కరోనా వైరస్- కోవిడ్ వ్యర్థాలు ఎంత ప్రమాదకరం, వాటిని శుభ్రం చేయడం ఎలా

    • రచయిత, గురుప్రీత్ సైనీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లాక్‌డౌన్-2లో ఇళ్ల నుంచి బయటికు వెళ్లాలంటే మాస్కు వేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

నిన్న ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టగానే ఆకుల మధ్య నేలపై ఒక మాస్క్ పడిఉండడం కనిపించింది.

తర్వాత హఠాత్తుగా మనసు రివైండ్ అయింది. అలాంటి ఫొటోలను పీటీఐ ఫొటో జర్నలిస్ట్ రవి చౌధరి ఎన్నో తీశారు.

ఆ ఫొటోలు చూడగానే, కరోనా వారియర్స్ గురించి తలుచుకోగానే ఇప్పటివరకూ మీ మనసులో ఎలాంటి దృశ్యాలైతే మెదిలాయో వాటితోపాటూ ఒక కొత్త దృశ్యం కూడా కనిపిస్తుంది.

అది పారిశుద్ధ్య కార్మికులు ఆస్పత్రుల్లో కరోనా చెత్తను శుభ్రం చేస్తున్న దృశ్యం.

వారిని మీరు ఇప్పటివరకూ కరోనాతో పోరాడుతున్న యోధులుగా గుర్తించి ఉండకపోవచ్చు. కానీ ఈ కథనం మీరు వాళ్ల గురించి మళ్లీ ఆలోచించేలా చేస్తుంది.

కరోనావైరస్ తనతోపాటూ ఎన్నో సవాళ్లను తీసుకుని వచ్చింది. వాటిలో కరోనా వల్ల వ్యాపిస్తున్న వ్యర్థాలు కూడా ఒకటి.

కోవిడ్-19 రోగులకు చికిత్స, పరీక్షలు చేస్తున్నప్పుడు, వారిని క్వారంటీన్‌లో ఉంచినప్పుడు ఎన్నో రకాల వస్తువులను ఉపయోగిస్తుంటారు.

వ్యర్థాల నిపుణులు వివరాల ప్రకారం దేశంలో ప్రతిరోజూ ఒక రాష్ట్రంలో సగటున 1.5 టన్నుల కోవిడ్ వేస్ట్ బయటపడుతోంది.

కోవిడ్-19 వ్యర్థాలను తొలగించడానికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది,.

కోవిడ్ వ్యర్థాల హ్యాండిలింగ్, ట్రీట్‌మెంట్, డిస్పోజింగ్ పనులను సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2016, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ ప్రకారం చేయాలని అందులో చెప్పారు.

సర్జరీల నుంచి వచ్చినవి అయినా, మందుల నుంచి వచ్చినా, లేక చికిత్స సమయంలో పేరుకున్నవి అయినా ఆస్పత్రుల నుంచి బయటికి వచ్చే అన్నిరకాల వ్యర్థాలను ‘బయోమెడికల్ వేస్ట్’ అంటారు.

ప్రభుత్వ మార్గదర్శకాలు

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఐసొలేషన్‌ వార్డులు, కలెక్షన్ సెంటర్లు, టెస్టింగ్ ల్యాబ్స్ లో వ్యర్థాల కోసం వేరే నిబంధనలు ఉన్నాయి. క్వారంటీన్ సెంటర్లు, హోమ్ క్వారంటీన్ల కోసం మరో రకం నిబంధనలు ఉన్నాయి.

ఐసొలేషన్‌ వార్డులు, కలెక్షన్ సెంటర్లు, టెస్టింగ్ ల్యాబ్స్: కోవిడ్-19 వ్యర్థాల కోసం రకరకాల రంగుల్లో ఉన్న రెండు పొరల సంచులు లేదా డబ్బాలు పెట్టాల్సి ఉంటుంది. వాటిపై స్పష్టంగా లేబుల్స్ అతికించి ఉండాలి. కోవిడ్ వ్యర్థాలను ఏ ట్రాలీల్లో తీసుకెళ్తున్నారో, వాటికి వేరే చెత్తను తీసుకెళ్లడానికి ఉపయోగించకూడదు. కోవిడ్-19 చెత్తను హ్యాండిల్ చేసే శానిటేషన్ సిబ్బందిని వేరే విధుల్లో పెట్టడం, వేరే వ్యర్థాలను తీసుకెళ్లడానికి పంపించడం లాంటివి చేయడానికి పంపించకూడదు.

