ప్రణబ్ ముఖర్జీ: ఆయనను వరించని ఒకే ఒక అత్యున్నత పదవి ప్రధానమంత్రి పదవి

    • రచయిత, జుబేర్‌ అహ్మద్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత రాజకీయాలలో ప్రణబ్‌ ముఖర్జీలాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ తరం యువ నాయకుల్లో చాలామంది ఆయన స్ఫూర్తిగా రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటారనడంలో సందేహం లేదు.

మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్ర చికిత్స కోసం వెళ్లిన ప్రణబ్‌ ముఖర్జీ, టెస్టుల్లో కోవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలింది. తనకు వైరస్‌ సోకిందన్న విషయాన్ని ఆపరేషన్‌కు వెళ్లే ముందు ఆయన స్వయంగా ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. గత వారం రోజులుగా తనను కలిసినవారు ఐసోలేషన్‌కు వెళ్లాలని సూచించారు.

ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అధిరోహించని ఎత్తులు లేవు. 2012-2017 మధ్య కాలంలో ఆయన భారత రాష్ట్రపతిగా పని చేశారు. అంతేకాదు ఆయన ప్రతిభ ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. మంచి రాజకీయ నాయకుడే కాదు, ప్రణబ్‌ గొప్ప ఆర్ధికవేత్త కూడా.

భారతదేశానికి రక్షణమంత్రిగా, ఆర్ధికమంత్రిగానూ ఆయన పనిచేశారు. అంతకు ముందు తన ఉద్యోగ జీవితాన్ని ఉపాధ్యాయుడిగా ప్రారంభించి, తర్వాత జర్నలిజంలో కొన్నాళ్లు పనిచేశారు.

అనేక భారతీయ బ్యాంకుల కమిటీలకే కాదు, ప్రపంచ బ్యాంకు బోర్డులో కూడా సభ్యుడిగా సేవలందించారు. లోక్‌సభ స్పీకర్‌ పదవితోపాటు, పలు ప్రభుత్వ కమిటీలకు చైర్మన్‌గా పని చేశారు.

ప్రధాని కాలేకపోవడంపై అసంతృప్తి

1984-2004 వరకు ఎన్నిసార్లు ఆశించినా ఆయనను వరించని ఒకే ఒక పదవి ప్రధానమంత్రి పదవి.

ఇందిరాగాంధీ అనుయాయుడిగా పేరున్న ప్రణబ్‌ ముఖర్జీ సహజంగానే ఆ పదవిని ఎప్పటికైనా పొందుతారని కాంగ్రెస్ పార్టీలో చాలామంది భావించారు. కానీ బీజేపీలో ఎల్‌.కె.అడ్వాణీలా ఆయన కూడా ప్రధానమంత్రి పదవిని అందుకోలేకపోయారు.

మా నాన్న ప్రధాని కాలేకపోయినందుకు బాధపడేవారని ఓ సందర్భంలో ప్రణబ్‌ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు.

కానీ పార్టీ సీనియర్‌ నేతగా ఆయన తన అసంతృప్తిని ఎప్పుడూ బయటపెట్టలేదని ఆమె చెప్పారు.

ఇక 2012లో రాష్ట్రపతి అయ్యాక ఇక ప్రధాని పదవి గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేకపోయింది.

కాంగ్రెస్‌ పార్టీలోని వివిధ వర్గాలు ఆయన ప్రధానమంత్రి అభ్యర్ధిత్వంపై విముఖంగా ఉండటమే కాక, గాంధీ కుటుంబానికి విధేయుడు కాకపోవడం కూడా ఆయనకు ప్రధాన అనర్హతగా మారిందని అంటారు.

గాంధీ కుటుంబానికి విధేయుడు కాకపోవడం వల్లే ఆయనకు కొన్ని పదవులు అందలేదని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఆయనకు ఎన్డీఏ ప్రభుత్వం భారత రత్న ప్రకటించిందని చెబుతారు.

ప్రణబ్‌కు కాంగ్రెస్ ఇవ్వని గౌరవం బీజేపీ ఇచ్చిందా?

ఏడాది కిందట ప్రణబ్ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.

కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వని గౌరవం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇచ్చాయని నిరూపించేందుకు ఈ ఘటన ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషణలు సాగాయి.

కానీ ఆయన నిర్ణయాన్ని కూతురు శర్మిష్ఠ వ్యతిరేకించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ వేదికపై ప్రసంగం

అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ వేదిక నుంచి తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చారు ప్రణబ్‌. 2018 జూన్‌ 7న, నాగ్‌పూర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ వేదిక నుంచి ప్రణబ్‌ ఇచ్చిన సందేశం మరపురానిది.

జాతి, జాతీయత, దేశభక్తి అనే అంశాలపై ఆయన తన భావాలను వివరించారు. వేదిక ఏదైనా తన సిద్ధాంతం మారదని ఆయన నిరూపించారు.

"భారతదేశంలో జాతీయత అనేది భాష, మతం ఆధారంగా నిర్ధారించం. మనం వసుధైక కుటుంబం అన్న సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాం" అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు''

"దేశంలోని ప్రజలు 122 భాషలు, 1600 మాండలికాలు మాట్లాడతారు. ఏడు ప్రధాన మతాలను అనుసరించే ప్రజలు ఒకే రాజ్యంగం, ఒకే జెండా, ఒకే జాతీయులుగా మెలగుతారు'' అని ఆయన అన్నారు.

