You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నెలసరిలో ఉన్నారేమో అని విద్యార్థినులను దుస్తులు విప్పించి చెక్ చేశారు
నెలసరిలో ఉన్నామా లేదా అన్నది తెలుసుకోవడానికి తమ దుస్తులు విప్పించి చెక్ చేసి మానసికంగా వేధించారని గుజరాత్ రాష్ట్రం భుజ్‌లోని సహజానంద్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
ఈ కాలేజ్ 'శ్రీ స్వామినారాయణ్ కన్యా విద్యామందిర్ సంస్థాన్'కు చెందిన ఒక విద్యాసంస్థ.
బాధిత విద్యార్థినులు బుధవారం బీబీసీతో మాట్లాడుతూ "మేం పీరియడ్స్‌లో ఉన్నామా లేదా అనేది పరిశీలించడానికి హాస్టల్ నిర్వాహకుల ముందు మా బట్టలు విప్పాల్సివచ్చింది" అని చెప్పారు.
హాస్టల్ నిర్వాహకులు చేసిన పని తమను మానసికంగా కుంగదీసిందని.. వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై బీబీసీ కోసం స్థానిక జర్నలిస్ట్ ప్రశాంత్ గుప్తా బాధిత విద్యార్థినులతో మాట్లాడారు.
అసలేం జరిగింది?
"హాస్టల్ నిర్వాహకులు తమను క్యాంపస్ మధ్యలో కూర్చోపెట్టి ఒక్కో విద్యార్థినినీ వాష్ రూంకి తీసుకెళ్లేవారు. అక్కడ బట్టలు విప్పించి, రుతుస్రావం జరుగుతుందా లేదా అని చూసేవారు" అని ఒక విద్యార్థిని చెప్పారు.
"వారు మమ్మల్ని తాకేవారు కాదు, కానీ మాటిమాటికీ మాటలతో మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. దాంతో మా అంతట మేం వెళ్లి చెక్ చేయించుకోవాల్సి వచ్చేది" అన్నారు మరో విద్యార్థిని.
ఈ ఘటనలో ప్రమేయం ఉన్న హాస్టల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.
"వారిపై చట్టపరమైన దర్యాప్తు జరిపించాలని ట్రస్టీని కూడా వెళ్లి కలిశాం. హాస్టల్ ఇన్‌చార్జిలతో మాకు క్షమాపణ చెప్పిస్తానని అన్నారాయన. కానీ, చట్టపరమైన చర్యలకు మేం గట్టిగా పట్టుబట్టడంతో, తాను వారితో క్షమాపణలు మాత్రమే చెప్పించగలనని, వినకపోతే "మీరు ఏం చేస్తారో చేసుకోండి, మేం చేయాల్సింది మేం చేస్తాం" అని బెదిరించారని విద్యార్థినులు చెప్పారు.
కాలేజ్ ప్రిన్సిపల్ రీతాబెన్, కో-ఆర్డినేటర్ అనితాబెన్, స్కూల్ ప్రిన్సిపల్ దక్షాబెన్ తమను ఆఫీస్‌లోకి పిలిపించారని.. హాస్టల్ వారికి, మాకు నచ్చజెపుతూ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు.
ఈ విషయం ఇక్కడితో వదిలేస్తామని వారు తమతో లిఖిత పూర్వకంగా రాయించుకున్నట్లు విద్యార్థినులు చెప్పారు.
సంప్రదాయలకు తాము వ్యతిరేకం కాదన్న విద్యార్థినులు.. ఇలా మానసికంగా వేధించినందుకు మాత్రం హాస్టల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని కోరారు.
బీబీసీతో మాట్లాడిన ఒక విద్యార్థిని తండ్రి "అమ్మాయిలు మానసికంగా చాలా భయపడిపోయి ఉన్నారు. మాకు చాలా కోపం వస్తోంది. వాళ్ల మీద చర్యలు తీసుకోవాల్సిందే" అన్నారు.