క్వారంటీన్ సెంటర్లు: బయోమెడికల్ వ్యర్థాలను పసుపు సంచుల్లో సేకరించాల్సి ఉంటుంది. తర్వాత ఆ బయోమెడికల్ వ్యర్థాలను ట్రీట్‌మెంట్ ఫెసిలిటీకి పంపించాల్సి ఉంటుంది. రోజూ తీసే చెత్తను సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2016 నిబంధన ప్రకారం నిర్మూలిస్తారు.

హోం క్వారంటీన్: ఇళ్లలో ఉన్న వారు బయోమెడికల్ వ్యర్థాలను వేరు చేసి పసుపు సంచుల్లో ఉంచాల్సి ఉంటుంది. తర్వాత ఈ చెత్తను వ్యర్థాలు సేకరించడానికి స్థానిక యంత్రాంగం ఏర్పాటు చేసిన సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రభుత్వం మార్గదర్శకాలు ఏర్పాటు చేసినా, వాటిని అమలు చేయడానికి చాలా రకాల సవాళ్లు ఎదురవుతున్నాయి.

ప్రమాదంలో సిబ్బంది భద్రత

ఆస్పత్రుల్లో కరోనా చెత్తను ఎలా సేకరిస్తున్నారు, వాటిని ఎలా తీసుకెళ్తున్నారు అనే అంశంపై బీబీసీ చాలా ప్రైవేటు ఆస్పత్రులు, ప్రభుత్వ ఆస్పత్రులతో మాట్లాడింది. ఎయిమ్స్, మాక్స్ లాంటి ఆస్పత్రులు తాము కలర్ కోడింగ్ ఉన్న సంచుల్లో చెత్తను వేరుగా ఉంచుతున్నామని చెప్పాయి.

ప్రత్యేకంగా వ్యర్థాల సేకరణ కోసమే పనిచేసే సిబ్బందిని కూడా నియమించామని చెప్పాయి. వేస్ట్ మేనేజ్‌మెంట్ నిపుణులు అసద్ వార్సీ కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తున్నారు.

“వ్యర్థాలను తీసుకెళ్లేవారికి, చెత్తను సేకరించేవారికి కూడా పీపీఈ ఇవ్వాలని మార్గదర్శకాల్లో చెప్పారు. వారు వాటిని ఎప్పుడూ ధరించి ఉండాలి. ఈ పీపీఈలో త్రీ-లేయర్ మాస్క్, గౌన్, హెవీ-డ్యూటీ గ్లవ్, గమ్ బూట్స్, సేఫ్టీ గాగుల్ ఉండాలి. కానీ అక్కడే సమస్య వస్తోంది” అన్నారు.

ఎయిమ్స్‌ లో దిల్లీ ఆస్పత్రుల్లోని కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ జనరల్ సెక్రటరీ మృగాంక్ కూడా బీబీసీతో మాట్లాడారు. మా ఆస్పత్రిలో ఎక్కువ శానిటేషన్ స్టాఫ్, కాంట్రాక్టుకు పనిచేస్తున్నారు. దిల్లీ ఎయిమ్స్ విషయానికి వస్తే అక్కడ సుమారు 600 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారు అని చెప్పారు.

“కాంట్రాక్ట్ కార్మికులను ఆస్పత్రి వారు తమ సిబ్బందిగా భావించరు. వేస్ట్ మేనేజ్‌మెంట్ పనిచేసే శానిటేషన్ సిబ్బందికి మాస్కులు, శానిటైజేషన్ కోసం చాలా పోరాడాల్సి వస్తోంది. అవి తక్కువ ఉన్నాయని, అందుకే మొదట పర్మినెంట్ ఉద్యోగులకు ఇస్తామని ఆస్పత్రి మేనేజ్‌మెండట్ చెబుతోంది. వేస్ట్ డిస్పోజల్ చేసే శానిటేషన్ స్టాఫ్‌కు కూడా ప్రొటెక్టివ్ గేర్ అవసరం ఉంటుంది. అప్పుడే వారు ఆ వ్యర్థాలు తగలకుండా దూరంగా ఉంటారు. వాటిని మొదట్లో ఇచ్చేవారు కాదు. మేం ఆస్పత్రి మేనేజ్‌మెంటుకు లేఖలు రాసిన తర్వాత, ఇప్పుడు కొన్ని చోట్ల ఇవ్వడం మొదలైంది. కానీ, ఆ సమస్య ఇప్పటికీ పూర్తిగా తీరలేదు” అన్నారు.

