బీటిల్స్ మ్యూజిక్ బ్యాండ్ భారత్‌లో ఓ గుండె పగిలిన ప్రేమికుడికి ఎదురుపడినప్పుడు...

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఓ కెనడా యాత్రికుడు 50 ఏళ్ల క్రితం భారత్‌లోని ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో అనుకోకుండా సంగీత కళాకారులకు తారసపడ్డారు. ఆ తర్వాత ఆయన జీవితాన్ని మలుపుతిప్పిన ఘటనలతో ఓ డాక్యుమెంటరీని తీశారు. ఇంతకీ అప్పుడు ఏమైంది? ఆ కళాకారులు ఎవరు? వారిని ఆయన ఎలా కలిశారు?

1968లో 23 ఏళ్ల కెనడా పౌరుడు భారత్‌లోని ఆధ్యాత్మిక నగరం రిషీకేశ్‌లోని ఓ ఆశ్రమానికి ధ్యానం చేసేందుకు వచ్చారు. కానీ ఆయన్ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఎందుకంటే సంగీత కళాకారుల బృందం ద బీటిల్స్ అక్కడ ఉంటున్నారని, వెళ్లిపొమ్మని చెప్పారు. పాల్ సాల్ట్జ్‌మన్ భారత్‌లో పర్యటిస్తున్నప్పుడు మాంట్రియాల్‌లో ఉన్న ఆయన ప్రేయసి గుడ్‌బై చెప్పింది.

దీంతో ఆయనకు గుండె బద్ధలైంది. రైలు, బోటు, ట్యాక్సీలను పట్టుకొని ఆయన మహర్షి మహేశ్ యోగి ఆశ్రమానికి వెళ్లారు. హిప్పీల కాలంలో తనకు తానే గురువునని ప్రకటించుకున్న వారిలో మహేశ్ యోగి ప్రముఖుడు. తన గుండెకు అయిన గాయాన్ని ధ్యానంతో నయం చేసుకుందామని సాల్ట్జ్‌మన్ భావించారు.

చాలా సేపు బ్రతిమాలాక, ఆశ్రమంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి సాల్ట్జ్‌మన్‌ను లోపలకు అనుమతించారు.

వెంటనే ఆయన అక్కడ గంటసేపు ధ్యానం చేశారు. దీంతో ఆయనకు కొంత ప్రశాంతంగా అనిపించింది. ''కాసేపు తర్వాత, అక్కడి ప్రాంతాన్ని చూసేందుకు నేను ఆశ్రమం నుంచి బయటకు వచ్చాను''అని ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.

అక్కడే ఆయన సుప్రసిద్ధ బీటిల్స్‌ బ్యాండ్‌ను మొదటిసారి చూశారు.

సంప్రదాయ భారతీయ దుస్తులు వేసుకొని ఓ చిన్న కొండ పక్కన పొడవైన టేబుల్‌ చుట్టూ జాన్ లెనెన్, పాల్ మెక్‌కార్ట్నీ, రింగో స్టార్, జార్జ్ హ్యారిసన్ కూర్చున్నారు. వారితో వారి భార్యలు, స్నేహితురాళ్ళు కూడా ఉన్నారు. నటీమణి మియా ఫారో, బీచ్ బాయ్స్ రాక్ బ్యాండ్ కో-ఫౌండర్ మైక్ లవ్, జానపద గాయకుడు డోనోవన్ కూడా అక్కడే ఉన్నారు. 18 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వారు మూడు నెలల బసకు ప్రణాళికలు రచిస్తున్నారు.

నేను కూడా చేరొచ్చా అని సాల్ట్జ్‌మన్ అడగ్గా.. ఒక కుర్చీ లాగుతూ కూర్చోమని మెక్‌కార్ట్నీ చెప్పారు.

''నేను కూర్చున్నాక.. నా మదిలో ఓ మాట వినిపించింది. హేయ్, వీరు ద బీటిల్స్''అని సాల్ట్జ్‌మన్ వివరించారు. ఇప్పుడు ఆయన వయసు 78 ఏళ్లు. ఆయన ప్రసిద్ధ ఎమ్మీ అవార్డు సాధించిన దర్శకుడు.

