చంద్రగ్రహణం: ఈరోజు ఎప్పుడు మొదలవుతుంది... ఎలా కనిపిస్తుంది?

కొన్నిరోజుల క్రితం కనిపించిన అద్భుత సూర్యగ్రహణం తర్వాత, ఇప్పుడు చంద్రగ్రహణం రాబోతోంది. ఇది భారత్‌లో కూడా కనిపించబోతోంది.

ఈ చంద్రగ్రహణం జనవరి 10న, శుక్రవారం భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 37 నిమిషాలకు ప్రారంభమై, దాదాపు నాలుగు గంటల వరకూ కొనసాగనుంది.

ఇది జనవరి 11న వేకువజామున 2 గంటల 42 నిమిషాలకు ముగుస్తుంది. దీనిని భారత్‌ సహా మిగతా ఆసియా దేశాల్లో, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో కూడా చూడవచ్చు.

ఈ గ్రహణాన్ని రాత్రి 12.45కు స్పష్టంగా చూడచ్చు. ఆ సమయంలో చంద్రుడి 90 శాతం భాగం భూమి నీడ పడడంతో మసకగా కనిపిస్తుంటుంది.

ఈరోజు రాత్రి ఏర్పడబోయే చంద్రగ్రహణాన్ని 'పెనంబ్రల్' అంటే 'ఉప చాయాగ్రహణం' అంటారు. అంటే భూమి ప్రధాన నీడ కాకుండా, బయటి నీడ చంద్రుడిపై పడుతుంది. దానివల్ల చంద్రుడి వెలుగు మసకబారినట్టు ఉంటుంది.

2020లో మొత్తం ఆరు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, నాలుగు చంద్రగ్రహణాలు. ఈరోజు ఏర్పడబోతున్న చంద్రగ్రహణం తర్వాత జూన్ 5న, జులై 5న, నవంబర్ 30న చంద్రగ్రహణాలు చూడవచ్చు.

వీటితోపాటు జూన్ 21న ఒక సూర్యగ్రహణం, డిసెంబర్ 14న మరో సూర్యగ్రహణం ఏర్పడబోతున్నాయి. కొన్ని వారాల క్రితమే, అంటే గత ఏడాది డిసెంబర్ 26న ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపించింది.

చంద్రగ్రహణం ఏప్పుడు ఏర్పడుతుంది?

భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ చంద్రుడు-సూర్యుడు మధ్యకు వచ్చినపుడు చంద్రుడు భూమి నీడలో ఉండిపోతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు తమ కక్ష్యలో ఒకదానికొకటి నేరుగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా గ్రహణం కనిపిస్తుంది.

పౌర్ణమి రోజున సూర్యుడు, చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినపుడు దాని నీడ చంద్రుడిపై పడుతుంది. దాంతో చంద్రుడిపై భూమి నీడ ఉన్న భాగం చీకటిగా అయిపోతుంది.

మనం ఆ స్థితిలో భూమి నుంచి చంద్రుడిని చూసినపుడు మనకు ఆ భాగం నల్లగా కనిపిస్తుంది. అందుకే దానిని చంద్రగ్రహణం అంటాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)