కరోనావైరస్: 'ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధం కాలేదు' -జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఆర్థికవేత్తతో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ

స్టీవ్ హాంకీ అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో అప్లయిడ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్. అంతేకాదు, జాన్ హాప్కిన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్స్‌, గ్లోబల్ హెల్త్ అండ్ బిజినెస్ ఎంటర్‌ప్రైజ్ స్టడీస్‌ల వ్యవస్థాపకుడు, సహ డైరెక్టర్ కూడా. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తల్లో ఆయన ఒకరు.

భారత్‌తో పాటు, దక్షిణ ఆసియాలోని సమస్యలపై 77 ఏళ్ల హాంకే పరిశీలనలు చేస్తున్నారు. బీబీసీ ప్రతినిధి జుబైర్ అహ్మద్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన, భారత్‌లో లాక్‌డౌన్, నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల ప్రభావం వంటి అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

కరోనావైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ ముందస్తుగా సిద్ధం కాలేదని ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ అంటున్నారు.

“ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం కాలేదు. ఈ దేశంలో కరోనా నిర్ధరణ పరీక్షలకు, రోగులకు చికిత్స అందించేందుకు సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి” అని బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

దేశంలో లాక్‌డౌన్ విధించిన తీరును కూడా ఆయన విమర్శిస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉంది. కొన్ని అత్యవసర, నిత్యవసర సేవలు మాత్రమే పనిచేస్తున్నాయి.

సంపూర్ణ లాక్‌డౌన్ పరిష్కారం కాదు

మోదీ తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ మొదట సమర్థించినట్లు అనిపించింది. కానీ, పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించడానికి తాను అనుకూలం కాదని ఆయన అంటున్నారు.

"మీకు స్పష్టత కోసం చెబుతున్నాను. ఎప్పుడూ సంపూర్ణ లాక్‌డౌన్‌ను నేను ఎప్పుడూ సమర్థించలేదు. దక్షిణ కొరియా, స్వీడన్, యూఏఈల మాదిరిగా స్మార్ట్ గా, స్పష్టమైన లక్ష్యంతో కూడిన విధానాలకు నేను అనుకూలం. కాబట్టి, క్రీడా కార్యక్రమాలను, మతపరమైన సమావేశాలను రద్దు చేయడాన్ని సమర్థించాను” అని ఆయన చెప్పారు.

"నరేంద్ర మోదీ విధించిన లాక్‌డౌన్ వల్ల సమస్య ఏమిటంటే... ఇది ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రకటించిన లాక్‌డౌన్. అసలు, "ప్రణాళిక" అనే పదానికి అర్ధం ఏమిటో మోదీకి తెలుసని నేను అనుకోవట్లేదు" అని స్టీవ్ హాంకీ వ్యాఖ్యానించారు.

ప్రధాని పిలుపు మేరకు మార్చి 22న దేశవ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూ పాటించారు. మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. లాక్‌డౌన్‌కు సిద్ధమయ్యేందుకు ప్రజలకు ఇచ్చిన సమయం కేవలం నాలుగు గంటలు. తర్వాత ఆ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు.

దేశంలో లాక్‌డౌన్ అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరిగింది? దాని అమలు కోసం ఎలాంటి ప్రణాళికలు చేశారు? అనే విషయాలపై కొంతమంది మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

భారత్‌లో మొట్టమొదటి కరోనావైరస్ కేసు జనవరి 30న కేరళలో నమోదైంది. కానీ, ఫిబ్రవరి 24న అహ్మదాబాద్‌లోని భారీ స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ స్వాగతం పలికినప్పుడు దేశంలో పండుగ వాతావరణం కనిపించింది. అప్పటికే సింగపూర్, ఇటలీ, జపాన్, చైనా తదితర దేశాలలో పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేశారు.

పేదలకే ఎక్కువ కష్టాలు

లాక్‌డౌన్ వల్ల పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ అన్నారు.

"మోదీ ముందస్తుగా సంసిద్ధం కాలేదు. దేశంలో సదుపాయాలు సరిగా లేవు. భారీ సుత్తితో మోదినట్లుగా ప్రధాని చేసిన లాక్‌డౌన్ ప్రకటన, పేద ప్రజల్లో భయాందోళనలు పెంచింది. 81 శాతం మంది భారతీయులు అసంఘటిత రంగంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో అంతమంది శ్రామికులు ఆధారపడటానికి కారణం పనికిరాని, అణచివేత ధోరణితో కూడిన ప్రభుత్వ నిబంధనలు, బలహీనమైన చట్టాలే” అని ఆయన వివరించారు.

మరి, ఆ శ్రామిక శక్తిని సంఘటిత రంగంలోకి తీసుకురావడానికి ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ ఇచ్చే సలహా ఏంటి? "ఎక్కువ మందిని సంఘటిత రంగంలోకి తీసుకొచ్చేందుకు ఉన్న మార్గం ఆర్థిక వ్యవస్థను సంస్కరించడం, చట్టాలను అమలు చేయడం, అవినీతి లేని పరిపాలన, న్యాయ వ్యవస్థలను సంస్కరించడం లాంటి పనులు చేయడమే. అయితే, నోట్ల రద్దు లాంటి నిర్ణయాల ద్వారా శ్రామిక శక్తిని ఆధునిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాలేరు” అని ఆయన అంటున్నారు.