నాలుగేళ్ల ముందు, 1964లో టొరొంటోలోని మేపెల్ లీఫ్ గార్డెన్‌లో 18,000 మంది ఉర్రూతలూగిపోతుంటే ద బీటిల్స్‌ను చూసేందుకు ఆయన వెళ్లారు. అయితే, ఆనాడు ఏం జరిగిందో ఆయనకు అంతకంటే ఏమీ గుర్తులేదు.

ఇప్పుడు, ఆయన షాక్‌లో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ప్రముఖ బ్యాండ్ ఆయన ముందుంది.

1967నాటి ఐకానిక్ ఆల్బమ్ సార్జెంట్ పెప్పర్స్ లోన్లీ హార్ట్స్ క్లబ్ బ్యాండ్ విజయాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. తర్వాత అల్బమ్ వైట్ కోసం పాటలు రాయడం మొదలుపెట్టారు.

వారితో కలవడానికి సాల్ట్జ్‌మన్‌కు ఎక్కువ సమయం పట్టలేదు.

''మీరు అమెరికనా?''అని సాల్ట్జ్‌మన్‌ను లెనెన్ అడిగారు.

''లేదు, నేను కెనెడియన్''అని సాల్ట్జ్‌మన్‌ చెప్పారు.

''ఓహ్.. ఈయన వలస పాలన కాలనీల నుంచి వచ్చారు''అని లెనెన్ చమత్కరించారు.

వెంటనే టేబుల్ చుట్టూ అందరూ నవ్వారు.

''అయితే, మీరింకా క్వీన్‌ను ఆరాధిస్తున్నారా''అంటూ మరో జోక్‌ను లెనెన్ వేశారు.

నేను వ్యక్తిగతంగా అయితే ఆరాధించనని సాల్ట్జ్‌మన్ అన్నారు.

సంభాషణలోకి మెక్ కార్ట్నీ, స్టార్ కూడా చేరారు.

''మరి మీ డబ్బులపై రాణి బొమ్మ ఉంటుందిగా''

''మా డబ్బుపై మాత్రమే రాణి ఉంటుంది. నివసించేది మీతోనేగా''అని సాల్ట్జ్‌మన్ బదులు ఇచ్చారు.

ఆ తర్వాత వారం రోజులపాటు గంగా నది పరీవాహక ప్రాంతంలో వారు బస చేశారు. ధ్యానం, పాటలు, శాకాహారం, చర్చలతో గడిపారు.

ఆ నలుగురిని కలిసిన 50ఏళ్ల తర్వాత సాల్ట్జ్‌మన్ 79 నిమిషాల డాక్యుమెంటరీని షూట్ చేశారు. 'మీటింగ్ ద బీటిల్స్ ఇన్ ఇండియా' అని దానికి పేరు పెట్టారు. దీనికి మోర్గన్ ఫ్రీమన్ గాత్రం అందించారు. డేవిడ్ లింగ్ దీన్ని నిర్మించారు. ఈ డాక్యుమెంటరీలో సాల్ట్జ్‌మన్ తీసిన అరుదైన చిత్రాలు కనిపిస్తాయి. కెరియర్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేకుండా బ్యాండ్ విశ్రాంతి తీసుకున్నప్పుడు తీసిన చిత్రాలివి.

''అదొక చాలా అద్భుతమైన సమావేశం. వారి సంగీతం నాకు చాలా నచ్చింది. కానీ సెలబ్రిటీల్లా కాకుండా.. సాధారణ వ్యక్తుల్లా.. ఎలాంటి గర్వం లేకుండా మాట్లాడారు''అని సాల్ట్జ్‌మన్ వివరించారు.

తన చౌకబారు పెంటాక్స్ కెమెరాతో మూడు సందర్భాల్లో సాల్ట్జ్‌మన్ ఫోటోలు తీశారు. ఆయన 54 ఫోటోల్లో 30 ఫోటోల్లో ఎవరో ఒక బీటిల్ కనిపిస్తారు.

ఆ తర్వాత ఆయన ఇంటికి వచ్చేశారు. ఆ కలర్ ఫోటోలను అట్టపెట్టెలో పెట్టేసి బేస్‌మెంట్‌లోనే 32ఏళ్లు ఉంచేశారు. ఆయన కుమార్తె వీటిని గుర్తించడంతో మళ్లీ ఇవి బయటపడ్డాయి. వీటిలో కొన్ని ఫోటోలను ఉపయోగించి 2005లో ఆయన ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు.

