You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నిర్భయ దోషుల ఉరిశిక్ష మళ్లీ వాయిదా
నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరిశిక్షల అమలు మరోసారి వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు శిక్షలు అమలు చేయవద్దని దిల్లీలోని ఓ కోర్టు స్టే విధించింది.
2012, డిసెంబర్ 16న దిల్లీలో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలు దోషులుగా తేలిన సంగతి తెలిసింది.
ఇదివరకు ఈ కేసులో దోషులను ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు ఉరి తీయాలని దిల్లీలోని పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది.
దీనికి ముందు జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు వారెంట్ జారీ చేసినా, అప్పుడు కూడా అది వాయిదా పడింది.
"దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ నాతో సవాలు చేశారు. దోషులకు ఎప్పటికీ ఉరిశిక్ష పడనివ్వను అని ఆయన అన్నారు. నా పోరాటం కొనసాగిస్తాను. ప్రభుత్వం వారిని ఉరి తీయాలి" అని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు.
"ఇలాంటి దారుణమైన నేరాలకు పాల్పడ్డవారు న్యాయవ్యవస్థలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత కూడా శిక్షను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాటిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది" అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ కేసులో ఎప్పుడేం జరిగింది?
2012 డిసెంబర్ 16: 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థినిపై నడుస్తున్న బస్సులో ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. విద్యార్థిని, ఆమె పురుష స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. ఇద్దరినీ రోడ్డు పక్కన విసిరేశారు.
2012 డిసెంబర్ 17: ప్రధాన నిందితుడు, బస్ డ్రైవర్ రామ్ సింగ్‌ను అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అతడి తమ్ముడు ముకేశ్ సింగ్, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ వినయ్ శర్మ, పండ్లు అమ్మే పవన్ గుప్తా, బస్ హెల్పర్ అక్షయ్ ఠాకూర్, 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు.
2012 డిసెంబర్ 29: సింగపూర్‌లోని ఒక ఆస్పత్రిలో బాధితురాలి మృతి. శవాన్ని తిరిగి దిల్లీకి తీసుకొచ్చారు.
2013 మార్చి 11: నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు అతడు అత్మహత్య చేసుకున్నాడని చెబితే, అతడి తరఫు వకీలు, కుటుంబ సభ్యులు మాత్రం అది హత్య అని ఆరోపించారు.
2013 ఆగస్టు 31: జువైనల్ జస్టిస్ బోర్డ్ మైనర్ నిందితుడిని దోషిగా తేల్చింది. మూడేళ్లపాటు జువైనల్ హోంకు పంపింది.
2013 సెప్టెంబర్ 13: ట్రయల్ కోర్టు నలుగురు నిందితులను దోషిగా ఖరారు చేస్తూ, ఉరిశిక్ష విధించింది.
2014 మార్చి 13: దిల్లీ హైకోర్టు ఉరిశిక్షను సమర్థించింది.
2014 మార్చి-జూన్: నిందితులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ ఉరిశిక్షపై స్టే విధించింది.
2017 మే: హైకోర్టు, ట్రయల్ కోర్టు ఉరిశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.
2018 జులై: సుప్రీంకోర్టు ముగ్గురు దోషుల రివ్యూ పిటిషన్ కొట్టివేసింది.
2019 డిసెంబర్ 6: కేంద్ర ప్రభుత్వం ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి దగ్గరకు పంపింది. మంజూరు చేయవద్దని సిఫారసు చేసింది.
2019 డిసెంబర్ 12: తలారిని పంపించాలని ఉత్తరప్రదేశ్ జైలు అధికారులను తీహార్ జైలు అధికారులు కోరారు.
2019 డిసెంబర్ 13: ఉరిశిక్ష తేదీని నిర్ణయించాలని నిర్భయ తల్లి తరఫున పటియాలా హౌస్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దాంతో, నలుగురు దోషులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పటియాలా కోర్టులో హాజరుపరిచారు.
2020 జనవరి 7: డెత్ వారెంట్ జారీ చేసిన పటియాలా కోర్టు, జనవరి 22 ఉదయం 7 గంటలకు మరణశిక్ష అమలుచేయాలని ఆదేశం.
2020 జనవరి 15: నలుగురిలో ఒక దోషి క్షమా భిక్ష కోసం చేసుకున్న అర్జీ ఇంకా రాష్ట్రపతి దగ్గరే ఉండటం వల్ల జనవరి 22న ఉరి శిక్షను అమలు చేయట్లేదని వెల్లడించిన దిల్లీ ప్రభుత్వం.
2020 జనవరి 17: ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు దోషులకు మరణశిక్ష అమలు చేయాలని కొత్త డెత్ వారెంట్ జారీ చేసిన దిల్లీలోని పటియాలా కోర్టు.
2020 జనవరి 31: నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు
ఇవి కూడా చదవండి.
- నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్, ఫిబ్రవరి 1న ఉరిశిక్ష
- నిర్భయ ఘటనకు ఏడేళ్లు.. మహిళలపై నేరాల విషయంలో దేశం ఎంత మారింది
- రేపిస్టులను ఉరి తీయాలనే వాదనలు సరే... బాధితుల బాగోగుల సంగతేమిటి...
- ఆంధ్రప్రదేశ్: అత్యాచార కేసుల్లో ‘21 రోజుల్లో’ మరణశిక్ష... ఇంకా 'దిశ' బిల్లులో ఏముంది?
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- ’‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)