతి 10 లక్షల మంది జనాభాకు 1.7 లక్షలకు పైగా పరీక్షలు చేస్తున్నాం. పాజిటివిటీ రేటు తగ్గింది. కోవిడ్‌ నివారణకు చేసిన కృషికి కలెక్టర్లకు అభినందనలు.
  • నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
  • వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ

విచక్షణారహిత ప్లాస్మా థెరపీ వద్దు-ఐసీఎంఆర్

కరోనా రోగులకు కన్వలెసెంట్‌ ప్లాస్మా థెరపీ(సీపీటీ)ని విచక్షణారహితంగా వాడటం మంచిది కాదని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సూచించినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది.

ప్లాస్మా సేకరించాలంటే దాతలో కొవిడ్‌ను అడ్డుకునే యాంటీబాడీలు పుష్కలంగా ఉండాలని ఐసీఎంఆర్‌ వివరించింది. అప్పుడే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని పేర్కొంది.

దేశవ్యాప్తంగా 39 ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీ ఉపయోగంపై ఐసీఎంఆర్‌ ఇటీవల ట్రయల్స్‌ నిర్వహించింది. ప్రయోగంలో రోగులందరికీ కరోనా వైరస్‌ తీవ్రత మధ్యస్థంగా ఉండగా.. అది మరింత ఉధృతం కాకుండా ప్లాస్మా థెరపీ ఆపలేకపోయిందని ఈ అధ్యయనంలో తేలింది.

ఇదే తరహాలో చైనా, నెదర్లాండ్స్‌లో పరిశోధకులు చేసిన అధ్యయనాల్లోనూ ప్లాస్మా థెరపీ ఉపయోగాలు పెద్దగా కనిపించకపోవడం గమనార్హం.

‘‘విచక్షణారహితంగా ప్లాస్మా థెరపీని వాడటం ఆమోదయోగ్యం కాదు. థెరపీ నిర్వహించాలంటే దాత ప్లాస్మాలో కొవిడ్‌ను ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన యాంటీబాడీలు పుష్కలంగా ఉండాలి’’ అని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది.

తెలంగాణలో ప్రైవేటులో కరోనా టెస్టు ధర 850

తెలంగాణలో ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ధరలను రాష్ట్ర ప్రభు త్వం తగ్గించిందని నమస్తే తెలంగాణ దినపత్రిక తెలిపింది.

ఇప్పటివరకు ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు ప్రైవే టు ల్యాబ్స్‌ రూ.2,200 వసూలు చేస్తున్నాయి. ఇంటికి వచ్చి శాంపిల్‌ సేకరించాలంటే రూ.2,800 వసూలు చేస్తున్నాయి. అయితే ఈ రెండు రకాల ఫీజులను వరుసగా రూ.850, రూ.1,200లుగా నిర్ణయిస్త్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ప్రైవేటు ల్యాబ్స్‌లో పరీక్షల కోసం ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రతిరోజు 50 వేలవరకు ఆర్టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నది.

ఇప్పటివరకు రాష్ట్రంలో 50 లక్షల పరీక్షలను ఉచితంగానే నిర్వహించి కరోనా పరీక్షలను గల్లీ వరకు చేరువ చేసింది. టెస్టు కిట్ల ధరలు అందుబాటులోకి రావడంతో నిర్ధారణ పరీక్షల ధరలు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

అయితే ప్రజలు డబ్బు వృథా చేసుకోకుండా ప్రభుత్వ ల్యాబ్‌లలోనే ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలని, ఎలాంటి లక్షణాలు ఉన్నా సమీపంలోని ప్రభుత్వ దవాఖానలకు వెళ్లాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

ఇవి కూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)