"మనకు ఇష్టమున్నా లేకపోయినా, దేశంలోని సైద్ధాంతిక వైవిధ్యాన్ని అణచివేయాలని భావించడం సరికాదు. నా 50ఏళ్ల రాజకీయ జీవిత అనుభవం నుంచి చెబుతున్నా. బహుళత్వం, భాషావైవిధ్యం, పరమత సహనం అనేవి మన దేశానికి ఆత్మ" అన్నారు ప్రణబ్‌ ముఖర్జీ.

వైవిధ్యం మన దేశానికి అసలైన గుర్తింపని ఆయన నొక్కి చెప్పారు.

" ద్వేషం, అసహనం దేశానికి ప్రమాదకారులు. జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పినట్లు భారతదేశం అనేక వైవిధ్యాల సమ్మేళనం. భారతీయ సంస్కృతిలో అందరికీ చోటుంది. కులం, మతం, ప్రాంతం, జాతి, భాషల పేరుతో వివక్ష సరికాదు'' అని తేల్చి చెప్పారు ప్రణబ్‌.

రాజకీయ ప్రస్థానం

1935 డిసెంబర్‌ 11న అప్పటి బెంగాల్‌ రాష్ట్రం ( ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌)లోని మిరాఠీ గ్రామంలో ప్రణబ్‌ ముఖర్జీ జన్మించారు.

ఆయన తండ్రి కమద్‌ కింకర్‌ ముఖోపాధ్యాయ్‌ స్వాతంత్ర్య సమరయోధులు. స్వరాజ్య పోరాటంలో పాల్గొని కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు.

కోల్‌కతా యూనివర్సిటీ నుంచి చరిత్రలో మాస్టర్‌ డిగ్రీ, రాజకీయ శాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ పట్టా పొందరు ప్రణబ్‌. కాలేజీలో లెక్చరర్‌గా, జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించారు.

1969లో తన 34వ ఏట ప్రణబ్‌ ముఖర్జీ రాజ్యసభ సభ్యుడయ్యారు.

ఇందిరాగాంధీ నేతృత్వంలో రాజకీయాలలో అడుగుపెట్టిన ప్రణబ్‌ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

అయితే ఇందిరా గాంధీ హత్య అనంతరం రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యాక ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.

తన రాజకీయ ప్రస్థానం గురించి ఆయన రాసుకున్న "ది టర్బులెంట్ ఇయర్స్‌ 1980-1996'' అన్న పుస్తకంలో ఆయన " నేను రాజీవ్‌ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. రాజీవ్‌ నన్ను క్యాబినెట్ నుంచి పక్కనపెడతారని అనుకోలేదు. అలాంటి ఊహాగానాలు కూడా వినపడలేదు. కానీ నాకు మంత్రి పదవి రాలేదని విని షాకయ్యాను. నమ్మలేక పోయాను'' అని రాసుకున్నారు.

కాంగ్రెస్ నుంచి బహిష్కరణ

ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరణ వేటుపడిన తర్వాత ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ'' అనే మేగజైన్‌ కోసం ప్రీతిష్‌ నంది అనే రిపోర్టర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడంపై అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసి, ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది.

"ఆయన(రాజీవ్‌గాంధీ) కూడా నాలాగే పొరపాటు చేశారు. కొందరు నాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా ఆయన్ను ప్రోత్సహించారు. నేను వారిని అడ్డుకోలేదు. ఆయన వారి మాటలకు ప్రభావితుడయ్యారు. నా మాటలు మాత్రం ఎవరూ వినిపించుకోలేదు. నేను నా అసంతృప్తిని దాచుకోలేకపోయా'' అని తన పుస్తకంలో రాసుకున్నారు.

1988లో తిరిగి పార్టీలోకి వచ్చినా, 1991లో కాంగ్రెస్‌ ఎన్నికల్లో గెలిచి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఆయనకు మంచి రోజులు మొదలయ్యాయి.

2004లో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. సోనియాగాంధీ తాను ప్రధానమంత్రి కాబోవడంలేదని స్పష్టంగా చెప్పారు. ఆ సమయంలో ప్రణబ్‌ ముఖర్జీ పేరు చర్చకు వచ్చింది.

"సోనియాగాంధీ విముఖత వ్యక్తం చేయడంతో ఇక నేనే ప్రధానమంత్రి అభ్యర్ధినని చాలామంది అనుకున్నారు'' అని తన పుస్తకం "ది కొయిలేషన్ యియర్స్‌ 1995-2012"లో ప్రణబ్ రాశారు.

కానీ ప్రణబ్ ప్రధాని కాలేదు. కానీ ఆర్ధికమంత్రిగా, రక్షణమంత్రి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సన్నిహితంగా పని చేశారు. "మిస్టర్‌ డిపెండబుల్‌''గా ఆయన ప్రభుత్వంలో తన స్థానాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఇదే విషయాన్ని తన పుస్తకంలో కూడా రాసుకున్నారు ప్రణబ్.

రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక 2014లో వచ్చిన మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతో కూడా ఆయన సత్సంబంధాలు కొనసాగించారు.

తన తుదిశ్వాస వరకు ప్రణబ్‌ ముఖర్జీ నిఖార్సయిన ప్రజాస్వామిక వాదిగానే జీవించారు. సిద్ధాంతాల మీద కాకుండా, అవసరాలు, పదవుల ఆధారంగా రాజకీయాలు నడుస్తున్న నేటి కాలంలో సైద్ధాంతిక నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా ప్రణబ్‌ ముఖర్జీ చరిత్రలో మిగిలి పోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)