ఎందుకిలా చేశారు.. యూనివర్సిటీ చాన్సలర్ ఏమంటున్నారు
భుజ్‌లో ఉన్న క్రాంతిగురు శ్యామ్ కృష్ణవర్మ కచ్ యనివర్సిటీ వైస్ చాన్సలర్ ఢొలకియా బీబీసీతో మాట్లాడుతూ ఈ అంశం కాలేజీది కాదు, అది హాస్టల్‌కు సంబంధించినదని చెప్పారు.
"హాస్టల్‌కు సంబంధించినంత వరకూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అక్కడ రుతుస్రావంలో ఉన్న వారు భోజనం చేసే దగ్గరకు వెళ్లకూడదు. కానీ కొంతమంది యువతులు ఆ నియమాన్ని ఉల్లంఘించారు. అక్కడకు వెళ్లి అందరితో కలిసి భోజనం చేస్తున్నారు. వారిని మహిళలే చెక్ చేశారు" అన్నారు.
ఈ ఘటనపై హాస్టల్ విద్యార్థినుల నుంచే మరో వాదన కూడా వినిపిస్తోంది. కొంతమంది అమ్మాయిలు కావాలంటే తమను చెక్ చేసుకోవచ్చని తమకు తాముగా నిర్వాహకులకు చెప్పారని కొందరు విద్యార్థినులు చెబుతున్నారు.
సమగ్ర దర్యాప్తు జరిపిస్తాం-ట్రస్టీ
ఈ హాస్టల్లో పీరియడ్స్‌లో ఉన్న విద్యార్థినులు ఒక రిజిస్టర్‌లో తమ పేర్లను నమోదు చేయాల్సి ఉంటుంది.
"పీరియడ్స్‌లో ఉన్నప్పుడు నిబంధనలు పాటించాలని మాకు అందరికీ చెప్పారు. కానీ ఏ అమ్మాయీ దానిని పాటించడం లేదు. పీరియడ్స్‌లో ఉన్నా రెండు నెలలుగా నిబంధనలు పాటించడం లేదు. రిజిస్టర్‌లో ఎవరూ తమ పేర్లు రాయడం లేదు" అని ఒక విద్యార్థిని చెప్పింది.
"రిజిస్టర్‌లో ఎవరి పేర్లు లేకపోవడంతో, మా మిస్'మీలో ఇప్పుడు ఎవరు పీరియడ్స్‌లో ఉన్నారు' అని అడిగారు. అందరూ, 'మాలో ఎవరూ లేరు' అని చెప్పారు. కొందరు అమ్మాయిలు 'కావాలంటే మమ్మల్ని చెక్ చేసుకోండి' అన్నారు. అప్పుడు పీరియడ్స్ ఉన్నట్టు ఎవరికీ కనిపించలేదు. కానీ, ఆ తర్వాత రోజే వాళ్లు హాస్టల్ నిర్వాహకులపై ఈ ఆరోపణలు చేశారు" అని ఆ విద్యార్థిని వివరించింది.
ఈ ఘటనపై బీబీసీతో మాట్లాడిన శ్రీ స్వామినారాయణ్ కన్యా విద్యామందిర్ సంస్థాన్ ట్రస్టీ ప్రవీణ్ పిండోరియా "ఈ సంస్థ ఎన్నో ఏళ్ల నుంచీ నడుస్తోంది. ఇలా ఎప్పుడూ జరగలేదు, ఇది మాకు షాక్‌లా అనిపిస్తోంది. ఈ ఘటనపై మేం సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తాం" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
- ‘మిస్సింగ్ 54’ మిస్టరీ: ఆ భారత సైనికులు ఏమయ్యారు... దశాబ్దాలుగా పాకిస్తాన్‌లోనే మగ్గుతున్నారా?
- విశాఖపట్నం: సముద్రంలో ‘స్వచ్ఛ భారత్’ చేస్తూ ప్రధాని మోదీ మెప్పు పొందిన స్కూబా డైవర్లు
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- గూగుల్ కన్నా వందేళ్ల ముందే డేటాతో సంపన్నుడైన ఘనుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)