ఆశ్రమంలో రింగో స్టార్ తన 16 ఎంఎం కెమెరాతోపాటు 100ఎఫ్ ఫిల్మ్‌ను కూడా సాల్ట్జ్‌మన్‌కు ఇచ్చారు. దీంతో ఆయన బ్యాండ్‌కు సంబంధించి కొంత ఫుటేజీని తీసుకొని తనతోనే ఉంచుకున్నారు. ''ఇది చాలా విలువైనది''అని ఆయనతో సాల్ట్జ్‌మన్ చెప్పారు. దీన్ని ఆయన ఇంటికి తీసుకెళ్లారు. అయితే, ఇది ఎక్కడో పోయింది.

''ఆ ఫోటోలు, దృశ్యాలతో ఏం చేయాలో నాకు పెద్దగా అర్థంకాలేదు. బీటిల్స్‌ను ఓ ప్రాజెక్టులో భాగం చేయాలని నేను ప్రయత్నించాను. కానీ వారు స్పందించలేదు''అని సాల్ట్జ్‌మన్ వివరించారు.

ఇక్కడి ఆశ్రమంలోనే కోతులు, పక్షుల కిలకిలల నడుమ వైట్ ఆల్బమ్‌ను తీసుకొచ్చారు. అయితే దీనికి కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

దాదాపు 30 నుంచి 48 పాటలను బ్యాండ్ రాసిందని సాల్ట్జ్‌మన్ గుర్తుచేసుకున్నారు. వీటిలో చాలా వాటికి కొత్త ఆల్బమ్‌లలో చోటు దక్కింది. బ్యాక్ ఇన్ ద యూఎస్‌ఎస్‌ఆర్, హ్యాపీనెస్ ఈస్ ఏ వార్మ్ గన్, డియర్ ప్రూడెన్స్, ఓబ్ లా దీ, ఒబ్ లా దా, సెక్సీ సాడీ, హెల్టెర్ స్కెల్టర్, రివొల్యూషన్ తదితర ఆల్బమ్‌లలో ఆ పాటలు వచ్చాయి.

ఓబ్ లా దీ, ఒబ్ లా దా ఆల్బమ్‌ను.. ఆశ్రమం దగ్గరే షూట్ చేశారు.

ఒకరోజు అటువైపు వెళ్తున్నప్పుడు లెనెన్, మెక్‌కాట్నీ మెట్లపై కూర్చొని ట్యూన్‌ను ఆలపిస్తుండగా చూశానని సాల్ట్జ్‌మన్ గుర్తుచేసుకున్నారు. వెంటనే ఆయన వెనక్కి వెళ్లి వారిద్దరి ఫోటోలను తీసుకున్నారు.

ఓవర్ అండ్ ఓవర్ ఎగైన్, గోయింగ్ ఫాస్ట్ అండ్ స్లో, హ్యావింగ్ ఫన్ పాటలో మొదటి రెండు లైన్లను వారిద్దరూ పాడుతుండగా విన్నట్లు సాల్ట్జ్‌మన్ వివరించారు.

భారత్‌లో బీటిల్స్ కొన్ని వారాలపాటు ఉన్నారు. అయితే, వారిలో రింగో త్వరగా వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆ ఆశ్రమానికి వారి అభిమానులు వస్తుంటారు.

వారిని కలవడాన్ని తన జీవితంలో కీలక మలుపుగా సాల్ట్జ్‌మన్ అభివర్ణించారు. అప్పటి సమయాన్ని ఛాయా చిత్రాలు, ఫొటోలు, ఆశ్రమం ఫుటేజీ, ఇంటర్వ్యూలను డాక్యుమెంటరీలో ఆయన చూపించారు.

''లెనెన్ చాలా సరదాగా ఉంటారు. కొంచెం ఆట పట్టిస్తారు కూడా. స్టార్ చాలా ప్రశాంతంగా ఉంటారు. జార్జ్ కూడా అంతే. చాలా తక్కువగా మాట్లాడేవారు. పాల్.. చాలా స్నేహంగా ఉంటారు''

''వారితో ఎనిమిది రోజులే గడిపాను. కానీ నాపై అవి ఇంద్రజాలంలా పనిచేశాయి.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)