“ఈ చెత్తను సేకరించి బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీ వరకూ తీసుకెళ్లే వర్క్ ఫోర్స్, ఫెసిలిటీ వర్క్ ఫోర్స్ కు కూడా తగిన టెస్టింగ్, భద్రత కిట్ అందించడం లేదు. పెద్ద పెద్ద నగరాల్లో వారికి పీపీఈ ఇస్తున్నప్పటికీ, చిన్న పట్టణాల్లో వాటికి చాలా కొరత ఉంది” అని అసద్ వార్సీ చెబుతున్నారు.

వేస్ట్ ఫెసిలిటీ కొరత

కోవిడ్ వ్యర్థాలు సేకరించడం కోసమే ఉద్దేశించిన వాహనాలను, కామన్ బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీకి తీసుకొస్తారు. అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య వాటిని కాల్చేస్తారు. కానీ ఈ సౌకర్యం కూడా దేశంలో ప్రతి చోటా లేదు.

అసద్ వార్సీ ఆల్ ఇండియా కామన్ బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు.

“దేశంలో 200 నుంచి 250 ఫెసిలిటీలు ఉన్నాయి. అవి 600 నుంచి 700 పట్టణాల చెత్తను కవర్ చేస్తుంటాయి. కానీ చాలా చిన్న పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ సౌకర్యం లేదు” అని ఆయన చెప్పారు.

టెరీ(ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్)లో ఎన్విరాన్‌మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ డివిజన్‌లో పనిచేసే సౌరభ్ మనూజా ఇప్పటికీ మనం బయోమెడికల్ వ్యర్థాలను పూర్తిగా ట్రీట్‌ చేయలేకపోతున్నారని చెప్పారు.

“2017లో వచ్చిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం ప్రతి రోజూ 559 టన్నుల బయోమెడికల్ వేస్ట్ ఉత్పత్తి అవుతుంది. అందులో సుమారు 92 శాతం వరకూ మనం ట్రీట్ చేస్తున్నాం. ప్లాంట్స్ కెపాసిటీ తక్కువ కావడంతో మనం మిగతా వ్యర్థాలను ట్రీట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఆ సవాలు మరింత పెరిగింది” అన్నారు.

అయితే మార్గదర్శకాల్లో కామన్ బయోమెడికల్ వేస్ట్ ఫెసిలిటీలకు అదనపు గంటలు పనిచేయడానికి కూడా అనుమతి ఇస్తామని, ఈ ఫెసిలిటీ లేని ప్రాంతాల్లో లోతైన గుంట తవ్వి చెత్తను పూడ్చిపెట్టాలని చెప్పారు.

కానీ, కోవిడ్-19 వల్ల ప్రస్తుతం ఎంత భారీగా చెత్త పేరుకుంటోంది అంటే, దాన్నంతా ప్రాసెస్ చేయడం కూడా సవాలుగా మారింది అని వ్యర్థాల నిపుణులు చెబుతున్నారు.

క్వారంటీన్ హోమ్

అధికార యంత్రాంగం, హెల్త్ డిపార్టుమెంట్ మాత్రం ప్రొటోకాల్ ప్రకారమే కోవిడ్ వ్యర్థాల సేకరణ జరుగుతోందని చెబుతున్నాయి. కానీ, ఇక్కడ రెండు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి.

ఏ ఇల్లు క్వారంటైన్‌లో ఉంది అనే దానిపై ఎలాంటి గణాంకాలూ లేవు. అంటే వారంతా ఇంటి బయట ఉన్న క్వారంటైన్ స్టిక్కర్ చూసి పనిచేస్తున్నారు. ఒకవేళ స్టిక్కర్ లేకపోయినా, లేదా స్టిక్కర్ తొలగించినా అది సమస్యగా మారవచ్చు.