బలహీన ఆరోగ్య వ్యవస్థ

"భారత్‌లో సగటున ప్రతి 1,000 మందికి కేవలం 0.7 పడకలే ఉన్నాయి. 1,000 మంది జనాభాకు కేవలం 0.8 మంది వైద్యులే ఉన్నారు. దేశంలో వైద్య ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉందనడానికి మహారాష్ట్రను ఉదాహరణగా చూడొచ్చు. 12.6 కోట్ల జనాభా కలిగిన ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 450 వెంటిలేటర్లు, 502 ఐసీయూ పడకలు మాత్రమే ఉన్నాయి. కరోనావైరస్‌తో సమస్య ఏంటంటే, కొంతమంది రోగుల్లో బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదు. దాంతో, వారికి తెలియకుండానే వ్యాధిని ఇతరులకు వ్యాప్తి చేస్తున్నారు. కాబట్టి, సింగపూర్‌ తరహాలో భారీ మొత్తంలో పరీక్షలు చేస్తూ, రోగులను గుర్తించాలి. వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక మార్గం అదే. అయితే, అంత విస్తృతమైన కార్యక్రమాలు చేపట్టేందుకు భారత్‌లో సరైన సదుపాయాలు లేవు" అని ప్రొఫెసర్ చెప్పారు.

ఆర్థిక వ్యవస్థల గురించి అనేక ప్రభుత్వాలకు ప్రొఫెసర్ హాంకీ సలహాలు ఇస్తుంటారు.

"కరోనావైరస్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో విజయవంతమైన దేశాలన్నీ ముందస్తు ప్రణాళికలతో ముందుకెళ్లాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఖచ్చితమైన, శస్త్ర చికిత్స లాంటి విధానాలను అనుసరించారు. వాటిని 5Ps అంటారు (ప్రయర్ ప్రిపరేషన్ ప్రివెంట్స్ పూర్ పర్ఫామెన్స్)" అని ఆయన వివరించారు.

పాకిస్తాన్‌లో ప్రభుత్వం మాట వినని మతాధికారులు

పాకిస్తాన్‌లోని మతాధికారుల సంఘం లాక్‌డౌన్‌ నిబంధనలను ధిక్కరించి మసీదులను తెరిచింది. ఏప్రిల్ 24 లేదా 25 నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో మసీదులు తెరిచే ఉంటాయని అక్కడి మతపెద్దలు ప్రకటించారు.

వారి తీరుపై ప్రొఫెసర్ హాంకీ స్పందిస్తూ, ముల్లాలకు చట్టాలపై గౌరవం లేదని వ్యాఖ్యానించారు. "పాకిస్తాన్ సమస్య ఏంటంటే, జనాలను అదుపు చేయలేని దేశాన్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలిస్తున్నారు. అక్కడ చట్టాలు పనిచేయడం లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తమకు నచ్చకపోతే మత సంప్రదాయవాదులు చట్టాలను యథేచ్ఛగా ధిక్కరిస్తారు. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తామని మతాధికారి ముఫ్తీ మునీబ్ ఉర్ రెహ్మాన్ అంగీకరించారు. అయినా మార్పు లేదు. పాకిస్తాన్ అంతటా మసీదులు తెరిచే ఉన్నాయి. పాకిస్తాన్‌లో అలా ఉంటే, మిగతా అన్ని ముస్లిం దేశాల్లో దాదాపు అంతటా మసీదులను మూసివేశారు. ఎక్కువ మంది గుమిగూడే మతపరమైన సమావేశాలను నిషేధించారు” అని ఆయన చెప్పారు.

సంక్షోభసమయంలో ప్రభుత్వాల స్పందన

మహమ్మారిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టడంలో ఆలస్యం చేశారనే విమర్శలు చాలా ప్రభుత్వాలపై ఉన్నాయి.

"రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎంతటి సంక్షోభం తలెత్తిందో, ప్రస్తుతం కరోనావైరస్ వల్ల కూడా ప్రపంచం అలాంటి సంక్షోభన్నే ఎదుర్కొంటోంది. సంక్షోభం పెద్దదైనా, చిన్నదైనా... ప్రతిసారీ ప్రభుత్వాలపై ఏదో విధంగా ప్రజల ఆగ్రహం ఉంటుంది. ప్రభుత్వ విధానాలు, చర్యలే ఆ సంక్షోభానికి కారణమైనా, లేక సంక్షోభం వల్ల కలిగే నష్టాలను తగ్గించడంలో ప్రభుత్వాలు విఫలమైనా... రెండింటికీ తేడా ఏమీ లేదు. సంక్షోభ సమయాల్లో ప్రభుత్వాల స్పందన ఎప్పుడూ ఒకే విధంగానే ఉంటుంది. తన పరిధిని, స్థాయిని మరింత విస్తరించుకోవాలన్న కోణంలో ఆలోచిస్తుంటాయి. ఆ విస్తరణలు చాలా రూపాలు తీసుకుంటాయి. కానీ, అవన్నీ సమాజంపై, ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వాల అధికార వినియోగాన్ని మాత్రమే పెంచుతాయి. సంక్షోభం ముగిసిన తర్వాత కూడా చాలాకాలం పాటు ఆ అధికార దాహం కొనసాగుతుంది. వాస్తవానికి, ప్రతి సంక్షోభమూ దేశ అధికార బలాన్ని, పరిధిని, స్థాయిని పెంచుతుంది" అని ప్రొఫెసర్ హాంకీ వివరించారు.

"భారత్‌లో కరోనావైరస్ సంక్షోభం కంటే ముందే అధికార దాహం పట్ల తన సహజ ప్రవృత్తిని మోదీ ప్రదర్శించారు. ఇప్పుడు కరోనావైరస్‌తో, మీడియాను తనవైపు తిప్పుకునేందుకు ఆయన ప్రయత్నిస్తారు. ఈ సంక్షోభాన్ని తమ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుదన్న దాని గురించి "స్ఫూర్తిదాయక, సానుకూలమైన కథనాలను" ప్రచురించాలని మీడియాకు సూచిస్తారు” అని హాంకీ చెప్పుకొచ్చారు.

ట్రంప్ వ్యాఖ్యలపై హాంకీ ఏమన్నారంటే..

చైనాలో వైరస్ వ్యాప్తి మొదలయ్యాక ప్రపంచ ఆరోగ్య సంస్థ తొందరగా స్పందించి ఉంటే పరిస్థితి ఇంతటి దాకా వచ్చేది కాదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ప్రొఫెసర్ హాంకీ మాట్లాడుతూ... "కరోనావైరస్ వ్యాప్తి విషయంలో నిందను ట్రంప్ పూర్తిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మీదికి నెట్టివేయట్లేదు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆ సంస్థ సరిగా స్పందించలేదని, చైనాకు అనుకూలంగా వ్యవహరించిందన్నది ఆయన చెబుతున్న మాట" అని అన్నారు.

“వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో చైనా కమ్యూనిస్టులు సమర్థంగా పనిచేశారంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ప్రశంసించారు. రాజకీయంగా అత్యధికంగా విమర్శలు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సంస్థల్లో డబ్ల్యూహెచ్‌ఓ ఒకటి. దానిని ఏనాడో మూసేసి, మ్యూజియంలో పెట్టి ఉండాల్సింది” అని ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు.

సింగపూర్ ఎలా ఎదిగింది?

కరోనాను కట్టడి చేయడంలో సింగపూర్‌ వ్యవహరించిన తీరును ప్రొఫెసర్ హాంకీ ప్రశంసించారు.

"సింగపూర్‌ను చూడండి. 1965లో ఆ చిన్న దేశం ఏర్పడినప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఉండేవి. అలాంటిది ఆ చిన్న ద్వీపం ఇవాళ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది. లీ కువాన్ యూ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ఫలితమే అది. ఆయన ప్రభుత్వం స్వేచ్చా- మార్కెట్‌ వ్యూహాన్ని, 5 Psని అమలు చేసింది. అందుకే, ఇవాళ ఆ దేశం అవినీతి రహిత, సమర్థవంతమైన ప్రభుత్వంతో ప్రపంచంలోని అగ్రశ్రేణి స్వేచ్ఛా-మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలోనూ అది చాలా దేశాల కంటే మెరుగ్గా పని చేసిందనడంలో ఎలాంటి అనుమానం లేదు” అని ప్రొఫెసర్ వివరించారు.

భారీ మొత్తంలో పరీక్షలు అత్యవసరం

సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే నిర్ణయాత్మక చర్యలు చాలా ముఖ్యమని ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ అంటున్నారు.

"సంక్షోభంలో సమయమే మన శత్రువు. దానిని సమర్థంగా ఎదుర్కోవాలంటే పాలకులు నిర్ణయాత్మకంగా, ధైర్యంగా, వేగంగా వ్యవహరించాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలా చేయలేదు. ఆయన ఒక్కరే కాదు, ఇంకా చాలా దేశాల ప్రభుత్వాలు అంతకంటే మరింత నెమ్మదిగా పనిచేస్తున్నాయి. దీనికి ఒక కారణం, వూహాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను గురించి ప్రపంచానికి తెలియకుండా చాలాకాలం పాటు చైనా దాచిపెట్టడం, కమ్యూనిస్టు చైనా చేసిన పాపాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కప్పిపెట్టడం. ఇప్పటికీ కోవిడ్-19 పరీక్షలకు సంబంధించిన వివరాలను చైనా వెల్లడించడంలేదు" అని ఆయన చెప్పారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)