దానితోపాటు ఆ ఇంట్లో ఉన్న వారు కోవిడ్ వ్యర్థాలను వేరు చేసి ఉంచుతున్నారా, లేదా? అని వారు ఇళ్లలోకి వెళ్లి చెక్ చేయలేకపోవడం కూడా ఒక సమస్యే.

సామాన్యులు, ఇళ్ల నుంచి సమస్య

సామాన్యులు, పోలీసులు, పాలనా యంత్రాంగం కూడా కరోనావైరస్ నుంచి తమను కాపాడుకోడానికి మాస్కులు, గ్లవ్స్ లాంటివి ఉపయోగిస్తున్నారు.

ఇళ్ల నుంచి ఒకేసారి చెత్తను సేకరిస్తున్నారు. ఇళ్లలో చెత్తను సేకరించడానికి కూడా ఒక నిర్ధారిత పద్ధతి అంటూ ఏదీ లేదు. పెద్ద పట్టణాల్లో కొన్ని పద్ధతులు ఉన్నప్పటికీ, చిన్న, గ్రామీణ ప్రాంతాల్లో అలా పద్ధతులు ఏవీ పాటించడం లేదు.

బహిరంగ ప్రాంతాల్లో లేదా రోడ్లపై ఉపయోగించి పడేసిన మాస్కులు, గ్లవ్స్ లాంటివి కనిపిస్తున్న ఫొటోలు కూడా చాలా కనిపిస్తున్నాయి.

అటు సౌరభ్ కూడా “ఇళ్ల నుంచి వస్తున్న జనరల్ చెత్తలో ప్లాస్టిక్, కార్డ్ బోర్డు, మెటల్ లాంటి వస్తువులు కూడా ఉంటున్నాయి. వాటిపైన కరోనావైరస్ ఉండిపోతుంది. ఈ వైరస్ లైఫ్ 24 నుంచి 72 గంటలు మధ్య ఉంటుంది. దానివల్ల చెత్త సేకరించేవారికి ఇన్ఫెక్షన్ రావచ్చు. దానివల్ల వారికి కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు మరింత పెరగవచ్చు” అన్నారు.

హరియాణాలో కరోనా నోడల్ ఆఫీసర్ ధ్రువ్ చౌధరి “ఇది ఒక పెద్ద సవాలు. ఎందుకంటే భారత్‌లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం అలవాటు కావడం లేదు. అలాంటి సమయంలో బయోమెడికల్ చెత్తను వేరు చేసి ఉంచడం అనేది మరో పెద్ద సవాలు లాంటిదే” అన్నారు.

“చెత్తంతా ఒకే దగ్గర పోగేయడం లాంటి జీవనానికి జనం అలవాటు పడిపోయారు. అలాంటి పద్ధతులను ఒకేసారి మార్చడం కుదరదు. వాటిని మార్చడానికి సమయం పడుతుంది. కానీ కాలంతోపాటూ ఆ మార్పు కూడా వస్తుందని మనం ఆశించాలి. అధికార యంత్రాంగం ఆ మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి” అన్నారు.

దీనికి పరిష్కారం ఏంటి?

దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వ్యర్థాల నిపుణులు చెబుతున్నారు.

“చెత్తను వేరు చేయడం గురించి వారికి వివరంగా చెప్పాలి. వేరు చేసిన తర్వాతే వ్యర్థాలను సేకరించే పద్ధతిని అమలు చేయాలి” అన్నారు.

“వైరస్ 72 గంటలు అంటే దాదాపు మూడు రోజులపాటు సజీవంగా ఉంటుందని వారికి చెప్పాలి. అందుకే, కోవిడ్ వ్యర్థాలను చెత్తబుట్టలో పడేసే ముందు, ఎవరికీ తగలకుండా వాటిని బ్యాగ్ లేదా పాలిథీన్‌ కవర్లో వేసి గాలి చొరబడకుండా బిగించాలి. అలా 72 గంటలపాటు వదిలేయాలి. తర్వాత ఆ చెత్తను వ్యర్థాలు సేకరించేవారికి ఇవ్వాలి. అలా చేయడం వల్ల అది ఎవరికీ వ్యాపించకుండా ఆపవచ్చు”.

దానితోపాటు ఆఫీసుల్లో, పనులు చేసే ప్రాంతాల్లో వేరు వేరు చెత్త కోసం వేరు వేరు సంచులు కూడా పెట్టాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)